అనంతపురంలో కారు బీభత్సం | Car Crashes Into Hotel in Anantapur | Sakshi
Sakshi News home page

అనంతపురంలో కారు బీభత్సం

Sep 16 2026 6:02 AM | Updated on Sep 16 2026 6:03 AM

Car Crashes Into Hotel in Anantapur

ఇద్దరు యువతులు దుర్మరణం... మరో ఇద్దరు యువకులకు గాయాలు 

బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్క­రాయసముద్రం మండలం రోటరీపురం వద్ద టాటా సఫారీ కారు అదుపుతప్పి ఓ హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. అనంతపురం–తాడిపత్రి రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో స్నేహితులు హరిత (20), నవనీత(20) మృతి చెందారు. వీరిద్దరు ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సులుగా పనిచేస్తున్నారు.  గుత్తి మండలానికి చెందిన రామాంజనేయులు,సాలమ్మల కుమార్తె హరిత (20) అనంతపురంలోని ఓ నర్సింగ్‌ కళాశాల మూడో సంవత్సరం చదువుతూ త్రిపుర ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. తాడిపత్రి మండలం నిడిగల్లు గ్రామానికి చెందిన నారాయణస్వామి, విజయ దంపతుల కుమార్తె నవనీత(20) కూడా త్రిపుర ఆస్పత్రిలోనే నర్సుగా పని చేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరు స్నేహితులయ్యారు. ఇద్దరు ఓ ప్రైవేట్‌ హాస్టల్లో ఉంటున్నారు. 

దుర్ఘటన జరిగిందిలా...: సోమవారం రాత్రి వీరు తమ స్నేహితులైన త్రిపుర ఆస్పత్రి ల్యాబ్‌లో పనిచేసే వినయ్‌ కుమార్, ఆస్పత్రిలో బీమా విభాగంలో పనిచేసే శ్రీధర్‌రెడ్డితో కలిసి టాటా సఫారీ (ఏపీ40ఈజెడ్‌1611)లో బయటకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా రోటరీపురం సమీపంలోని ప్‌లై ఓవర్‌పై స్పీడ్‌ బ్రేకర్లను గమనించకుండా శ్రీధర్‌రెడ్డిరెడ్డి అతివేగంగా కారు నడపడంతో అదుపుతప్పిన కారు సమీపంలోని హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా పడిపోయింది. హరిత అక్కడికక్కడే మృతి చెందగా, నవనీత, శ్రీధర్‌రెడ్డి, వినయ్‌ కుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సీఐ సుబ్బరాయుడు, పోలీసు సిబ్బంది క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవనీత మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement