కల్పిత కథలు కాదు... నిజజీవిత కథలు వెండితెరపై ఆదరణ పొందుతున్న కాలం ఇది. ఈ వరుసలో ఇప్పుడు ‘దైరా’ చేరింది. ఈ కథకు మూలం... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరి«ధిలో ఏడేళ్ల క్రితం చోటు చేసుకున్న ‘దిశ’పై హత్యాచారం, నిందితుల ఎన్ కౌంటర్ అనే టాక్ బలంగా వినిపిస్తోంది. మేఘనా గుల్జార్ దర్శకత్వంలో ‘దైరా’ పేరుతో సినిమాగా తెరకెక్కింది. కరీనా కపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీసు అధికారులుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది...
హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ టోల్‌ప్లాజా వద్ద 2019 నవంబర్ 27 రాత్రి... వెటర్నరీ వైద్యురాలు (26) స్కూటర్‌ను పార్క్ చేసి మరో చోటుకి వెళ్లారు. అది గమనించిన నలుగురు దుండగులు పథకం ప్రకారం ఆమె స్కూటర్ టైర్ పంక్చర్ చేశారు. తిరిగి వచ్చిన ఆమెకు సాయం చేస్తున్నట్లు నమ్మించి, సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. మృత దేహాన్ని లారీలో చటాన్ పల్లి సమీపంలోని అండర్‌పాస్ వద్దకు తీసుకెళ్లి తగులబెట్టారు. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
24 గంటల్లో నిందితుల అరెస్ట్... మృతదేహం మర్నాడు (2019 నవంబర్ 28) వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవంబర్ 29న నిందితులైన హమ్మద్ ఆరిఫ్ (లారీ డ్రైవర్), జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులులను (క్లీనర్) అరెస్టు చేశారు. ఈ నిందితులను షాద్‌నగర్ పోలీసుస్టేషన్ కు తీసుకొచ్చిన సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని, నిందితులను తమకు అప్పగించాలని, వెంటనే కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను
చెదరగొట్టాల్సి వచ్చింది.
చటాన్ పల్లి ఎన్ కౌంటర్... తెలంగాణ ప్రభుత్వం దిశ కేసు విచారణకు 2019 డిసెంబర్ 4న ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. దిశ అదృశ్యంపై కేసు నమోదు, దర్యాప్తులో పోలీసుల స్పందనలో జాప్యం జరిగిందనే ఆరోపణలతో ముగ్గురు పోలీసు సిబ్బందిపై వేటు పడింది. డిసెంబర్ 6 తెల్లవారుజామున నలుగురు నిందితులను క్రైమ్ సీన్ రీ–కన్ స్ట్రక్షన్ కోసం చటాన్ పల్లి తీసుకువచ్చారు. అక్కడ జరిగిన ఎన్ కౌంటర్‌లో నలుగురూ చనిపోయారు. నిందితులు తమ వద్ద ఉన్న ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారని, అలా పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపామన్నది పోలీసుల కథనం.
కమీషన్ నుంచి కోర్టుకు... నిందితుల్లో మైనర్ ఉన్నారని, నిజమైన ఎన్ కౌంటర్ కాదని వివాదం చెలరేగింది. దీంతో 2019 డిసెంబర్ 12న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలోని కమిషన్ లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా సోందూర్ బల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్ డీఆర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు. 2022లో కమిషన్ 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.
కీలక అంశాలు
‘దైరా’లో కరీనా డీసీపీ అజూనీ కోహ్లీగా, పృథ్వీరాజ్ డీసీపీ రమణ్ కుమార్‌గా నటించారు. ఓ కేసు విషయంలో వీరిద్దరి ఆలోచనలు, దర్యాప్తు విధానాలు విభేదిస్తాయి. అజూనీ కేసును లోతుగా దర్యాప్తు చేస్తుంది అజూనీ. రమణ్ చేసిన ఎన్ కౌంటర్లపై ప్రశ్నలు తలెత్తుతాయి. మైనర్ నిందితులపై చట్టం ఎలా వ్యవహరించాలి? తీవ్రమైన నేరాలకు పాల్పడిన మైనర్లకు కూడా అదే రక్షణ వర్తించాలా? ఈ కీలక అంశాలు ‘దైరా’లో ప్రస్తావనకు వస్తాయి.
– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, సాక్షి, హైదరాబాద్


