మెగా డీఎస్సీ మాదిరిగానే పశు సంవర్ధకశాఖలోనూ అడ్డగోలు వ్యవహారాలు
ఏపీపీఎస్సీ ద్వారా 164 వీఏఏస్ పోస్టుల భర్తీకి తొలుత సర్కారు ఉత్తర్వులు
24 గంటలు తిరక్కుండానే డీఎస్సీ ద్వారా భర్తీ అంటూ రివైజ్డ్ జీవో జారీ
ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూళ్లకు స్కెచ్
పరీక్షలు లేకుండా అడ్డదారిలో పోస్టులు కట్టబెట్టే యత్నాలపై నిరుద్యోగుల్లో ఆగ్రహం
2018లోనూ ఇదే రీతిలో పోస్టులు భర్తీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
భారీగా వసూళ్లతో పాటు రోస్టర్, రిజర్వేషన్లు పాటించలేదని పెద్దఎత్తున ఆరోపణలు
అడ్డగోలు నియామకాలపై కోర్టుల్లో భారీగా కేసులు
పారదర్శకంగా 6,105 వీఏహెచ్‌ఏ పోస్టులను భర్తీ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ ఉద్యోగాల నుంచి పశువుల డాక్టర్ల పోస్టుల దాకా అమ్మకానికి కావేవీ అనర్హం అన్నట్లుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తోంది! మెగా డీఎస్సీ 2025 ముసుగులో స్కామ్‌కు తెరతీసి నిరుద్యోగులకు చేసిన దగాను మరువక ముందే మరో కుంభకోణానికి బరి తెగించింది. తాజాగా వెటరర్నీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) పోస్టుల భర్తీలో అడ్డగోలు వ్యవహారాలకు పచ్చ జెండా ఊపింది. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ముసుగులో అసలు పరీక్షే రాయాల్సిన అవసరం లేదంటూ జీవో నెం. 4, 47 తీసుకొచ్చి అయినవాళ్లకు ఆ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా కట్టబెట్టడం తెలిసిందే. వసూళ్లతో పాటు నియామకాలు పూర్తయిన తర్వాత జీవో నెం. 23, 25, 56 జారీ చేసి గేట్లు మూసేసింది.
ఇలా డీఎస్సీ స్కామ్–1, స్కామ్–2 ఇంకా మరువకముందే ఇదే రీతిలో పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) పోస్టుల భర్తీ పేరిట మరో స్కామ్‌కు రంగం సిద్ధమైంది. పశు సంవర్ధక శాఖలో 357, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మరో 82 వీఏఏస్ పోస్టులు ఖాళీగా ఉండగా... ఈ ఏడాది 164 పోస్టుల భర్తీ పేరిట వసూళ్ల పర్వానికి తెర తీసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. తొలుత ఏపీపీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఈ నెల 13వ తేదీన జీవో ఆర్టీ నెం.21 జారీ చేసిన ప్రభుత్వం 24 గంటలు తిరక్కుండానే ఈ జీవోను వెనక్కి తీసుకోవడం గమనార్హం.

తాజాగా ఈ పోస్టులను డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తామంటూ రివైజ్డ్ జీవో 22 జారీ చేసింది. రాత్రికి రాత్రే ఇలా జీవోలను మార్చడం వెనుక పెద్ద మంత్రాంగమే జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో దాదాపు 2,500 మంది అర్హత కలిగిన అభ్యర్థులుండగా.. దొడ్డిదారిన ఈ పోస్టులను తమకు నచ్చిన వారికి అమ్ముకునేందుకు ప్రభుత్వ పెద్దలు బరి తెగించారని చెబుతున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూళ్ల పర్వం సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాత పరీక్ష లేకుండా నిర్వహించలేమన్న ఏపీపీఎస్సీ
పశు సంవర్ధక శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న వీఏఎస్ పోస్టులకు సంబంధించి ఈ ఏడాది జాబ్ క్యాలెండర్‌లో భారంగా 164 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తొలుత పేర్కొంది. ఈ మేరకు ఈ నెల 13వ తేదీన జీవో ఆర్టీ నెం.21 జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఈ పోస్టులను భర్తీ చేయాలని ఈ జీవోలో ఏపీపీఎస్సీకి సూచించింది. అయితే అసలు రాత పరీక్షే లేనప్పుడు ఈ పోస్టుల భర్తీలో తాము చేసేది ఏముంటుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. దీంతో డీఎస్సీ ద్వారానే ఈ భర్తీ చేపట్టాలని తాజాగా నిర్ణయించారు. తద్వారా తాము అనుకున్న రీతిలో గుట్టు చప్పుడు కాకుండా పని పూర్తి చేయవచ్చని ప్రభుత్వ పెద్దలు యోచించారు.
