ధురంధర్‌-3 ప్లాన్‌ చేస్తున్నారా భయ్యా? పాక్‌లో మళ్లీ.. | Dhurandhar 3: Unknown Gunmen Kill LeT Linked Man in Karachi Video | Sakshi
Sakshi News home page

ధురంధర్‌-3 ప్లాన్‌ చేస్తున్నారా భయ్యా? పాక్‌లో మళ్లీ..

Sep 15 2026 10:15 AM | Updated on Sep 15 2026 10:27 AM

Dhurandhar 3: Unknown Gunmen Kill LeT Linked Man in Karachi Video

దేశ శత్రువులపై నిఘా పెట్టి, రహస్య ఆపరేషన్లతో వారిని టార్గెట్‌ చేసే కథే.. ధురంధర్‌ సినిమా. రణ్‌వీర్‌ సింగ్‌ లీడ్‌ రోల్‌లో ఆదిత్య ధర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాలో చూపించినట్లే ఆపరేషన్లు నిజంగానే జరుగుతాయా?. టార్గెట్‌ చేసిన వ్యక్తులను గుర్తుతెలియని దుండగులు పక్కా ప్లాన్‌తో హతమార్చడం.. ఆ తర్వాత జాడ లేకుండా పోవడం పాక్‌లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా కరాచీలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది.

పాకిస్థాన్‌లో మరోసారి ‘అన్‌నోన్‌ గన్‌మెన్‌’ కలకలం రేపారు. కరాచీలో లష్కరే తోయిబా (LeT)తో సంబంధాలున్నట్టు చెబుతున్న ఓ వ్యక్తిని నలుగురు గుర్తుతెలియని దుండగులు బైక్‌లపై వచ్చి కాల్చిచంపారు. భైంస్‌ కాలనీలోని రోడ్‌ నంబర్‌ 11 వద్ద ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అయితే మృతుడి అసలు గుర్తింపు, అతడికి ఐఎస్‌ఐతో ఉన్న సంబంధాలపై పాకిస్థాన్‌ అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. దాడికి ఏ ఉగ్రవాద సంస్థ కూడా బాధ్యత ప్రకటించలేదు. అయితే చనిపోయిన వ్యక్తి ఎల్‌ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయ్యద్‌కు అత్యంత సన్నిహితుడని మాత్రం స్థానికంగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.

ఈ ఘటనలో ప్రత్యేకత ఏంటంటే.. దాడి చేసిన తీరు. బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు టార్గెట్‌ను గుర్తించి వేగంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటన జరిగిన ప్రాంతం జనాల రద్దీతో ఉన్నప్పటికీ.. దుండగులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తప్పించుకున్నారు. దీంతో అసలు ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది మరోసారి ప్రశ్నగా మారింది.

పాక్‌లో ఇది మాములే!
పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ‘గుర్తుతెలియని దుండగుల’ చేతిలో హతమవుతున్న ఘటనలు గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ వంటి భారత్‌ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు లక్ష్యంగా మారిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

2026 ఆగస్టులో లష్కరే తోయిబాకు చెందిన రిజ్వాన్‌ హనీఫ్‌ చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన వీడియో ఈ వ్యవహారంపై మరింత ఆసక్తి పెంచింది. గత మూడు నాలుగేళ్లలో పాకిస్థాన్‌లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా వ్యక్తులను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినట్లు అతను చెప్పినట్టు పలు మీడియా సంస్థలు నివేదించాయి. పెషావర్‌, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్‌, రావలకోట్‌ వంటి ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్టు ఆ వాదనలో ప్రస్తావన వచ్చింది. అయితే ఈ సంఖ్యను పాకిస్థాన్‌ ప్రభుత్వం స్వతంత్రంగా ధ్రువీకరించలేదు. అంతేకాదు.. ఈ హత్యల వెనుక ఎవరున్నారన్నదానిపైనా స్పష్టమైన ఆధారాలు బహిరంగంగా లేవు.

అసలు ఈ ‘గన్‌మెన్‌’ ఎవరు?
కరాచీ తాజా హత్యలో ఇదే ప్రధాన ప్రశ్న. మృతుడు నిజంగా ఐఎస్‌ఐతో సంబంధాలున్న వ్యక్తేనా? లష్కరే తోయిబాతో అతడి సంబంధం ఎంతవరకు ఉంది? దాడి వ్యక్తిగత కక్షతో జరిగిందా? ప్రత్యర్థి ఉగ్రవాద సంస్థల పనేనా? లేక మరేదైనా నిఘా వ్యవస్థ పాత్ర ఉందా? ప్రస్తుతానికి ఏ ప్రశ్నకూ అధికారిక సమాధానం లేదు.

హఫీజ్‌ సయ్యద్‌ పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాది, లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుల్లో ఒకడు. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారుల్లో అతడొకడని భారత్‌ చెబుతూ వస్తోంది. అమెరికా కూడా అతడిని ఉగ్రవాదిగా ప్రకటించి, అతడి తలపై 10 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించింది. లష్కరే తోయిబా వ్యవస్థతో అతడికి ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా.. ఆ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల హత్యలు జరిగినప్పుడల్లా హఫీజ్‌ సయ్యద్‌ పేరు కూడా చర్చకు వస్తోంది.

భారత్‌పై పాక్‌ ఆరోపణలు..
ఈ వరుస హత్యలపై పాకిస్థాన్‌లోని కొందరు అధికారులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు భారత నిఘా వ్యవస్థపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే భారత్‌ ఈ ఆరోపణలను ఖండించింది. 2024లోనూ పాకిస్థాన్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న పలువురి హత్యల వెనుక భారత్‌ ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పాకిస్థాన్‌ అధికారులు కనీసం ఎనిమిది హత్యలను భారత్‌తో ముడిపెట్టారు. అయితే వాటిలో వేటికి ఆధారాలు మాత్రం చూపించలేదు. 

‘ధురంధర్‌’ను తలపించే సీన్‌..
పాక్‌లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నవాళ్లు మరణించడం కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే ఆ హత్యలన్నీ చాలా డ్రామటిక్‌గా జరుగుతుండడం గమనార్హం. ఇప్పుడు కరాచీ ఘటనలోనూ నలుగురు వ్యక్తులు బైక్‌లపై వచ్చి టార్గెట్‌పై కాల్పులు జరిపి క్షణాల్లో అక్కడి నుంచి వెళ్లిపోవడం.. గతంలో నమోదైన కొన్ని మిస్టరీ కిల్లింగ్స్‌ను గుర్తు చేస్తోంది. అందుకే సోషల్‌ మీడియాలో ‘ధురంధర్‌’ సినిమా తరహా చర్చ మొదలైంది. అంతేకాదు.. ఈ కొత్త ఘటనలతో ‘ధురంధర్‌-3’ ప్లాన్‌ చేయాలంటూ కొందరు ఆదిత్య ధర్‌ను రిక్వెస్ట్‌ చేస్తూ నెట్టింట ఆ వీడియోను వైరల్‌ చేస్తున్నారు. 

ఇదే సమయంలో.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థల మధ్య అంతర్గత వైరం, ప్రత్యర్థి గ్రూపుల దాడులు, స్థానిక నేరగాళ్ల పాత్ర వంటి ఇతర కోణాలూ చర్చకు వస్తుంటాయి. పైగా ఆ దేశంలో ఇలాంటి హత్యలు కొత్తేమీ కాదు. కరాచీ గతంలో రాజకీయ, జాతి, మతపరమైన హింసకు కేంద్రంగా నిలిచింది. 2011లోనే నగరంలో జరిగిన వరుస టార్గెట్‌ కిల్లింగ్స్‌లో ఒక్క జూలై నెలలోనే 300 మందికి పైగా మరణించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆ హింసకు రాజకీయ, జాతి, మతపరమైన కారణాలు ముడిపడి ఉన్నాయని అప్పటి నివేదికలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: ప్చ్‌.. గాడిదలపైనే భారం వేసిన పాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement