9/11కు 25 ఏళ్లు.. అల్‌ఖైదా సంచలన వీడియో! | 9/11 Anniversary, Al-Qaeda Video Featuring Hamza Bin Laden Sparks Fresh Questions On His Fate, Watch Video Inside | Sakshi
Sakshi News home page

9/11కు 25 ఏళ్లు.. అల్‌ఖైదా సంచలన వీడియో!

Sep 12 2026 10:33 AM | Updated on Sep 12 2026 11:03 AM

9/11 Anniversary: Al Qaeda Video Featuring Hamza Sparks Fresh Questions

అమెరికా సెప్టెంబర్‌ 11 దాడులకు పాతికేళ్లు పూర్తయిన వేళ అల్‌ఖైదా విడుదల చేసిన ఓ వీడియో సంచలనం రేపుతోంది. ఆ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌ లాడెన్‌ కొడుకు లాడెన్‌ కొడుకు హమ్జా అందులో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఏడేళ్ల కిందటే.. అమెరికా ఆపరేషన్‌లో అతను హతమైనట్లు ఇంతకాలం అంతా భావించారు. అయితే ఇప్పుడు వీడియో ద్వారా అల్‌ఖైదా ఏం సందేశం ఇచ్చిందనే దానిపై ఆసక్తి నెలకొంది.

అల్‌ఖైదా మీడియా విభాగం ‘అస్‌-సహాబ్‌’ 50 నిమిషాల వీడియో రిలీజ్‌ చేసింది. అందులో హమ్జా కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో ఏడేళ్ల క్రితం ముగిసిందనుకున్న అతడి కథపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ‘ఎ క్వార్టర్‌ సెంచరీ ఆఫ్‌ ది 11 సెప్టెంబర్‌ రైడ్స్‌’ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు. ఇందులో హమ్జా బిన్‌ లాడెన్‌తో పాటు 2022లో అమెరికా ఆపరేషన్‌లో హతమైన అల్‌ఖైదా చీఫ్‌ అయ్‌మన్‌ అల్‌-జవహిరి దృశ్యాలు కూడా ఉన్నారు.

వీడియోలో హమ్జా తెల్లటి తలపాగా ధరించి, పక్కనే తుపాకీ ఉండగా మట్టి గోడ ముందు కూర్చుని కనిపిస్తాడు. అతడిని ఒసామా బిన్‌ లాడెన్‌ వారసుడిగా చూపించేలా ఈ దృశ్యాలను రూపొందించినట్లు భద్రతా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. బిన్‌ లాడెన్‌ పేరును ఉపయోగించుకోవడం ద్వారా అల్‌ఖైదా తన భావజాలాన్ని ప్రచారం చేయడంతోపాటు కొత్తగా మద్దతుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

2019లో ఏం జరిగింది?
ఒసామా బిన్‌ లాడెన్‌ కుమారుడైన హమ్జా.. అల్‌ఖైదా భవిష్యత్‌ నాయకుడిగా ఎదుగుతున్నాడని అప్పట్లో అమెరికా నిఘా వర్గాలు భావించాయి. తండ్రి మరణం తర్వాత అల్‌ఖైదా ప్రచార వీడియోలు, ఆడియో సందేశాల్లో అతడి పేరు తరచూ వినిపించింది. దీంతో అతడు సంస్థకు కీలక నేతగా మారే అవకాశం ఉందని అంచనాలు వెలువడ్డాయి.

అయితే 2019 ఫిబ్రవరిలో హమ్జా ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల డాలర్ల రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. అదే ఏడాది.. అనూహ్యంగా ఓ ఆపరేషన్‌లో అతను మరణించినట్లు అమెరికా ప్రకటించింది. అయితే హమ్జా మృతిని అల్‌ఖైదా అధికారికంగా ప్రకటించకపోవడం అప్పట్లోనే ఆసక్తి రేపింది. సాధారణంగా కీలక నేతలు మరణించినప్పుడు సంతాప ప్రకటనలు చేసే సంస్థ.. హమ్జా విషయంలో అలాంటి ప్రకటన చేయలేదు.

తాజాగా విడుదలైన వీడియోలో హమ్జా కనిపించడం అతడు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడా? అనేది నిర్ధారణ కాలేదు. పైగా ఆ ఫుటేజ్‌ ఎప్పుడు చిత్రీకరించారన్నది తెలియదు. అతడి మరణానికి ముందు తీసిన పాత దృశ్యాలను ఇప్పుడు ప్రచార వీడియోలో ఉపయోగించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. 2025లోనూ హమ్జా బతికే ఉన్నాడంటూ కొన్ని నివేదికలు వెలువడ్డాయి.

కరాచీ దాడి దృశ్యాలతో మొదలు
వీడియో ఫుటేజీలో.. 2014లో పాకిస్థాన్‌లోని కరాచీ నేవల్‌ డాక్‌యార్డ్‌పై జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలతో ప్రారంభమైనట్లు సమాచారం. అనంతరం హమ్జా పలుమార్లు కనిపిస్తాడు. పాకిస్థాన్‌ కేంద్రంగా అల్‌ఖైదా కార్యకలాపాలు, ప్రచార వ్యవస్థకు ఉన్న సంబంధాన్ని నొక్కిచెప్పేలా ఈ ఫుటేజ్‌ను ఎంచుకున్నట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. హమ్జా పేరును మళ్లీ తెరపైకి తీసుకురావడం వెనుక అల్‌ఖైదా వ్యూహం కూడా ఇదేనని విశ్లేషిస్తున్నారు. ఒసామా బిన్‌ లాడెన్‌ వారసుడిగా అతడికి ఉన్న పాత ఇమేజ్‌ను ఉపయోగించి సంస్థ భావజాలాన్ని కొత్త తరానికి చేరవేసే ప్రయత్నంగా దీన్ని చూస్తున్నారు.

ముఖ్యంగా 9/11 దాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంలోనే ఈ వీడియో విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2001 సెప్టెంబర్‌ 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. పావు శతాబ్దం తర్వాత కూడా ఆ సంస్థ తన పాత నాయకులు, వారి వారసత్వాన్ని ప్రచారానికి ఉపయోగించుకోవడం ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.

ఇదీ చదవండి: షరీఫ్‌ ఇంట పెళ్లి సందడి.. పాక్‌ జనాల్లో కొత్త భయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement