పండుగల సీజన్ కావడంతో రైలు ప్రయాణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో.. ఐఆర్‌సీటీ సెప్టెంబర్ 7న సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే 20,06,353 టికెట్లు బుక్ అయ్యాయి. ఐఆర్‌సీటీ చరిత్రలో ఒకే రోజులో 20 లక్షలకు పైగా టికెట్లు బుక్ కావడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 8న కూడా 19,50,699 టికెట్లు బుక్ అయ్యాయి.
గత ఏడాది పండుగల సీజన్‌లో.. నమోదైన అత్యధిక రోజువారీ బుకింగ్స్ 18,40,203 టికెట్లు కాగా, ఈసారి రికార్డు స్థాయి బుకింగ్స్ దానికంటే దాదాపు 6 శాతం ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం రిజర్వ్‌డ్ రైల్వే టికెట్లలో సుమారు 89 శాతం ఆన్‌లైన్‌లోనే బుక్ అవుతున్నాయని ఐఆర్‌సీటీ వెల్లడించింది.
పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సీటీ కొత్త సర్వర్లను ఏర్పాటు చేసి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థ సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ప్రయాణికులకు సులభమైన బుకింగ్ అనుభవాన్ని అందించేందుకు ఐఆర్‌సీటీ జూలై 15, 2026న కొత్త వెబ్‌సైట్, యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ప్రారంభించింది. ఇందులో వివిధ తరగతుల్లో సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్‌పై చూసుకునే అవకాశం ఉంది.
టికెట్ బుకింగ్‌లో మోసాలను అరికట్టేందుకు నిబంధనలు కూడా అమలు చేస్తున్నారు. రిజర్వేషన్ ప్రారంభమైన ఉదయం 8 గంటల నుంచి 8:10 గంటల వరకు అధీకృత ఏజెంట్లు టికెట్లు బుక్ చేయలేరు. అలాగే రిజర్వేషన్ ప్రారంభమైన సమయంలో టికెట్ బుక్ చేసే వినియోగదారులకు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3.04 కోట్ల యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేయగా, మరో 6.33 కోట్ల ఐడీలను రీ-వెరిఫికేషన్ కోసం ఫ్లాగ్ చేశారు.
ఇంత భారీ స్థాయిలో టికెట్లు బుక్ అయినప్పటికీ.. కొత్త ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థలో ఎలాంటి పెద్ద సమస్య లేదా అవుటేజ్ ఏర్పడలేదని ఐఆర్‌సీటీ తెలిపింది. పండుగల సమయంలో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, పెరుగుతున్న బుకింగ్ డిమాండ్‌ను తట్టుకునేందుకు సాంకేతిక సామర్థ్యాన్ని పెంచడం, బాట్స్‌ను నియంత్రించడం వంటి చర్యలు కీలకంగా మారాయి. మొత్తం మీద.. ఒకే రోజులో 20 లక్షలకు పైగా టికెట్లు బుక్ కావడం భారతీయ రైల్వే ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
ఇదీ చదవండి: గంటల వ్యవధిలో మారిపోయిన బంగారం ధరలు!


