యువత ఆలోచనలు ఒక తరాన్ని శాసిస్తాయి, ఆ దేశ ముఖచిత్రాన్ని మార్చేస్తాయి. జాతి నిర్మాణంలో కొత్త రూపురేకలను సృష్టిస్తాయి. జెన్‌జీగా పిలుచుకుంటున్న ప్రస్తుత యువతరం కిడ్స్ ప్లానింగ్‌లో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే యువకుల ఆలోచన ధోరణి, యువతుల ఆలోచనలు ఒక దిశగా సాగడం లేదు. పరస్పరం రాపిడికి లోనవుతున్నాయి. కెరీర్, ఆర్థిక స్థిరత్వం విషయంలో ఒకేదిశలో సాగుతున్న ఆలోచనలు పిల్లల విషయానికి వచ్చేటప్పటికి భిన్నంగా ఉంటున్నాయి.
యువతుల దృక్పథం:
మహిళలు తమ వృత్తిపరమైన ఎదుగుదలకు, ఆర్థిక స్వాతం్రత్యానికి పెద్దపీట వేస్తున్నారు. పిల్లలను కనడం కంటే ముందుగా సమాజంలో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవాలని, ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటున్నారు. పిల్లల కోసం కెరీర్‌ను వదులుకోవడానికి, విరామం ఇవ్వడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఒకవేళ పిల్లలను కంటే ఆ తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించాలనే పట్టుదల వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.
పేరెంటింగ్ బాధ్యతలు
⇒ గత తరాలతో పోలిస్తే మానసిక ఆరోగ్యం, భావోద్వేగాలపై నేటి యువతలో అవగాహన ఎక్కువగా ఉంటోంది. పేరెంటింగ్ అంటే పిల్లలను కనడం మాత్రమే కాదని, వారికి మానసికంగా, భావోద్వేగపరంగా అండగా నిలవడమని ఈ తరం బలంగా నమ్ముతోంది.
⇒ ‘పిల్లల పెంపకం‘కేవలం తల్లి బాధ్యతే అనే మూస పద్ధతిని ఈ తరం యువకులు వ్యతిరేకిస్తున్నారు. తాము కూడా పిల్లల పెంపకంలో సమానంగా పాలుపంచుకోవాలని, డైపర్లు మార్చడం నుండి హోమ్‌వర్క్ చేయించడం వరకు అన్నింట్లోనూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. ఈ మానసిక సిద్ధత వచ్చే వరకు సంతానాన్ని వాయిదా వేసుకోవడంలో తప్పులేదని కూడా నమ్ముతున్నారు.
⇒ యువతుల ఆలోచనా విధానం: మాతృత్వాన్ని పెద్ద బాధ్యతగా చూస్తున్నారు. తమపై పడే ఒత్తిడిని తగ్గించుకోవడానికి భాగస్వామి నుంచి పూర్తి సహకారాన్ని కోరుకుంటున్నారు. సమానమైన బాధ్యతలు పంచుకునే భాగస్వామిని కోరుకుంటున్నారు. పిల్లల బాధ్యత పంచుకుంటూ, తమ కెరీర్‌కి విఘాతం కలగనివ్వని ఫ్యామిలీ సపోర్టు కావాలని యువతులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: సోషల్ మీడియా ఉచ్చులో చిన్నారులు.. కాపాడుకునే మార్గాలున్నాయా?
⇒ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత: ఇష్టమైన ప్రదేశాలకు ప్రయాణాలు చేయడం, హాబీలను పెంపొందించుకోవడం, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం వంటి అభిరుచులకు నేటి యువతీయువకులు ఎక్కువ విలువ ఇస్తున్నారు. పిల్లల వల్ల వచ్చే బాధ్యతలు తమ వ్యక్తిగత స్వేచ్ఛను పరిమితం చేస్తాయని కొందరు భావిస్తున్నారు.
⇒ పర్యావరణం– భవిష్యత్తు ఆందోళన: విచిత్రంగా అనిపించినప్పటికీ ఈ ధోరణి కూడా నేటి యువతీయువకుల్లో కనిపిస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న కాలుష్యాలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి వంటి కారణాలను విశ్లేషిస్తూ ఈ లోకంలోకి కొత్త ప్రాణిని తీసుకురావడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.


