ఉంటే మరింత మెరిసేవాళ్లు! | Indian celebrities reportedly died by suicide | Sakshi
Sakshi News home page

ఉంటే మరింత మెరిసేవాళ్లు!

Sep 10 2026 5:25 AM | Updated on Sep 10 2026 5:25 AM

Indian celebrities reportedly died by suicide

నేడు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం

ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 10న ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచం మొత్తం మీద సంవత్సరానికి దాదాపు 20 లక్షల మంది ఆత్మహత్య చేసుకుని మరణిస్తున్నారు. మన దేశంలో సుమారు రెండు లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేవలం బలహీన మనస్కులే ఆత్మహత్య చేసుకుంటారనేది అపోహ మాత్రమే. ప్రపంచాన్ని తన నియంతృత్వ పోకడలతో గడగడలాడించిన ‘హిట్లర్‌’ మొదలుకొని ఇటీవల త్రిపుర రాష్ట్ర పోలీస్‌ అధినేత లాంటి ఎందరో దేశాధినేతలు, అధికారులు, సైంటిస్టులు, సినీ తారలు చివరకు ఈ విధంగానే తనువు చాలించారు. ముఖ్యంగా సినిమా తారల గురించి చెప్పాలంటే... సిల్వర్‌ స్క్రీన్‌ పై ఎంతో పేరు తెచ్చుకున్న నటీనటులు కొందరు చివరకు ఇలాగే ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

హాలీవుడ్‌ను ఒకప్పుడు ఒక ఊపు ఊపిన మార్లిన్‌ మన్రో చివరకు నిద్ర మాత్రలు మింగి మరణించింది. వ్యక్తిగత జీవితంలో మూడు వివాహాలు, విడాకులు, అనేక ప్రేమ వ్యవహారాలు నడిపిన మార్లిన్‌ జీవితం అర్ధాంతరంగానే ఆత్మహత్యతో ముగిసింది. బాలీవుడ్‌ విషయానికొస్తే... ‘మొగల్‌ ఏ ఆజమ్‌’ హీరోయిన్‌ మధుబాల... ప్రేమనాథ్, 
దిలీప్‌ కుమార్‌ల మధ్య ట్రయాంగిల్‌ లవ్‌లో విరక్తితో అర్ధాంతరంగా మరణించింది. సుమంగళిగా మరణించాలన్న ఆమె చివరి కోరికను కిషోర్‌ కుమార్‌ నెరవేర్చాడు. 

ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు గురుదత్‌... అటు భార్య గీతాదత్‌  ఇటు తాను ప్రేమలో పడ్డ వహీదా రెహమాన్‌ మధ్య నలిగిపోయి, చివరికి లవ్‌ ఫెయిల్యూర్‌ భరించలేక తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాడు. స్మితా పాటిల్, దివ్య భారతి, మోనాల్, ప్రత్యూష బెనర్జీ, జియా ఖాన్, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ వంటి వారు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇటు సౌత్‌లో శోభ, ఫటాఫట్‌ జయలక్ష్మి, సిల్క్‌ స్మిత, ఉదయ్‌ కిరణ్, రంగనాథ్‌.. లాంటి ఎందరో తారలు బలవన్మరణానికి పాల్పడిన వారే. 

సినీ రంగంలో ఆత్మహత్యలకు పాల్పడిన వారిలోఎక్కువగా ప్రేమ, పెళ్లి, విడాకులు, ఆర్థిక, కుటుంబ సమస్యలు, అవకాశాలు తగ్గిపోవడం లాంటి కారణాలతోనే జీవితాన్ని ముగించారు. హీరోల కంటే హీరోయిన్లలోనే ఆత్మహత్యలు ఎక్కువ... హీరోలకు ఏదైనా సమస్య వస్తే దాంట్లోంచి బయటపడేందుకు ఉన్నన్ని మార్గాలు హీరోయిన్లకు లేకపోవడమే అందుకు ఒక కారణం. ఇంకో ముఖ్య కారణం ఏంటంటే హీరోయిన్లకు 35 ఏళ్లు వచ్చే వరకే మంచి అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత అవకాశాలు తగ్గుతుంటాయి. చాలామంది హీరోయిన్లకు నటనే జీవనాధారం. కానీ హీరోలు నటనతో పాటు రియల్‌ ఎస్టేట్, హోటల్స్, థియేటర్లు, స్టూడియోలు లాంటి వ్యాపారాలతో అధికంగా నిలదొక్కుకోగల్గుతారు. 

