సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ రాజకీయాల్లో కొందరు ఎప్పుడూ కరివేపాకులాంటి వాళ్లేనని మరోసారి రుజువైంది. మంత్రి లోకేశ్ పర్యటనతో తన ప్రతిష్టను పెంచుకోవాలని చూసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి ఆ పార్టీలో వీసమెత్తు పలుకుబడి లేదని విస్పష్టమైంది. పార్టీలో జిల్లా నుంచి మంత్రి నారాయణ, వేమిరెడ్డి దంపతుల మాటకే ప్రాధాన్యత ఉందనే సంకేతాలు ఇచ్చినట్లు అయింది. ఇకపై నియోజకవర్గంలో పార్టీ క్యాడర్‌కు సైతం తన ముఖం చూపించుకోలేని ఘోర పరాభవాన్ని చవిచూశారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దగ్గర మార్కులు కొట్టేయాలనే తృష్ణతో లోకేశ్ బుధవారం నెల్లూరు, కోవూరు పర్యటనకు రానున్న నేపథ్యంలో తిరుపతి నుంచి వస్తున్న ఆయన్ను తన నియోజకవర్గ పరిధి నుంచి మాగుంట లేఅవుట్ రోడ్డులోని కార్యాలయం మీదుగా పర్యటనకు తొలుత రూట్ మ్యాప్ సిద్ధం చేశా రు. సుమారు 10 వేల మందితో ఘన స్వాగతం పలికి, తన పలుకుబడిని పెంచుకోవాలని నాలుగు రోజులుగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో సమీక్షలు, సమావేశాలు పెట్టారు. ఈ పరిణామాలతో మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు అవకాశం దక్కించుకోవాలని కోటంరెడ్డి కంటున్న కలలు భగ్నమే అని రాజకీయంగా చర్చ జరుగుతోంది.
ఆఖరి క్షణంలో ఝలక్
అయితే లోకేశ్ పర్యటనలో నెల్లూరు రూరల్ ఊసేలేకుండా ఆఖరి క్షణంలో రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. నేరుగా మంత్రి నారాయణ ప్రాతినిథ్యం వహించే సిటీ నియోజకవర్గంలోని పలు కార్యక్రమాల్లో.. ఆ తర్వాత కోవూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేలా పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేయడంతో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని ఉద్దేశ పూర్వకంగానే పక్కకు తప్పించినట్లు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ చర్చ జరుగుతోంది. ఇది కోటంరెడ్డికి జరిగిన ఘోర పరాభవంగా భావిస్తున్నారు. ఇటీవల కాలంలో నెల్లూరు మేయర్ స్థానం విషయమై ఇటు మంత్రి నారాయణ, అటు వేమిరెడ్డి దంపతులతో విభేదించిన శ్రీధర్‌రెడ్డిని రాజకీయంగా ఒంటరిని చేసి అణచివేసేందుకే అనే ప్రచారం కూడా లేకపోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో శ్రీధర్‌రెడ్డి లోకేశ్ పర్యటనలో పాల్గొంటారా? ముఖం చాటేస్తారా? అనే విషయంపై చర్చ నడుస్తోంది.
బోసిపోయిన ఎమ్మెల్యే కార్యాలయం
లోకేశ్ పర్యటన పర్యటన నేపథ్యంలో హడావుడి చేసిన కోటంరెడ్డి క్యాడర్ ఆఖరి క్షణంలో మార్పు చేయడంపై భగ్గుమంటుంది. నెల్లూరు రూరల్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు రచ్చరచ్చ చేయడంతో వారిని నాయకులు సముదాయించే ప్రయత్నం చేశా రు. జరిగిన అవమానం, క్యాడర్ ఒత్తిడిని తట్టుకోలేక శ్రీధర్‌రెడ్డి తన కార్యాలయం నుంచి నిష్క్రమించారు. హడావుడిగా కనిపించిన ఎమ్మెల్యే కార్యాలయ ప్రాంతంలో క్యాడర్ సైతం ముఖం చాటేయడంతో బోసిపోయింది.
కోటంరెడ్డి ఇక ఒంటరేనా?
రాజకీయంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒంటరి కావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్‌సీపీ అండతో ఎదిగిన కోటంరెడ్డి తన బలంగా భ్రమించారు. అడ్డగోలుగా చెలరేగిపోతున్న ఆయన్ను కట్టడి చేసిన నేపథ్యంలో తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్సార్‌సీపీని దూషిస్తూ పచ్చ కండువా కప్పుకొ న్నారు. అప్పటి నుంచి మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై స్థాయిని మరిచి తరచూ ప్రేలాపణలతో చెలరేగిపోయారు.
తాజాగా దగా డీఎస్సీపైనా లోకేశ్‌ను వెనకేసుకు వస్తూ ఇష్టారీతిన మాట్లాడారు. అప్పటి వరకు కోటంరెడ్డిని అభిమానించిన ఆ పార్టీ శ్రేణులు సైతం ఈ పరిణామాలతో ఛీదరించుకునే పరిస్థితికి దిగజారిపోయాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను, శ్రేణులను సైతం బెదిరించి ఇదే తన బలమంటూ.. పేట్రేగిపోతున్నారు. తాజా పరిణామాలతో కోటంరెడ్డికి అధికార పార్టీలో కనీస స్థాయి పలుకుబడి లేదని స్పష్టం కావడంతో క్యాడర్ సైతం మౌనం.. గుంభనంగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు.. హెచ్-1బీ వీసాల పేరుతో..


