చిన్న కథ కాదుగా! రాహుల్‌ నుంచి కేటీఆర్‌ దాకా.. | From Rahul to KTR: Why T Shirts Matter in Politics | Sakshi
Sakshi News home page

చిన్న కథ కాదుగా! రాహుల్‌ నుంచి కేటీఆర్‌ దాకా..

Sep 7 2026 12:32 PM | Updated on Sep 7 2026 12:51 PM

From Rahul to KTR: Why T Shirts Matter in Politics

రాజకీయ నాయకుడంటే ఒకప్పుడు ఖద్దరు, తెల్లటి కుర్తా, పైజామా.. లేదంటే ధోవతి, షర్టు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. రంగురంగుల దుస్తులు.. అందునా టీషర్టు కూడా రాజకీయ నాయకుడి ఆయుధంగా మారింది. సభలోకి వెళ్లే దుస్తుల దగ్గర నుంచి.. పార్టీ మీటింగ్‌లు, ప్రజల్లోకి వెళ్లే టైంలోనూ.. వాళ్ల వస్త్రధారణ వైవిధ్యంలో ఒక్కో రాజకీయ సందేశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ రాజకీయాలను నల్ల టీషర్టు ఒక్కసారిగా కుదిపేసింది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి నిరసనకు దిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు నెరవేర్చలేదన్నది వారి ఆరోపణ. టీషర్టులపై కూడా అదే సందేశాన్ని ముద్రించారు. కేటీఆర్‌, హరీష్‌రావు ఇలా చాలామంది నేతలు ఆ పని చేశారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. నల్ల టీషర్టులతో లోపలికి అనుమతించబోమని చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. టీషర్టు ధరించి వస్తే తప్పేంటని? ఆ తర్వాత బీఆర్‌ఎస్‌ సైతం పోలీసులను, ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిచింది.

అయితే ఇక్కడ వాళ్లు వేసిన నల్ల టీషర్టు కేవలం దుస్తులు కాదు.. నిరసనకు కనిపించే గుర్తు. ఒకే రంగు, ఒకే సందేశం ఉన్న టీషర్టులతో పెద్ద సంఖ్యలో నేతలు కనిపిస్తే.. అది రాజకీయంగా ఒక విజువల్‌ స్టేట్‌మెంట్‌గా మారింది. నిజంగా పోలీసులు చెబుతున్నట్లు టీషర్టులు వేసుకుంటే సభలోకి అనుమతించకూడదా?..

రాహుల్‌ గాంధీ.. తెల్ల టీషర్టే ఎందుకు?
టీషర్టు రాజకీయాల్లో జాతీయ స్థాయిలో ఎక్కువగా కనిపించే పేరు రాహుల్‌ గాంధీ. భారత్‌ జోడో యాత్ర నుంచి ఆయన తెల్ల టీషర్టు దాదాపు ఆయన రాజకీయ గుర్తింపులో భాగమైపోయింది. రాహుల్‌ స్వయంగా తెల్ల టీషర్టు తనకు ‘పారదర్శకత, సరళత’ను సూచిస్తుందని చెప్పారు. ఇది కేవలం సౌకర్యం కోసం వేసుకునే దుస్తులా? అంటే కాదు. రాజకీయ విశ్లేషణల్లో రాహుల్‌ తెల్ల టీషర్టును యువతతో కనెక్ట్‌ అయ్యే ఇమేజ్‌, 

సాధారణ మనిషికి దగ్గరగా కనిపించే ప్రయత్నంగా కూడా చూస్తున్నారు. కాంగ్రెస్‌ రాజకీయాల్లో సంప్రదాయ ఖద్దరు ఇమేజ్‌కు భిన్నంగా.. మరింత క్యాజువల్‌ లుక్‌ను ఆయన తన బ్రాండ్‌గా మార్చుకున్నారు. అదే రాహుల్‌ సందర్భంలో రంగు మారితే.. సందేశం కూడా మారింది. అంబేడ్కర్‌ అంశంపై నిరసన సమయంలో ఆయన నీలం టీషర్టు ధరించడం కూడా రాజకీయ సంకేతంగా చర్చకు వచ్చింది. పార్లమెంట్‌ బయట నిరసన సమయంలో నల్ల టీషర్టు ధరించడం, ఇతర కార్యక్రమాలకు ఆయా సందర్భాలను బట్టి కలర్‌ మార్చడం కూడా ఇదే కోవలోకి వస్తోంది.

ఉదయనిధికి టీషర్టే బ్రాండ్‌!
తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ కూడా టీషర్టును తన రాజకీయ ఇమేజ్‌లో భాగం చేసుకున్నారు. ముఖ్యంగా డీఎంకే యువజన విభాగం లోగోతో కూడిన టీషర్టుల్లో ఆయన తరచూ కనిపిస్తారు. టీషర్టు ద్వారా యువతకు దగ్గరగా కనిపించడం, పార్టీ యువజన విభాగంతో తన అనుబంధాన్ని చూపించడం ఇందులోని రాజకీయ కోణం. పార్టీ కార్యక్రమాలకే కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన వస్త్రధారణ ఒక దశలో వివాదంగా మారింది.  2024లో ప్రభుత్వ కార్యక్రమాల్లో టీషర్టు, జీన్స్‌ ధరించడంపై ఆయనపై మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది. టీషర్టు అధికారిక దుస్తుల కిందకు వస్తుందా? అనే అంశంపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.

ఇది తెలుసా? ఆ ఎమ్మెల్యేను బయటకు పంపారు
టీషర్టుపై రాజకీయ సందేశాన్ని ముద్రించుకోవడం కొత్తేమీ కాదు. కర్ణాటకలో హిందీ భాష వ్యతిరేక ఉద్యమ సమయంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం నినాదాలతో కూడిన టీషర్టులను ప్రచార సాధనంగా ఉపయోగించారు. 2021లో గుజరాత్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యే విమల్‌ చుడాసమా టీషర్టు, జీన్స్‌తో రావడం కూడా అప్పట్లో చర్చకు వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో చివరకు ఆయనను సభ నుంచి బయటకు పంపారు.

టీషర్టు.. ఇంత పవర్‌ఫుల్లా?
దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి.. యువత కనెక్ట్‌. రాజకీయ నాయకుడు కూడా మనలాగే టీషర్టు వేసుకుంటే.. అతడు ‘నేత’ కంటే ‘మనలో ఒకడు’ అనే భావన కలిగించవచ్చు. పైగా ఈ జెన్‌జీ ఉద్యమాల నేపథ్యంలో ఇది బాగా సింక్‌ అవుతోంది కూడా. రెండోది.. నిరసనకు సులభమైన గుర్తు. నల్ల టీషర్టు, నీలం టీషర్టు, నినాదాలు ముద్రించిన టీషర్టులు.. సభలోనైనా, రోడ్డుపైనైనా వెంటనే దృష్టిని ఆకర్షిస్తాయి. మూడు.. పొలిటికల్‌ బ్రాండింగ్‌. ఒకే రంగు, ఒకే డిజైన్‌, ఒకే నినాదంతో వందల మంది కనిపిస్తే అది కళ్లకు కనిపించే ప్రచారంగా మారుతుంది. ఇక కంఫర్ట్‌ అనేది ఆయా నేతలకు ప్రధానంగా కనిపిస్తోంది.

అందుకే ఇప్పుడు రాజకీయాల్లో టీషర్టు కేవలం దుస్తులు కాదు.. ఒక స్టేట్‌మెంట్‌. ఎవరు ఏ రంగు వేసుకున్నారు? దానిపై ఏం రాశారు? ఎక్కడ వేసుకున్నారు? అనే దానికీ రాజకీయ అర్థం వెతికే పరిస్థితి వచ్చింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్‌ఎస్‌ టీషర్టు వివాదం.. ఈ ‘టీషర్టు పాలిటిక్స్‌’కు మరో ఉదాహరణగా నిలిచింది.

ఇదీ చదవండి: త్రిషపై కామెంట్లు.. విజయ్‌ సాలిడ్‌ వార్నింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement