అక్టోబర్ 2, 3న విజయవాడలో 48 గంటల నిరవధిక దీక్ష
ఏపీ సీపీఎస్‌ఈఏ హెచ్చరిక
సాక్షి, అమరావతి: సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించకపోవడంపై ఏపీ సీపీఎస్‌ఈఏ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.4 లక్షల వరకు డీఏ బకాయిలు రావాల్సి ఉన్నా.. చెల్లించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని సంఘాధ్యక్షుడు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు ఆరోపించారు. సెప్టెంబర్ నెలాఖరులోపు సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలను పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. గడువులోగా ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 2, 3 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్‌లో 48 గంటల నిరాహార దీక్ష చేపడతామని మంగళవారం ప్రకటించారు. ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ప్రతి రూపాయిని చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ప్రధాన డిమాండ్లు ఇవీ..
సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలుకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలి
⇒ సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ఏఏఎస్‌ను వెంటనే మంజూరు చేయాలి
⇒ నాలుగేళ్లుగా ఆలస్యమైన పీఆర్‌సీని జాప్యం చేయకుండా ప్రకటించాలి
⇒ సీపీఎస్ ఉద్యోగుల పెండింగ్ ఆర్థిక, సర్వీస్ సమస్యలను పరిష్కరించాలి.
⇒ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారం చూపాలి