సక్సెస్‌తో స్ట్రెస్‌: చిత్ర సీమలోని వారికి ఫెయిల్యూర్‌ కంటే సక్సెస్‌తోనే స్ట్రెస్‌ ఎక్కువ. ముందు సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయి, తదుపరి సినిమా ఒకవేళ ఫ్లాప్‌ అయితే చాలా సందర్భాల్లో వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. అలాగే తారలకు నిజ జీవితంలో తగినంత స్వేచ్ఛ ఉండదు. కొందరు గాడ్‌ ఫాదర్‌ గుప్పెట్లో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే కొందరి తారల జీవితాలు బంగారు పంజరంలోని చిలకలా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఒంటరితనం, అభద్రత, తనను తానుగా ప్రేమించే వారి కోసం పడే తపన, గుర్తింపు కోసం పడే ఆరాటం కూడా వారి నైరాశ్యానికి తోడవుతాయి. 

అవమానం భరించలేక: సినిమా ప్రపంచంలో తరచుగా పార్టీలు, మద్యానికి, మత్తు పదార్థాలకు కూడా అలవాటు పడటం, తద్వారా మానసికంగా మరింత బలహీనపడి చివరకు దయనీయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడతారు. కొందరు తారలు ఉన్నదంతా ఖర్చు పెట్టో లేక ఒక సినిమా తీసి అది అట్టర్‌ ఫ్లాప్‌ అయి ఆర్థికంగా దివాళా తీసో దాని నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సెలబ్రిటీస్‌ వ్యక్తిగత జీవితంలో ఏ చిన్న ఒడుదుడుకులు వచ్చినా అది పెద్ద సంచలనంగా మారి, ఆ అవమానాన్ని భరించలేక కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కొందరైతే  చిన్నా–చితక అవకాశాలతో రాజీ పడలేక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. 

తొలి దశలోనే చికిత్స అవసరం: తారలకు నటనతో పాటు ఆత్మవిశ్వాసం, ఈ రంగుల ప్రపంచంలో బతక నేర్చే మెళకువలు, ఆటుపోట్లను సమానంగా తీసుకునే మనోబలం, స్క్రీన్‌ లైఫ్‌ను, పర్సనల్‌ లైఫ్‌ను బ్యాలెన్స్‌ చేసుకొనే మేధస్సు, ఆర్థిక, ప్రేమ, వివాహ విషయాలలో ఆచితూచి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొనే ప్రజ్ఞ చాలా అవసరం. ఆ మధ్య డిప్రెషన్‌కు లోనైన దీపికా పదుకోన్‌ సైకియాట్రిస్టును సంప్రదించి చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకొని తనలా మరెవ్వరూ బాధపడకూడని ‘లివ్, లవ్‌ అండ్‌ లాఫ్‌’ అనే ఎన్‌జీఓను స్థాపించి చాలామందికి సేవ చేస్తోంది. మనోవేదనకు గురైన తారలు తొలి దశలోనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి తగిన వైద్యం, కౌన్సిలింగ్‌ చేయించుకోవడం అవసరం.  ఒకనాడు తాము ఒక వెలుగు వెలిగిన రంగుల ప్రపంచం, చివరకు బ్లాక్‌ అండ్‌ వైట్‌గా మారితే తట్టుకోలేక  అర్ధాంతరంగా తనువు చాలించిన సినీ తారల ట్రాజెడీ కథలు ప్రస్తుతం సినీ రంగంలో ఉన్నవారికి ఒక కనువిప్పుగా ఉండాలని ఈ ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం నాడు ఆశిద్దాం.

ఈ సమయం దాటిపోతుంది
→ ఆత్మహత్య భావాలతో బాధపడేవారు తమలో తామే కుంగిపోకుండా తమలోని మనోవేదనను ఆత్మీయులతో పంచుకుంటే వారి బాధ చాలావరకు తగ్గుతుంది.
→ అలాంటివారికి జీవితంలోని సమస్యలకు ఆత్మహత్య ఒక్కటే పరిష్కారం కాదని, ధైర్యంగా ముందుకెళ్లేందుకు ఇతర ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని తెలియజెప్పాలి. 
→ మనసుకు తగిలిన గాయాన్ని మాన్పేందుకు ఎమోషనల్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ అంటే మంచి మాటలతో సాంత్వన కలిగించడం, వారిని ఆ సంఘటన లేదా షాక్‌ నుంచి బయటకు వచ్చేలా వారి దృష్టి మళ్లించడం, నీకు నేనున్నాను లేదా మేమంతా నీకు అండగా ఉన్నామనే భరోసా కలిగించడం అవసరం. 
→ ఎవరికైనా జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలుండవు. సముద్రంలోని అలల్లాగా కష్టాలు మనల్ని పలకరించి మళ్లీ వెనక్కి వెళతాయని చెప్పాలి. 
→ గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా ‘ఈ సమయం దాటిపోతుంది’ అనే సూక్తిని ఆ కష్ట సమయంలో గుర్తు చేసుకుంటే ఆత్మహత్య భావాలనుంచి బయట పడే అవకాశం ఉంది. 



– డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి 
ప్రముఖ మానసిక వైద్యులు, రచయిత, విజయవాడ 
email:indlas2@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement