పట్టుదల ఉండాలే కాని సాధించలేనిదంటూ ఏదీ లేదని మరోసారి రుజువైంది. భారతీయ అథ్లెటిక్స్‌లో ఒక ఆటోరిక్షా డ్రైవర్ కూతురు సత్తా చాటింది. ఢిల్లీలో గురువారం జరిగిన ఇండియన్ అథ్లెటిక్స్ ఫైనల్స్ సీరిస్‌లో నిర్వహించిన లాంగ్ జంప్ పోటీలో కేరళకి చెందిన యాన్సీ సోజన్ తొలిస్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ఆసియా క్రీడలకు ముందు ఇదే నాకు చివరి కాంపిటీషన్. జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమే నా లక్ష్యం. నన్ను ఎవరూ ్రపోత్సహించలేదు. చాలామంది నువ్వు ఏమీ సాధించలేవన్నట్టు మాట్లాడేవారు. మా నాన్న ఒక ఆటోడ్రైవర్. ఆయన కూడా మన పేరు మీద ఏ రికార్డ్ లేదమ్మా అన్నాడు. అందుకే నేను గెలిచి తీరతాను... మా నాన్నకి గోల్డ్ మెడల్‌ని బహుమతిగా ఇస్తా.’ అంటున్న యాన్సీ మనసు బంగారం కదా...
ఏడవ తరగతి నుంచే...
కేరళలలోని త్రిశూర్ జిల్లాలో ఉన్న తీర ప్రాంతం నట్టిక గ్రామమే యాన్సీ స్వస్థలం. ఆమె 2001, మార్చి1 జన్మించింది. యాన్సీ తండ్రి సోజన్ ఒక ఆటో రిక్షా డ్రైవర్, ఆమె తల్లి జాన్సీ కూడా అథ్లెట్. ఆమెకి క్రీడా నేపథ్యం ఉంది. ఏడో తరగతి నుంచే యాన్సీకి క్రీడల్లో శిక్షణ ఇప్పించారు. మొదట 100 మీ. 200మీ. స్ప్రింట్ చేసేది. కానీ తరచూ గాయాలవుతుండడం, అవసరమైన చికిత్స, పోషకాహారానికి ఆర్థికంగా స్థోమత లేకపోవడం వల్ల లాంగ్ జంప్‌పై దృష్టి పెట్టింది. 2019లో తొలిసారి జాతీయ స్థాయిలో యాన్సీ లాంగ్ జంప్ రికార్డ్ సాధించింది. 2022 ఆసియా క్రీడల్లో రజతం గెలిచి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత 2025లో ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం సా«ధించింది. 2026 మేలో ఫెడరేషన్ కప్‌లో 6.75 మీటర్ల దూరం దూకి వ్యక్తిగత అత్యుత్తమ దూరాన్ని నమోదు చేసింది. త్వరలోనే జపాన్‌లో ప్రారంభం కానున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు సిద్ధపడుతోంది.


