పెద్దపల్లి: భార్య, భర్త, వారికి ఇద్దరు పిల్లలు.. చింత లేని ఆ చిన్న కుటుంబాన్ని విధిపగబట్టింది. ఆరునెలల్లోనే ఛిద్రం చేసింది. రోడ్డు ప్రమాదంలో భర్త కాలు కోల్పోగా, భార్య క్యాన్సర్‌తో సోమవారం మృతి చెందింది. వివరాలు.. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామానికి చెందిన పడాల సత్యయ్యగౌడ్ – సునీత దంపతులకు అశ్విత, నిషిత్ సంతానం.అశ్విత డిగ్రీ ప్రథమ సంవత్సరం, నిషిత్ ఇంటర్ ఫస్టియర్ చదువుచున్నాడు.
సత్తయ్య ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడు. సునీత గ్రామ బస్టాండ్ సమీపంలో కిరాణం నిర్వహిస్తుండేది. ఈయేడాది ఫిబ్రవరిలో గ్రామశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తయ్యగౌడ్ కాలు నుజ్జునుజ్జు అయింది. డాక్టర్లు దానిని తొడవరకు తొలగించారు. మధ్య తరగతి కుటుంబం కావడం, ఇంటి పెద్దదిక్కు మంచానికే పరిమితమైన నేపథ్యంలో కుటుంబ పోషణ భారమైంది.
అయినా, ఆరునెలలుగా సునీత కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. నాలుగేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న సునీతకు పరిస్థితి విషమించడంతో ఈనెల 6వ తేదీన వరంగల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి మృతిచెందగా మంగళవారం అంతక్రియలు నిర్వహించారు. మృతురాలి కుమారుడు నిషిత్ తల్లి చితికి నిప్పంటించాడు. ఆచేతానస్థితిలో ఉన్న సత్తయ్యకు ఆసరాగా ఉంటూ కుటుంబానికి పెద్దదిక్కుగా నిలబడిన సునీత మరణంతో ఆ కుటుంబ దిక్కుతోచని స్థితిలోకి వెళ్లింది. దాతలు, మానవతావాదులు స్పందించి బాసటగా నిలువాలని గ్రామస్తులు కోరుతున్నారు.


