గన్‌మెన్‌తో చెలరేగుతున్నటీడీపీ నాయకులు | Tension in YSR District Pulivendula | Sakshi
Sakshi News home page

గన్‌మెన్‌తో చెలరేగుతున్నటీడీపీ నాయకులు

Sep 16 2026 5:57 AM | Updated on Sep 16 2026 5:57 AM

Tension in YSR District Pulivendula

విజయ్‌కుమార్‌ ఇంటిపై రాళ్లు రువ్వుతున్న దృశ్యం

పులివెందులలో ఏకంగా 25 మంది చోటా నాయకులకు గన్‌మెన్‌ల నియామకం 

వారిని అడ్డుపెట్టుకొని దందాలు, దాడులకు పాల్పడుతున్న నాయకులు.. ఇటీవల వైఎస్సార్‌సీపీ నేతపై గన్‌మెన్‌తో దాడి 

సోమవారం టీడీపీలోని రెండు వర్గాల ఘర్షణలో కాల్పులు జరిపిన గన్‌మెన్‌.. టీడీపీ నేతల అరాచకాలతో భయభ్రాంతులకు గురవుతున్న పట్టణ ప్రజలు 

నిజంగా ముప్పు ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలకు రక్షణ కరవు.. కోర్టు ఆదేశాలూ బేఖాతరు  

సాక్షి ప్రతినిధి, కడప/పులివెందుల రూరల్‌: వైఎస్సార్‌ కడప జిల్లాలో అధికార టీడీపీ నేతలకు అడిగిందే తడవుగా చంద్రబాబు ప్రభుత్వం గన్‌మెన్‌ను కేటాయించడంతో, వారిని అడ్డుపెట్టుకొని నాయకులు చెలరేగిపోతున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 25 మంది గన్‌మెన్‌ను ఇచ్చేంత పెద్ద అధికార హోదా లేని చోటా మోటా నాయకులు కూడా గన్‌మెన్‌ను వెంటేసుకొని తిరుగుతూ పట్టణంలో దందాలు, జూ­దం, దాడులతో అరాచకం సృష్టిస్తున్నారు. 

ఇటీవల తుమ్మలపల్లెకు చెందిన ఓ టీడీపీ నాయకుడు తన గన్‌మేన్‌తో గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులపైన దాడికి దిగగా.., సోమవారం మరోసారి టీడీపీ నేత గన్‌మేన్‌ కాల్పులు జరపడం పట్టణ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి వర్గంలోని రెండు గ్రూపులు సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డాయి. 

వినాయక ఉత్సవాల్లో వివాదం 
పట్టణంలోని మైత్రి లేఅవుట్‌లో టీడీపీ నాయకుడు పుష్పనాథరెడ్డి ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం జరిగిన వినాయక చవితి ఉత్సవాల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి, ఇతర నాయకులను సన్మానించారు. అక్కడే ఉన్న మరో టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డిని సన్మానించలేదు. దీంతో పుష్పనాథరెడ్డి, విజయకుమార్‌ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత పుష్పనాథరెడ్డి, తొండూరు మండలానికి చెందిన మల్లికార్జునరెడ్డి, కొత్తపల్లె మాజీ సర్పంచ్‌ ప్రసాద్, గంగాధరరెడ్డి, మంజునాథరెడ్డి ఓ బీజేపీ నాయకుడి ఇంటికి వెళ్లారు. 

విజయ్‌కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసి అక్కడికి రమ్మన్నారు. విజయ్‌కుమార్‌ రెడ్డి అక్కడికి వెళ్లగా రెండు వర్గాల మధ్య మళ్లీ ఘర్షణ జరిగి, చెప్పులతో కొట్టుకొన్నారు. దీంతో ‘నీ ఇల్లు కూల్చేస్తాను’ అని పుష్పనాథ్‌ రెడ్డిని విజయ్‌కుమార్‌ రెడ్డి హెచ్చరించి వెళ్లిపోయాడు. దీంతో పుష్పనాథరెడ్డి రాత్రి 10.30 గంటల తర్వాత వంద మందితో విజయ్‌కుమార్‌రెడ్డి ఇంటికి వెళ్లి హజ్‌ కమిటీ డైరెక్టర్‌ మహబూబ్‌ బాషా, టీడీపీ నాయకుడు భాస్కర్‌రెడ్డిపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో ఇంటి ముందు ఉన్న మూడు కార్లను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో హజ్‌ కమిటీ డైరెక్టర్‌ మహబూబ్‌ బాషా గన్‌మేన్‌ రబ్బాని గాలిలోకి కాల్పులు జరిపాడు. 

పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్‌ భారీ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ ఘర్షణపై ఇరు వర్గాలకు చెందిన పుష్పనాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ప్రసాద్, గంగాధరరెడ్డి, మంజునాథరెడ్డితోపాటు అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వాస్తవానికి అక్కడ ఉన్న ఏ ఒక్క నాయకుడికీ చట్ట ప్రకారం గన్‌మెన్‌ను ఇచ్చే హోదా లేదు. అంతకుమించిన ప్రాణముప్పు కూడా లేదని పరిశీలకులు చెబుతున్నారు. కానీ, పుష్పనాథరెడ్డి, విజయ్‌కుమార్‌ రెడ్డి సహా అక్కడున్న అందరికీ ప్రభుత్వం గన్‌మెన్‌ను ఇచ్చింది.

ముప్పున్న వైఎస్సార్‌సీపీ నేతలకు రక్షణ కరవు.. కోర్టు ఆదేశాలూ బేఖాతరు 
మరోవైపు వైఎస్సార్‌సీపీలో నిజంగా ప్రాణాలకు ముప్పు ఉన్న నాయకులకు రక్షణ కరువైంది. వైఎస్సార్‌సీపీ నాయకునికి గన్‌మెన్‌ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలనూ పోలీసులు బేఖాతరు చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వేల్పుల రామలింగారెడ్డి (రాము)పై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేయడంతో తనకు రక్షణ కల్పించాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై జరిగిన దాడిలో తగిలిన గాయాలు, ఇతర బలమైన ఆధారాలను హైకోర్టుకు సమరి్పంచారు. వాటన్నింటినీ పరిశీలించిన హైకోర్టు.. రాముకు తక్షణమే గన్‌మెన్‌ను కేటాయించాలని కడప జిల్లా పోలీసులను ఆదేశించింది. అయినా, కడప జిల్లా పోలీసు అధికారులు రామలింగారెడ్డికి గన్‌మెన్‌ను ఇవ్వలేదు. ఇలా నిజమైన బాధితులకు రక్షణ నిరాకరిస్తూ, ఎలాంటి ప్రాణహాని లేని టీడీపీ నాయకులకు ప్రభుత్వం గన్‌మెన్‌ను కేటాయించడం పట్ల పులివెందుల వాసులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement