అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇద్దరు కేరళకు చెందిన స్నేహితుల హత్య కేసులో భారత సంతతికి చెందిన అనిలా బేబీ (32)ని పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 28న శాన్‌జోస్, మిల్పిటాస్ ప్రాంతాల్లో 90 నిమిషాల వ్యవధిలో 2 హత్యలు జరిగాయి. మృతులను యాన్ మేరీ మ్యాథ్యూ(35), అంజనా హరి(35)గా గుర్తించారు. అనిలా బేబీతో పాటు మిగతా ఇద్దరు కేరళ మూలాలు ఉన్నవారే.
మొదటి ఘటన శాన్‌జోస్‌లోని మ్యాథ్యూ ఇంట్లో జరిగింది. ఆమెను గొంతు నులిమి, కత్తితో పొడిచినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. శాన్‌జోస్ పోలీసులు కూడా ఆమెకు కత్తిపోట్లు ఉన్నాయని, ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు.
దాదాపు 90 నిమిషాల తర్వాత మిల్పిటాస్‌లోని తమ అపార్ట్‌మెంట్ సముదాయం పార్కింగ్ ప్రదేశానికి అంజనా హరిని అనిలా బేబీ పిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరూ ఒకే అపార్ట్‌మెంట్ సముదాయంలో నివసించేవారు. అంజనా అనిలా బేబీ వాహనం వద్దకు వెళ్లిన సమయంలో వాహనం ఒక్కసారిగా వేగంగా దూసుకెళ్లి ఆమెను ఢీకొట్టి, హత్య చేసింది. అనంతరం అనిలా అక్కడి నుంచి పారిపోయి మరో మూడు వాహనాలను ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తర్వాత పోలీసులు ఓ దుకాణం సమీపంలో నీలిరంగు టయోటా వాహనాన్ని గుర్తించారు. వాహనం నడిపింది అనిలా బేబీనేనని గుర్తించారు. ఆమె అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో కనిపించిందని, చేతులు, కాళ్లపై రక్తం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి శాంటా క్లారా కౌంటీ ప్రధాన జైలుకు తరలించారు.
ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు శాన్‌జోస్ పోలీసులు తెలిపారు. అనిలా బేబీపై 2 హత్య కేసులు నమోదయ్యాయి. నేరం రుజువైతే 50 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశం ఉంది.
మృతుల భౌతిక కాయాలను భారత్‌కు, ముఖ్యంగా కేరళకు తీసుకురావడానికి కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారత రాయబార కార్యాలయం, కాలిఫోర్నియాలోని మలయాళీ సంఘం కూడా కుటుంబాలకు సహాయం చేస్తున్నాయి. శవపరీక్ష, ఇతర న్యాయపరమైన ప్రక్రియలు త్వరగా పూర్తి కావాలని వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.


