తిరుమలగిరి(సాగర్)నల్గొండ జిల్లా : గణేష్ మండపాల వద్ద రెండు వర్గాల మధ్య ఏర్పడిన గొడవ చివరికి పూజారి మృతికి దారితీసింది. తిరుమలగిరి(సాగర్) మండలం చింతలపాలెం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో గత 17 సంవత్సరాలుగా నందికొండ మున్సిపాల్సి పరిధిలోని పైలాన్‌కాలనీకి చెందిన ఉప్పల దత్తుప్రసాద్(60) పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో కూడా పూజలు చేస్తారు.
సోమవారం వినాయకచవితి కావడంతో విగ్రహాల వద్ద పూజలు నిర్వహించడానికి ఆయనతో పాటు ఆయన కుమారుడు ఉప్పల శ్రీవల్లభరాఘవ చింతలపాలెం వచ్చారు. గ్రామానికి చెందిన గుండాల రవి, గుండాల పున్నయ్య పూజారికి ఫోన్ చేసి మొదటగా మా విగ్రహం వద్ద పూజలు నిర్వహించాలని సూచించారు. వారి సూచన మేరకు అక్కడికి వెళ్లిన దత్తుప్రసాద్.. అక్కడ ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో గ్రామంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన మరో విగ్రహం వద్దకు వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న రవి, పున్నయ్య మొదటగా మా విగ్రహం వద్దనే పూజలు నిర్వహించాలని చెప్పినప్పటికీ ఇక్కడికి వచ్చి ఎలా పూజలు నిర్వహిస్తావని దత్తుప్రసాద్‌తో గొడవకు దిగారు.
ఈ క్రమంలో దత్తుప్రసాద్‌పై చేయి చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లు కలుగజేసుకొని దత్తుప్రసాద్‌ను పక్కనే ఉన్న ఆలయంలోకి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తరువాత గ్రామస్తులు సర్దిచెప్పడంతో దత్తుప్రసాద్ తన కుమారుడు శ్రీవల్లభరాఘవకు కమిటీ విగ్రహం వద్ద పూజలు నిర్వహించమని చెప్పి ఆయన గుండాల రవి, పున్నయ్య విగ్రహం వద్దకు వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహిసూ్తనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే నాగార్జునసాగర్ కమలానెహ్రూ హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వీరశేఖర్ తెలిపారు.
పూజలందుకోకుండానే గంగమ్మ ఒడికి..
పురోహితుడు దత్తుప్రసాద్ మృతితో చింతలపాలెంలో ఆరు విగ్రహాలను ప్రతిష్ఠించగా సోమవారం రాత్రి రెండు విగ్రహాల వద్దనే పూజ జరిగింది. మిగతా నాలుగు విగ్రహాల వద్ద పూజ జరగలేదు. దీంతో మంగళవారం రాత్రి గ్రామంలో ఉన్న ఆరు విగ్రహాలను శోభాయాత్ర లేకుండానే నాగార్జున సాగర్‌లో నిమజ్జనం చేశారు.
ఇదీ చదవండి: ఎక్కడున్నావ్ జానూ!


