న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కఠిన చర్యల నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులను నేరుగా పోలీసులకు సమాచారం అందించేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
దేశంలో సోషల్ మీడియా సంస్థలు కార్యకలాపాలు నిర్వహించాలంటే చిన్నారుల ఆన్‌లైన్ భద్రత ప్రాథమిక సూత్రమని, ఇందులో ఎలాంటి రాజీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారుల లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన కంటెంట్, ప్రకటనలు వస్తున్నట్లు వార్తలు రావడంతో కేంద్రం, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఉక్కుపాదం మోపుతోంది.
చిన్నారుల భద్రతకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసుల వివరాలను ఇకపై భారతీయ చట్ట అమలు సంస్థలకు అందించేందుకు మెటా అంగీకరించింది. ఆన్‌లైన్‌లో పిల్లల భద్రత అనేది ఏ సోషల్ మీడియా సంస్థకైనా అత్యంత ప్రాథమిక, అనివార్యమైన సూత్రమని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
ప్లాట్‌ఫామ్‌లలో హానికరమైన సమాచారాన్ని ముందస్తుగా గుర్తించి, ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకోని సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలను పిల్లలకు పూర్తిగా సురక్షితంగా మార్చే దిశగా మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఒక కీలకమైన తొలి అడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు కూడా పిల్లల భద్రత కోసం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వం నిరంతరం చర్చలు జరుపుతోంది.


