ఇలాగైతే రాజీనామా చేస్తా.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఆవేదన | BJP MLA Rakesh Reddy Sensational Comments In Assembly | Sakshi
Sakshi News home page

ఇలాగైతే రాజీనామా చేస్తా.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఆవేదన

Sep 16 2026 11:14 AM | Updated on Sep 16 2026 11:42 AM

BJP MLA Rakesh Reddy Sensational Comments In Assembly

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లాకు ప్రభుత్వం నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అవసరమైతే ఈ అంశంపై రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు పొలిటికల్‌ హీట్‌ను పెంచాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి మాట్లాడుతూ..‘నాకు పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి.. నేను రాజీనామా చేయాలని అనుకుంటున్నా’ అంటూ స్పీకర్‌ను కోరారు. కొడంగల్‌తో పాటు మంత్రుల నియోజకవర్గాలకు ఎన్ని నిధులు తీసుకెళ్తున్నారు.. నిజామాబాద్ జిల్లాకు ఎన్ని నిధులు ఇచ్చారో పూర్తి లెక్కలతో వచ్చానని తెలిపారు. అన్ని వివరాలను సభలో వెల్లడించిన తర్వాత తన రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని రాకేష్‌రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణ శాసనసభ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు 22A భూముల అంశం, ఎల్‌నినో ప్రభావంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. 22Aపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. 22A అంశంపై ప్రభుత్వం గుర్తించిన 16 అంశాలపై సీఎం సభలో వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 22A సమస్యల్లో పలు అంశాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అధికారుల కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సభలో ప్రకటనకు ముందు సీఎం మరోసారి మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 22A నిషేధిత భూముల జాబితా, గతంలో చోటుచేసుకున్న పరిణామాలు, నిజమైన ప్రైవేటు భూముల యజమానులకు ఉపశమనం కల్పించే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

ఇదీ చదవండి: ‘ఐపీఎస్‌’ కోల్డ్‌వార్‌.. రేవంత్‌కు సంచలన నివేదిక

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement