సోషల్‌ మీడియా ఉచ్చులో పిల్లలు చిక్కుకోకుండా ఉండాలంటే.. | How to Protect children from the negative impacts of social media | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా ఉచ్చులో చిన్నారులు.. కాపాడుకునే మార్గాలున్నాయా?

Sep 15 2026 12:25 PM | Updated on Sep 15 2026 1:09 PM

How to Protect children from the negative impacts of social media

చిన్న పిల్లల చేతికి ఫోన్‌ ఇస్తే క్షణాల్లో నిశ్శబ్దంగా కూర్చుంటారు. సరిగ్గా ఇక్కడే, ఎండ్‌లెస్‌ ఫీడ్స్, రికమెండేషన్‌ అల్గారిథమ్స్, నోటిఫికేషన్లు, లైక్స్‌ వంటి వ్యసనపరిచే ఫీచర్లతో సోషల్‌ మీడియా వారిని తన చుట్టూ తిప్పుకుంటోంది. తద్వారా పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. గంటల తరబడి స్క్రోలింగ్‌ చేయడం వల్ల నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్‌ లక్షణాలు, ఒంటరితనం వంటి సమస్యలు పిల్లల్లో కూడా పెరుగుతున్నాయని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 13 ఏళ్లలోపు పిల్లల విషయంలో మరింత కఠినమైన రక్షణ చర్యలు అవసరం అంటున్నారు.  

ఇండియాలోనూ మారుతున్న గళం  
అమెరికాలో మెటా సంస్థపై వచ్చిన కేసులు, కోర్టుల జోక్యం నేపథ్యంలో పెద్ద పరిణామమే చోటుచేసుకుంది. పిల్లలను రక్షించడానికి సోషల్‌ మీడియా కంపెనీలపై ఎలాంటి నియంత్రణలు ఉండాలనే చర్చ ఇప్పుడు ఇండియాలోనూ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిపాదిస్తున్న కొన్ని కీలక నిబంధనలు చూద్దాం.  

రోజువారీ సమయ పరిమితి: పిల్లలు లేదా టీనేజర్లు రోజుకు గరిష్టంగా 2 గంటలు మాత్రమే యాప్‌లను వాడేలా పరిమితి విధించడం. 
 రాత్రి సమయపు ఆంక్షలు: రాత్రి 12:00 నుంచి ఉదయం 6:00 వరకు యాప్‌ యాక్సెస్‌ను పూర్తిగా 
నిరోధించడం. 
స్కూల్‌ మోడ్‌: పాఠశాల వేళల్లో నోటిఫికేషన్లను నిలిపివేయడం. 

స్క్రోలింగ్‌ బ్రేకులు: ప్రతి 15 నిమిషాల నిరంతర స్క్రోలింగ్‌ తర్వాత చిన్న విరామం తీసుకోవాలని గుర్తు చేయడం. 
నాన్‌ అల్గారిథమిక్‌ ఫీడ్‌: పిల్లలకు ఆకర్షించే వ్యక్తిగతీకరించిన ఫీడ్స్‌ బదులుగా సాధారణ ఫీడ్‌ను 
అందించడం. 
ఆటోప్లే, లైక్స్‌ నిలిపివేత: ఆటోప్లే, లైక్‌ కౌంట్స్‌ వంటి ఆకర్షణీయ ఫీచర్లను డిఫాల్ట్‌గా ఆఫ్‌ చేయడం, వయస్సు నిర్ధారణను బలోపేతం చేయడం.

మెటా కొత్త నిబంధనలు  
ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌లలో 13 నుంచి 17 సంవత్సరాల వయసు గల టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కొన్ని కఠినమైన నిబంధనలు, ఫీచర్లను తీసుకొస్తోంది. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల సోషల్‌ మీడియా ఖాతాలపై మరింత స్పష్టమైన నియంత్రణ సాధించవచ్చు. 

స్క్రీన్‌ టైమ్‌ కంట్రోల్స్‌: రాత్రివేళల్లో పిల్లలు ఎక్కువసేపు ఫోన్‌కి అతుక్కుపోకుండా స్క్రీన్‌ టైమ్‌ పరిమితులు సెట్‌ చేసుకోవచ్చు. 
కంటెంట్‌ ఫిల్టరింగ్‌: టీనేజర్లకు అనుచితమైన, హానికరమైన కంటెంట్‌ లేదా విపరీతమైన బ్యూటీ/కాస్మెటిక్‌ ఫిల్టర్లు కనిపించకుండా కట్టడి చేస్తారు. 

మెసేజింగ్‌ భద్రత: పిల్లలకు అపరిచితులు లేదా తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను అడ్డుకోవడానికి కాంటాక్ట్‌ నియంత్రణలను పెంచుతారు. 

ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సీజనల్‌ ఫ్లూ జ్వరాలు

తల్లిదండ్రుల పర్యవేక్షణ: తల్లిదండ్రుల అనుమతి లేకుండా టీనేజర్లు తమ సెట్టింగ్‌లను లేదా సమయ పరిమితులను మార్చలేరు. ఒకవేళ పిల్లలు కొత్త ఖాతాలను క్రియేట్‌ చేసి లింక్‌ చేయడానికి ప్రయత్నిస్తే వెంటనే తల్లిదండ్రులకు అలర్ట్‌ వస్తుంది. 

లైక్స్‌ మాయం: పోస్ట్‌లపై వచ్చే లైక్‌లు, రియాక్షన్ల సంఖ్యను దాచడం ద్వారా పిల్లల్లో పోలికల వల్ల వచ్చే ఆత్మనూనతా భావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. 

వయస్సు నిర్ధారణ లోపాలు 
టీనేజర్లు తమ పుట్టిన తేదీని తప్పుగా నమోదు చేసుకుంటే వారిని గుర్తించడానికి మెటా ఏఐ టూల్స్‌ వాడుతున్నప్పటికీ, నకిలీ పేరెంట్‌ ఖాతాలను తయారు చేయడం వంటి లొసుగులను పూర్తిగా అడ్డుకోవడం 
ఇంకా సవాలుగానే ఉంది. 

ఇతర యాప్‌ల పోటీ: కేవలం మెటా మాత్రమే కాకుండా టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్‌ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఇలాంటి నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తేనే పూర్తి ఫలితం ఉంటుంది. 

ఇదీ చదవండి: కాళ్లే చేతులుగా చేసుకుని పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు 

కుటుంబాల మధ్య అంతరాలు: టెక్నాలజీపై అవగాహన లేదా తీరిక లేని కుటుంబాల్లో (ముఖ్యంగా దినసరి కూలీలు, పేద వర్గాల్లో) ఈ ఫీచర్లు ఆశించిన స్థాయిలో పనిచేయకపోవచ్చు. డిజిటల్‌ అక్షరాస్యత ఉన్న తల్లిదండ్రుల పిల్లలకే ఇది నిజమైన రక్షణ కవచంలా మారుతోంది.

సోషల్‌ మీడియా అనేది పూర్తిగా చెడ్డది కాదు. కానీ పిల్లలు ఎంతసేపు ఉపయోగిస్తున్నారు, ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారు, రాత్రివేళల్లో కంటి నిద్రను పాడు చేసుకుంటున్నారా లేదా అనే విషయాలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ, సమయ నియంత్రణ ఉండటం అన్నింటికంటే ముఖ్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement