పురుషులే ఎక్కువగా వాయించే భారీ తాళ వాయిద్యం తకిల్. అలాంటి వాయిద్యాన్ని ఒక మహిళ కళాకారిని అద్భుతంగా పలికించడమే కాదు ఓ కొత్త లయను సృష్టివచి ఆశ్చర్యపరిచింది. ఇంతవరకు అలాంటి వాయిద్యాన్ని పరికించిన మహిళామణి లేదు. అలాగే ఏకంగా శబరిమలలో అయ్యప్ప గుడిలో తకిల్ వాయించే మహిళా కళాకారిణిగా చరిత్ర సృష్టించింది ఈ వనిత. ఏడు పదుల వయసులోనూ అంతే అద్భుతంగా వాయిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోందామె.
ఆ మహిళే కేరళకు చెందిన పతియూర్ కమలం. ఆమె మొదటి గురువు తండ్రి గోపాల కృష్ణ పణికర్. ఆయన స్వయంగా దేవస్వం బోర్డులో తకిల్ విద్వాంసుడు. తన కుమార్తె ఆసక్తిని గమనించి సాధన కోసం తేలికపాటి తకిల్ వాయిద్యాన్ని తయారు చేయించారు. అలా ఎనిమిదేళ్ల ప్రాయంలోనే ఈ రంగంలోకి ప్రవేశించింది. శబరిమలలో తన తండ్రితో కలిసి ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఆమె వృత్తిపరమైన ప్రస్థానం ఊపందుకుంది. పెరున్న సుబ్రహ్మణ్య ఆలయం 'తైపూయం' ఉత్సవంలో ఆమె ఇచ్చిన అద్భుత ప్రదర్శన, కేరళ, తమిళనాడులోని వివిధ ఆలయాల నుంచి పెద్ద ఎత్తున ఆహ్వానాలలు వచ్చేందుకు దారితీసింది.
ఆమె భర్త 'ఇడక్క' (మరొక సాంప్రదాయ తాళ వాయిద్యం) కళాకారుడు. ఎనమిది మంది సంతానంలో మూడొవది అయిన కమలం తన సుదీర్ఘ వృత్తి జీవితంలో అనేక పురస్కారాలు అందుకున్నారు. 2019లో కేరళ సంగీత నాటక అకాడమీ ప్రతిష్టాత్మక 'గురుపూజ' అవార్డుతో ఆమెను సత్కరించింది. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఆమె కుమారుడు ప్రదీప్ జి. పణికర్ కూడా తకిల్ కళాకారుడిగా రాణిస్తున్నారు. కేరళ ప్రముఖ రచయిత ఆర్యద్ సనల్ కుమార్ కళాకారిణి కమలం జీవితం, ఆమె కళా ప్రస్థానంపై డాక్యుమెంటరీని రూపొందించారు. దీన్ని ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ డిసెంబర్‌లో ప్రదర్శించనున్నారు.
(చదవండి: జెన్ ఆల్ఫా పెంపకంపై ఆది సాయికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..!)


