న్యూస్ మేకర్
దిక్కులు పిక్కటిల్లేలా ధైర్యసాహసాలు ఎప్పుడూ గర్జిస్తూ ఉండవు. కొన్ని సందర్భాలలో అవి మౌనంగా ఉంటాయి’ అనే మాటొకటి ఉంది. సీబీఐ ఆఫీసర్ సీమ పహుజా గురించి విన్న వారికి, ఆమె పనితీరును నిశితంగా గమనించిన వారికి పై వాక్యాలు వెంటనే గుర్తుకొస్తాయి. సీమ పహుజా పెద్దగా మాట్లాడరు. ఆమె పేరు మాత్రం దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట సంచలన స్వరంతో వినిపిస్తూనే ఉంటుంది.
తాజాగా...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ అనుమానాస్పద మృతి కేసు విచారణ బాధ్యతలను సీమ పహుజా చేపట్టనున్నారు..
శివసేన (యూబీటి) నాయకుడు ఆదిత్య థాకరే, నటుడు డినో మోరియా పేర్లను ప్రస్తావిస్తూ దిశా శాలియన్ తండ్రి సతీష్ శాలియన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న భవనం 14వ అంతస్తు నుండి కిందపడి దిశా శాలియన్ మరణించింది. బాంద్రాలోని ఒక ప్లాట్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించడానికి కొద్ది రోజుల ముందే ఈ ఘటన జరిగింది. మొదట ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు(ఏడీఆర్)గా కేసు నమోదు చేశారు.
హైకోర్టు ఆదేశం
‘విచారణ అనంతరం దిశా శాలియన్ ఆత్మహత్య చేసుకుంది’ అని పోలీసులు చెప్పారు. పోలీసులు చెప్పినదాన్ని విభేదిస్తూ, తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని, హత్యకు గురైందని ఆరోపిస్తూ సీమ తండ్రి సతీష్ శాలియన్ హైకోర్టులో గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అనుసరించి ఆమె మరణానికి సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టాలని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ ఆఫీసర్ సీమ పహుజా చేపట్టనుండడంతో ‘ఎవరీ సీమ పహుజా?’ అనే ఆసక్తి మొదలైంది.
విశేష అనుభవం
దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక నేరవిభాగంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు సీమ పహుజా. సున్నితమైన కేసులతో సహా క్లిష్టమైన క్రైమ్‌కేసులు, ఫోరెన్సిక్ సాక్ష్యాల దర్యాప్తులో ఆమెకు విశేష అనుభవం ఉంది. 2024లో కోల్‌కతా ఆర్.జి.కార్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసు దర్యాప్తు బృందంలో సీమ సభ్యురాలిగా ఉన్నారు.
ఉన్నావ్ అత్యాచార కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో హత్రాస్ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన పదిహేనుమంది సభ్యుల బృందంలో ఆమె ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో గుడియా కేసు దర్యాప్తు బాధ్యతను కూడా సీబీఐ సీమ పహుజాకు అప్పగించింది. సిమ్లాలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం, హత్యకు సంబంధించిన దర్యాప్తులో కూడా ఆమె పాలుపంచుకున్నారు.
బంగారంలాంటి ఆఫీసర్!
ఔట్‌స్టాండింగ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా 2007, 2018, 2021లో బంగారు పతకాలను గెలుచుకున్నారు సీమ పహుజా. సీబీఐలో ఆమె చేసిన విశిష్ట సేవలకు 2014లో పోలీస్ మెడల్ ప్రదానం చేశారు. ‘జటిలమైన కేసులను దర్యాప్తు చేయడంలో దిట్ట’ అని పేరు తెచ్చుకున్న సీమ పహుజా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి వివరం... పకడ్బందీగా!
సంచలనం సృష్టించిన కోట్‌ఖాయ్ (హిమాచల్ ప్రదేశ్) కేసులో నిందితుడు తప్పించుకోకుండా, శిక్ష పడేలా చేయడం సీమ పహుజా సాధించిన విజయాలలో ఒకటి. పదవ తరగతి చదివే అమ్మాయి స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా అదృశ్యమైంది. రెండు రోజులు తరువాత ఆమె మృతదేహం కనిపించింది. ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపారు. నిందితులను పట్టుకోవడంలో, కేసును ఛేదించడంలో పోలీసులు విఫలం అయ్యారు.
ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో ‘లీనియేజ్ టెస్టింగ్’ అనే వినూత్నమైన పద్ధతిని భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించారు. దీంతో కేసులో కీలక పురోగతి వచ్చింది. నిందితుడికి జీవిత ఖైదు విధించారు. ‘తనకు అప్పగించిన కేసులకు సంబంధించి ఏ చిన్న వివరాన్నీ సీమ వదిలి పెట్టరు.
‘నిందితులకు శిక్ష పడేలా, తార్కిక ముగింపు ఉండేలా కేసులను పకడ్బందీగా రూపొందించడంలో దిట్ట’ అని సీమ పహుజా గురించి సీబీఐలోని సీనియర్ అధికారులు చెబుతుంటారు. బీకాం చేసిన సీమ పహుజా 1988లో ఏజెన్సీలో చేరారు. 1993లో సబ్–ఇన్‌స్పెక్టర్ అయ్యారు. 2013లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హోదాకు పదోన్నతి పొందారు. 2022లో ఏఎస్పీ అయ్యారు. సీబీఐలో విశిష్ట సేవలకుగాను రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు. సాక్షులను మానసికంగా విశ్లేషించడంలో తనదైన శైలిని, అద్భుతమైన నైపుణ్యాలను ప్రదర్శిస్తారని పేరు తెచ్చుకున్నారు.


