ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. షరీఫ్‌ ఇంట శుభకార్యం | Mahnoor Safdar Wedding: Why Pakistanis Are Worried About Costs | Sakshi
Sakshi News home page

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు.. షరీఫ్‌ ఇంట శుభకార్యం

Sep 12 2026 9:24 AM | Updated on Sep 12 2026 9:24 AM

Mahnoor Safdar Wedding: Why Pakistanis Are Worried About Costs

పాకిస్థాన్‌ పంజాబ్‌ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియం నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మహ్నూర్‌ సఫ్దార్‌ శనివారం పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తితో ఆమె వివాహం జరగనున్నట్లు సమాచారం. షరీఫ్‌ కుటుంబంలో పెళ్లి సందడి మొదలవుతుండగా.. పాకిస్థాన్‌ ప్రజల్లో మాత్రం మరో ఆందోళన మొదలైంది. 

నవాజ్‌ మనవరాలు మహ్నూర్‌ సఫ్దార్‌(22) రాజకీయాల్లోగానీ, ప్రజాజీవితంలోగానీ క్రియాశీలంగా లేరు. దీంతో ఆమె వివాహాన్ని పూర్తిగా ప్రైవేట్‌ కార్యక్రమంగానే నిర్వహించాలని కుటుంబం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెళ్లికి సంబంధించిన వివరాలను కూడా పెద్దగా బయటకు వెల్లడించలేదు. ఎంగేజ్‌మెంట్‌ వివరాలను కూడా బయటకు పొక్కనివ్వలేదు. అయితే షరీఫ్‌ కుటుంబానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత, గతంలో జరిగిన భారీ వేడుకల నేపథ్యంలో ఈ పెళ్లి ఇప్పుడు పాకిస్థాన్‌లో చర్చనీయాంశంగా మారింది.

కొడుకు పెళ్లి వివాదంలో..
మరియం నవాజ్‌ కుమారుడు జునైద్‌ సఫ్దార్‌ వివాహం గతంలో పాకిస్థాన్‌లో పెద్ద చర్చకే దారితీసింది. పెళ్లి వైభవం, వధువు దుస్తులు, మరియం నవాజ్‌ లుక్‌.. ఇలా వేడుకకు సంబంధించిన ప్రతి అంశం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. షరీఫ్‌ కుటుంబం నిర్వహించే కార్యక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయో అప్పట్లో ఆ పెళ్లి చూపించింది. ఇప్పుడు మహ్నూర్‌ వివాహం కూడా అదే స్థాయిలో ఘనంగా జరుగుతుందా? అనే ఆసక్తి ఒకవైపు ఉండగా.. “మళ్లీ ఆ ఖర్చుల భారం సామాన్యులపై పడుతుందా?” అన్న సందేహం మరోవైపు పాక్‌ సోషల్‌ మీడియాలో వ్యక్తమవుతోంది.

లండన్‌ పర్యటనతో మొదలైన వివాదం
ఈ చర్చకు తాజాగా మరో కారణం కూడా తోడైంది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మరియం నవాజ్‌ ఇటీవల లండన్‌ వెళ్లారు. ఈ పర్యటనకు ప్రభుత్వ విమానాన్ని వ్యక్తిగత కార్యక్రమం కోసం ఉపయోగించుకున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయితే ఈ ఆరోపణలపై పంజాబ్‌ మంత్రి అజ్మా బుఖారీ స్పందించారు. మరియం ప్రయాణానికి సంబంధించిన ఖర్చులన్నింటినీ ఆమె వ్యక్తిగతంగానే భరించారని, ప్రభుత్వ ఖజానాపై భారం పడలేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ఆ వివాదం పాకిస్థాన్‌లో ఇంకా చర్చలో ఉండగానే మహ్నూర్‌ పెళ్లి వార్త రావడం ఆసక్తిని పెంచింది.

ఖజానాపై అప్పుల భారం
ప్రస్తుతం పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి సామాన్యులకు అంత సులభంగా లేదు.  దేశం భారీ అప్పుల భారంతో సతమతమవుతోంది. 2025 జూన్‌ నాటికి పాక్‌ ప్రజా రుణభారం జీడీపీలో దాదాపు 70.7 శాతంగా నమోదైంది. ఇక 2026–27 బడ్జెట్‌లో అప్పులపై వడ్డీ చెల్లింపులకే రూ.8.05 ట్రిలియన్‌ కేటాయించడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ధరల పెరుగుదల, జీవన వ్యయ భారం, ఉపాధి సమస్యలు, విద్యుత్‌ బిల్లులు వంటి అంశాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ బడ్జెట్లు ఒత్తిడిలో ఉన్న సమయంలో.. పాలక కుటుంబాల విలాసవంతమైన వేడుకల వార్తలు సహజంగానే సామాన్యుల్లో అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పెళ్లిని పాకిస్థానీయులు కేవలం ఓ కుటుంబ వేడుకగా చూడటం లేదు. అది ప్రభుత్వ ఖజానాకు భారంగా మారకూడదన్నదే వారి ప్రధాన ఆవేదన

పాక్‌ రాజకీయాల్లో షరీఫ్‌ కుటుంబం
పాకిస్థాన్‌ రాజకీయాల్లో షరీఫ్‌ కుటుంబం అత్యంత ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాల్లో ఒకటి. నవాజ్‌ షరీఫ్‌ దేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. ఆయన తమ్ముడు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రస్తుతం పాక్‌ ప్రధానమంత్రిగా ఉన్నారు. మరో సోదరుడు అబ్బాస్‌ షరీఫ్‌ వ్యాపారవేత్తగా, రాజకీయంగానూ వ్యవహరించారు. నవాజ్‌ కుమార్తె మరియం నవాజ్‌ షరీఫ్‌ ప్రస్తుతం పంజాబ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక షెహబాజ్‌ కుమారుడు హమ్జా షెహబాజ్‌ గతంలో పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పనిచేయడంతోపాటు పలు కీలక రాజకీయ పదవులు చేపట్టారు. మరో కుమారుడు సులేమాన్‌ షెహబాజ్‌ కూడా కుటుంబ వ్యాపారాల్లో కీలకంగా ఉన్నారు. ఇలా షరీఫ్‌ కుటుంబానికి చెందిన పలువురు తరతరాలుగా పాక్‌ రాజకీయాలతో పాటు వ్యాపార రంగాల్లో ప్రభావం చూపుతున్నారు.

ఇదీ చదవండి: తప్పుడు పనితో జైలు పాలైన భారతీయుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement