సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందేనని అతడి తల్లి విజయలక్ష్మి హైకోర్టుకు నివేదించారు. సాయికృష్ణ విషయంలో న్యాయం జరగాలంటే, సీబీఐ దర్యాప్తే శరణ్యమని ఆమె చెప్పారు. దీంతో, పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని వివరాలు తమ ముందు ఉంచాలని.. ఇక ఎవరికీ ఎలాంటి గడువునిచ్చే ప్రసక్తేలేదని కోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.
కాగా, గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టుకు.. ‘సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని ఆచూకీ తెలియకుండా పోయింది. అతని ఆచూకీ కనుగొనడంలో, నిష్పక్షపాతంగా విచారణ జరపడంలో పోలీసులు విఫలమయ్యారు. అందువల్ల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి. నా కుమారుడిని 2026 మే 6న మార్కాపురంలో అదుపులోకి తీసుకుని, కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించినట్లు ప్రతివాదులైన పోలీసులు తమ కౌంటర్ అఫిడవిట్‌లో అంగీకరించారు.
అయితే, ఆ తర్వాత సాయికృష్ణ ఆచూకీ ఏమైంది అనే దానిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతలేదు. ఈ నేపథ్యంలో.. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడమే సముచితం. నా కుమారుడి లాకప్‌డెత్ కేసుకు సంబంధించి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేసినప్పటికీ, అందులో ఉన్నది కూడా పోలీసులే. విచారణ ఎదుర్కొంటున్న పోలీసు శాఖకు చెందిన వారే దర్యాప్తు చేస్తే న్యాయం జరిగే అవకాశమేలేదు. అందువల్ల సంస్థాగత స్వతంత్రత కోసం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుత కేసు కేవలం అనుమానాలు, నిరాధారమైన ఆరోపణలపై మాత్రమే ఆధారపడలేదు. రికార్డులో ఉన్న నిర్దిష్ట వాస్తవాలపై ఆధారపడింది’.. అని విజయలక్ష్మి పేర్కొన్నారు. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తాను దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లో పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌కు విజయలక్ష్మి ఈ మేరకు తిరుగు సమాధానం (రిప్లై) దాఖలు చేశారు.
ఇదీ చదవండి: సంతకాలు దాచిపెట్టి కూన కట్టుకథలు