అదే రాత పరీక్ష ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాల్సి వస్తే వసూళ్ల పర్వానికి ఆస్కారం ఉండదని, తాము ఎంపిక చేసిన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించారు. రోస్టర్, రిజర్వేషన్ల వడపోత పేరిట తమకు నచ్చిన వారికి దొడ్డిదారిన పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని జీవో 21 జారీ చేసి 24 గంటలు తిరక్కుండానే ఈ పోస్టుల భర్తీ పూర్తిగా డీఎస్సీ ద్వారానే చేపడతామంటూ రివైజ్డ్ జీవో 22 జారీ చేశారు. సీనియారిటీ, మెరిట్, అనుభవం ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేస్తామని ఈ జీవోలో మెలిక పెట్టారు. అనుభవం ఉన్నట్లు సర్టిఫికెట్లు తెచ్చుకున్న వారికి డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయ పోస్టులు కట్టబెట్టినట్లుగానే ఈ ఉద్యోగాలను కూడా అమ్ముకోవడానికి ఎత్తు వేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో పరీక్షల ఆధారంగానే..
తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, హర్యానా, అసోం, తెలంగాణలో సైతం వీఏఎస్ పోస్టుల భర్తీకి పోటీ పరీక్ష నిర్వహించి అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేస్తున్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చంద్రబాబు సర్కారు దొడ్డిదారిన నియామకాలకు తెర తీసింది. ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు రాతపరీక్ష ద్వారా మాత్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాతపరీక్ష ద్వారా పోస్టులను భర్తీ చేస్తే కొత్తగా బీవీఎస్సీ ఉత్తీర్ణులైన వారికి అవకాశం లభిస్తుందని ఏపీ నిరుద్యోగ రిజిస్టర్డ్ వెటర్నరీ గ్రాడ్యుయేట్లు పేర్కొంటున్నారు.
2018లోనూ ఇదే రీతిలో..
గతంలో చంద్రబాబు హయాంలో 2018లో 253 వీఏఎస్ పోస్టులను ఇదే రీతిలో భర్తీ చేశారు. గతంలో కూడా ఒక్కో పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వసూళ్లు సాగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు రోస్టర్, రిజర్వేషన్ల పేరుతో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధగా జరిగిన ఈ నియామకాలపై కోర్టుల్లో పెద్ద ఎత్తున వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. చివరికి కోర్టులు కూడా చీవాట్లు పెట్టడంతో సుమారు నలుగురుకి పోస్టింగ్ ఇవ్వాల్సి వచ్చింది. మరికొంత మంది ఇంకా కోర్టుల ద్వారా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. దీంతో అప్పట్లోనే ఇక నుంచి ఈ పోస్టులన్నీ ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష ప్రాతిపదికన నిర్వహించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
పరీక్ష ఆధారంగానే భర్తీ చేయాలి
డీఎస్సీలో ఇటీవల వెలుగు చూస్తున్న ఘటనలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, నిరుద్యోగ యువజన జేఏసీ (ఏపీ సుజాక్) కన్వీనర్ ఎంబేటి రామచంద్ర మంగళవారం ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లను ఎలాంటి పరీక్ష లేకుండా భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ ద్వారా మొదట జీవో జారీ చేయడం.. తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. ఏటా వెటర్నరీ కాలేజీల నుంచి సుమారు 300 మంది గ్రాడ్యుయేట్లు బయటకొస్తారు. కొన్నేళ్లుగా వీరంతా ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచిచూస్తున్నారు. పోటీ పరీక్షల ఆధారంగా పోస్టులను భర్తీ చేయాలి. మహిళా శిశు సంక్షేమ శాఖలో 243 పోస్టుల భర్తీకి గత ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జీవోలు కూడా జారీచేసింది. ఇప్పుడు అందులో కేవలం 29 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామంటూ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
వైఎస్సార్ సీపీ హయాంలో పారదర్శకంగా నియామకాలు
పశుసంవర్ధక శాఖ పరిధిలో రాష్ట్రంలో రెండు సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్స్, 12 వెటర్నరీ పాలీ క్లినిక్‌లు, 323 ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, 1,577 వెటర్నరీ డిస్పెన్సరీలు, 1,218 రూరల్ లైవ్‌స్టాక్ యూనిట్లు (ఆర్‌ఎల్‌యూ), ఒక క్వాలిటీ అసెస్‌మెంట్ ల్యాబ్, రెండు వీబీఆర్‌ఐ ల్యాబ్స్‌తో పాటు జిల్లా, ప్రాంతీయ, నియోజక వర్గ స్థాయిలో మరో 168 ల్యాబ్స్ ఉన్నాయి. వీటి పరిధిలో అదనపు డైరెక్టర్ నుంచి గోపాల మిత్రల వరకు వివిధ హోదాల్లో శాంక్షన్ పోస్టులు 10,929 పోస్టులుండగా 7,733 మంది పని చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకే వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో పాడి రైతులను చేయిపట్టి నడిపించే సంకల్పంతో 9,844 పశు సంవర్ధక సహాయకుల పోస్టులను కొత్తగా మంజూరు చేశారు. 6,105 పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశారు. ప్రస్తుతం వివిధ హోదాల్లో 6 వేల పోస్టులకు పైగా ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా గ్రామ, మండల స్థాయిలోని వెటర్నరీ డిస్పెన్సరీల్లో 330, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రయోగశాల (లేబరేటరీస్)లో 27 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఏస్)పోస్టులను తక్షణమే భర్తీ చేయాల్సి ఉందని ఈ ఏడాది మార్చిలోనే గుర్తించారు. పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో మరో 82 వీఏఏస్ పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపాదించారు.


