రోడ్డు ప్రయాణంలో ‘విమానం’ అనుభూతి | Kerala Flight Like Bus Rules Roads Free Wi-Fi Shawarma Cabin Hostess on Board | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రయాణంలో ‘విమానం’ అనుభూతి

Sep 11 2026 8:47 PM | Updated on Sep 11 2026 8:48 PM

Kerala Flight Like Bus Rules Roads Free Wi-Fi Shawarma Cabin Hostess on Board

బస్సు ప్రయాణం అనగానే మనకు గుర్తొచ్చేది నెమ్మదిగా సాగే ప్రయాణం, కిక్కిరిసిన సీట్లు, అల్పాహారం కోసం రోడ్డు పక్కన ఆగడం. కానీ, మీరు కేరళలోని బస్సు ఎక్కితే అది విమానంలో బిజినెస్ క్లాస్ అని భ్రమపడాల్సిందే. ప్రజా రవాణా వ్యవస్థను ఆధునీకరించడంలో కేరళ రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్‌టీసీ) సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. తిరువనంతపురం - కొచ్చిన్‌ నగరాల మధ్య ఇటీవల ప్రారంభించిన లగ్జరీ బస్సు సర్వీసు ఇప్పుడు రోడ్డు ప్రయాణ రూపురేఖలనే మార్చేస్తోంది. విమాన ప్రయాణానికి దీటుగా అత్యున్నత స్థాయి సౌకర్యాలను ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చారు. దాంతో ఈ బస్సు నెటిజన్లతో పాటు ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఉచిత వై-ఫై, స్క్రీన్లు.. మరెన్నో

సుమారు 200-220 కిలోమీటర్ల ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు బిజినెస్ క్లాస్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ బస్సును రూపొందించారు. ఇందులో లగ్జరీ కుషన్ సీట్లతో పాటు ప్రతి సీటుకూ వ్యక్తిగత ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్లు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు అమర్చారు. ప్రయాణికుల కోసం ఉచిత వై-ఫై సదుపాయం కూడా ఉంది.

ఎన్నో సదుపాయాలో..

ఈ సర్వీసులో ప్రధాన ఆకర్షణ క్యాబిన్ హోస్టెస్. విమానాల్లో మాదిరిగానే ప్రయాణికులకు సేవలందించేందుకు క్యాబిన్ హోస్టెస్‌ను నియమించారు. ప్రయాణంలో వేడి టీ, కాఫీలతో పాటు షావర్మా రోల్స్ వంటి అల్పాహారాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా, సుదీర్ఘ ప్రయాణాల్లో ఎంతో ఉపకరించే శుభ్రమైన ఇన్‌బిల్ట్ వాష్‌రూమ్ సదుపాయం కూడా బస్సులోనే ఉండటం విశేషం.

సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్లు షేర్ చేసిన వీడియోల ద్వారా ఈ బస్సు విశేషాలు ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్నాయి. భారతీయ రైల్వే అధికారులు, రవాణా రంగ నిపుణులు కూడా కేఎస్ఆర్‌టీసీ తీసుకున్న ఈ వినూత్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. నష్టాల్లో ఉండే ప్రభుత్వ రవాణా సంస్థలు సరైన ప్రాధాన్యతలు, అధునాతన సేవల ద్వారా ప్రయాణికులను ఎలా ఆకట్టుకోవచ్చో కేరళ మోడల్ నిరూపిస్తోంది. సాంప్రదాయ బస్సు ప్రయాణాన్ని అత్యంత విలాసవంతమైన కేఎస్ఆర్‌టీసీ లగ్జరీ ప్రయాణంగా మార్చిన ఈ ప్రయోగం, మిగిలిన రాష్ట్రాల ఆర్టీసీలకు కూడా దిశా నిర్దేశం అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలాఉండగా, ఈ బస్సులో ఎంత దూరం ప్రయాణిస్తూ ఎంత టిక్కెట్‌ ఉంటుందనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: అసలు బ్రిక్స్‌లో ఏం చర్చిస్తారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement