దాదాపు రెండేళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నారు. నమోదైన అభియోగాలపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఆధారాల్లేవీ చూపించలేకపోయింది. అయితే చావు బతుకుల మధ్య తన తల్లి.. ఆ కొడుకును చూసేందుకు అర్జీ పెట్టుకుంది. అధికారుల మనసు కరగలేదు. చివరకు.. ఆ తల్లి అంత్యక్రియల కోసం పెరోల్ విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరించింది. పాపం.. కన్నతల్లిని చివరిసారి చూసే అవకాశం కూడా దక్కకపోవడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సరాసరి గుడిలోకి వెళ్లి శ్రీకృష్ణుడి విగ్రహం పాదాలను తాకుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
బంగ్లాదేశ్‌లో జైల్లో ఉన్న హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తన కుమారుడిని చివరిసారైనా చూడాలని కోరుకున్నారు. అయితే అందుకు జైలు అధికారులు అంగీకరించలేదు. చివరకు ఆమె మరణించాక అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆవేదనతో ఆయన పెరోల్ టైం పూర్తికాకముందే మళ్లీ జైలుకు వెళ్లిపోయారు. ఆ మధ్యలో ఆయన దేవుడి సన్నిధిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సంధ్యా రాణి కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆమెను చిట్టగాంగ్‌లోని పుండరీక ధామ్‌కు తీసుకొచ్చారు. తన తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న చిన్మయ్ కుటుంబ సభ్యులు.. ఆమెను చివరిసారిగా చూసేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని బుధవారం అధికారులను కోరారు. అయితే అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు ఖైదీకి పరోల్ ఇచ్చే నిబంధన లేదని అధికారులు కుటుంబానికి తెలిపారు. ఆ తర్వాతి రోజే సంధ్యా రాణి కన్నుమూశారు.
ఆమె మరణంతో చిన్మయ్ కుటుంబం మరోసారి అధికారులను ఆశ్రయించింది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు పరోల్ ఇవ్వాలని కోరింది. ఈసారి చిట్టగాంగ్ జిల్లా యంత్రాంగం మానవతా దృక్పథం అని పేర్కొంటూ ఐదు గంటలు మాత్రమే అనుమతి ఇచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు చిట్టగాంగ్ సెంట్రల్ జైలు నుంచి చిన్మయ్‌ను బయటకు తీసుకొచ్చారు.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చిన్మయ్ నేరుగా హతజారీ ప్రాంతంలోని పుండరీక ధామ్‌కు వెళ్లారు. అక్కడ తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అదే సమయంలో ఆలయంలోని రాధాకృష్ణుల విగ్రహం ముందు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకుంటూ విగ్రహం పాదాలను తాకారు. జైలులో ఉన్న సమయంలో తల్లి అనారోగ్యం, ఆమెను చూడలేకపోయిన బాధ ఆయనలో ఎంతగా ఉందో ఈ దృశ్యాలు చెప్పకనే చెప్పాయి. తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాక చిన్మయ్ తిరిగి జైలు బాట పట్టారు. పరోల్ సమయం రాత్రి 9 గంటల వరకు ఉన్నప్పటికీ.. రాత్రి 8.03 గంటలకే చిట్టగాంగ్ సెంట్రల్ జైలుకు చేరుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.
Heartbreaking 💔…!
Hindu monk Chinmoy Krishna Das
Taken into custody again In
BANGLADESH
He was out on parole for few hours
to see his dead mother…… pic.twitter.com/WMKX7sy68J— Mamta Painuly Kale (@mamta_kale) September 11, 2026
ఒకవైపు తల్లి మరణం.. మరోవైపు ఆమెను బతికుండగానే చివరిసారి చూడలేకపోయిన బాధ.. కేవలం ఐదు గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేసి మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి.. చిన్మయ్ పరోల్ దృశ్యాలను మరింత భావోద్వేగంగా మార్చాయి.
ఆరు క్రిమినల్ కేసులు
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల హక్కుల కోసం గళం వినిపించిన చిన్మయ్ కృష్ణ దాస్ 2024 నవంబర్ 25న అరెస్టయ్యారు. చిట్టగాంగ్‌లో జరిగిన ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారనే ఆరోపణలతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టైన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపర్చగా బెయిల్ నిరాకరించి జైలుకు పంపారు.
ఆయన అరెస్టు తర్వాత చిట్టగాంగ్ కోర్టు వద్ద జరిగిన ఆందోళనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వ న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలిఫ్ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులోనూ చిన్మయ్‌ను నిందితుడిగా చేర్చారు. దీనిపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.
ఇవే కాకుండా హత్యాయత్నం, విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడం, విధ్వంసం తదితర ఆరోపణలతో ఆయనపై మరికొన్ని కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చిన్మయ్‌పై ఆరు క్రిమినల్ కేసులు కొనసాగుతున్నాయి. వీటిలో నాలుగు కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. మిగిలిన కేసుల కారణంగా ఆయన జైలు నుంచి విడుదల కాలేకపోతున్నారు. దేశద్రోహం కేసులో లభించిన బెయిల్‌పైనా స్టే కొనసాగుతోంది.
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మైనారిటీల హక్కులు, భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. వరుస దాడులు, హత్యలు, ఈ మధ్యలోనే చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు, ఆయనపై కొనసాగుతున్న కేసులు, తాజాగా తల్లి బతికుండగానే పరోల్ దక్కకపోవడం వంటి పరిణామాలు వాస్తవ పరిస్థితుల్ని బయటపెడుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, మైనారిటీల భద్రత అంశాన్ని భారత్ పలుమార్లు ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇదీ చదవండి: ఆల్ టైం హైకి చేరితో భారత్ పరిస్థితి ఏంటి?


