అమెరికాలోని కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటీలో పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల భారత సంతతికి చెందిన ఓ మహిళ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. నెలల తరబడి ఓ వ్యక్తి ఆమె వెంటపడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడిపై నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. అమెరికాలో నిషేధాజ్ఞ అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తిని సంప్రదించడం, కలవడం లేదా దగ్గరకు వెళ్లడాన్ని చట్టపరంగా నిరోధించే ఆదేశం.
షాలిని ఠాకూర్ (38) తన కారుకు సమీపంలో నిలబడి ఉండగా.. భారతదేశానికి చెందిన చట్టబద్ధ పత్రాలు లేని వలసదారు రోహిత్ ఆమె వద్దకు వచ్చినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ తెలిపింది. షాలిని తప్పించుకునేందుకు ప్రయత్నించగా రోహిత్ ఆమెను వెంబడించి తలపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాల్పుల ఘటనపై స్పందించిన పోలీసులు రోహిత్‌ను కొద్దిసేపటికే పట్టుకున్నారు. అధికారుల ప్రకారం.. ఆ తర్వాత అతడు తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గంటల తరబడి కారు నిలిపి..
కాల్పుల ఘటనకు ముందు రోహిత్ నెలల తరబడి షాలినిని వెంటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలినికి అతడు డోర్‌డ్యాష్ డెలివరీ డ్రైవర్‌గా తెలుసని ఏబీసీ 10 తెలిపింది. అతడు ఆమె ఇంటి బయట గంటల తరబడి కారు నిలిపి.. ప్రతిరోజూ ఆమెతో మాట్లాడేవాడని పేర్కొంది.
ఓ దశలో రోహిత్ తనను పెళ్లి చేసుకోవాలని షాలినిపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతరులతో స్నేహంగా ఉండకుండా కూడా ఆమెను అడ్డుకున‍్నాడు. ఆమె ఎవరినైనా కలిస్తే ఆ వ్యక్తిని లేదా తనను తాను తుపాకీతో కాల్చుకుంటానని రోహిత్ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తర్వాత రోహిత్ షాలిని కారు టైర్లలోని గాలిని తీసేసి.. ఆమె పనిచేసే చోటుకూ వెంబడించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ ఆమెకు సహాయం చేస్తున్నట్లు నటించేవాడని చెప్పారు. షాలిని అపార్ట్‌మెంట్ తాళం చెవి నకలును కూడా రోహిత్ సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించేందుకే అతడు ఆ నకలు తాళం చెవిని సంపాదించినట్లు తెలుస్తోంది.
మేలో షాలిని చివరకు రోహిత్‌పై నిషేధాజ్ఞ పొందింది. అయినప్పటికీ అతడు ఆమెను ఫాలో కావడం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. షాలిని తల్లి సుదేశ్ కుమారి మాట్లాడుతూ తన కుమార్తె పలుసార్లు పోలీసులను ఆశ్రయించిందని తెలిపారు. చివరకు మంగళవారం శాక్రమెంటో కౌంటీలోని పనేరా బ్రెడ్ రెస్టారెంట్ వెలుపల జరిగిన కాల్పుల్లో షాలిని ప్రాణాలు కోల్పోయింది.


