వెండితెరపై గ్యాంగస్టర్స్‌గా స్టార్ హీరోలు
థియేటర్స్‌లో మాస్ ఆడియన్స్ సినిమాను మెచ్చుకుంటే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. ‘పుష్ప, కేజీఎఫ్’, ఇటీవల ‘ధురంధర్’... ఇలా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆడియన్స్‌కు థియేటర్స్‌లో మాస్ మూమెంట్స్‌ను అందించేందుకు కొందరు స్టార్ హీరోలు సిల్వర్ స్క్రీన్‌పై గ్యాంగస్టర్స్‌గా మారారు. మరి... ఈ గ్యాంగ్‌స్టార్స్‌పై ఓ లుక్ వేయండి.
ఒక్కరు కాదు... ఇద్దరు!
‘అపూర్వ రాగంగళ్’, ‘అంతులేని కథ’, ‘గిరఫ్తార్’... ఇలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 20 సినిమాల్లో రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి నటించారు. కానీ 1979లో వచ్చిన ‘అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ (తెలుగులో ’అల్లావుద్దీన్ అద్భుత దీపం’) సినిమా తర్వాత రజనీకాంత్–కమల్‌హాసన్‌ల కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. తాజాగా తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరు సూపర్ స్టార్స్‌ను ఒకే ఫ్రేమ్‌లోకి తెస్తున్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్ హీరోలుగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ సినిమా తెరకెక్కనుంది.
రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదొక పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని, ఇందులో రజనీకాంత్, కమల్‌హాసన్... ఇద్దరూ గ్యాంగ్‌స్టర్స్‌గా నటిస్తారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా జానర్ గ్యాంగ్‌స్టర్ డ్రామాయే అయినప్పటికీ కథలో మంచి సెంటిమెంట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయట. ఇక ఈ సినిమాలోని ఓ ప్రధాన పాత్రధారిగా త్రిష నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
2027 దసరా లేదా దీపావళి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ ఓ సినిమాను నిర్మించనున్నారు. సిబీ చక్రవర్తి ఈ సినిమాకు దర్శకుడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. సో... రజనీకాంత్ – సీబీ చక్రవర్తిల కాంబినేషన్‌లోని సినిమా చిత్రీకరణ తర్వాత, కమల్‌హాసన్–రజనీకాంత్‌ల మల్టీస్టారర్ మూవీ సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు.
కాకాజీ?
హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ‘వాల్తేరు వీరయ్య’. 2023 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. తాజాగా వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కేవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని తెలిసింది. అయితే ఈ సినిమా ప్రధాన కథాంశం కోల్‌కత్తా నేపథ్యంతో సాగుతుందని, ఇదొక గ్యాంగ్‌స్టర్ మూవీ అనే టాక్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
అంతేకాదు... ఈ సినిమాలో తండ్రీ కూతుళ్ల ఎమోషన్ కూడా బలంగా ఉంటుందని, ఈ చిత్రానికి ‘కాకా’, ‘కాకాజీ’ అనే టైటిల్స్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగు తోంది. ఇక ఈ చిత్రంలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి, ఆయన కుమార్తె పాత్రలో అనస్వరా రాజన్ నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని, ఆ దిశగా షూటింగ్ షెడ్యూల్స్‌ను జరిపేందుకు బాబీ అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.
మరో గ్యాంగ్‌స్టర్ సినిమా?
హీరో నానితో ‘దసరా’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానీతోనే ‘ది ΄్యారడైజ్’ అనే సినిమా తీస్తున్నారు. ‘ది ΄్యారడైజ్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 21న రిలీజ్ కానుంది. అయితే హీరో చిరంజీవి– దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రకటన వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. నాని ఈ సినిమాకు నిర్మాత. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా అని ఫిల్మ్‌నగర్ సమాచారం. కానీ ఈ సినిమా ప్రారంభం కావడానికి మరికొంత సమయం ఉంది. ఈ సినిమా 2027లో సెట్స్‌కు వెళ్లొచ్చు.
ముంబై మాఫియా
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన తొలి సినిమా ‘వీరసింహారెడ్డి’. 2023లో విడుదలైన ఈ సినిమా ఆడియన్స్‌ను అలరించి, హిట్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందుతోంది. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందు ఈ సినిమా కోసం ఓ చారిత్రాత్మక కథను అనుకున్నారు. కానీ బడ్జెట్ కారణాల వల్ల ఈ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. దీంతో ఓ స్టైలిష్ యాక్షన్ డ్రామా కథను రెడీ చేశారు గోపీచంద్ మలినేని. ఈ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ముంబై మాఫియా, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాలో తొలుత నయనతారను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఈ ప్లేస్‌లో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారని టాక్. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్
కానుంది.
పోలీస్ ఆఫీసర్ పోరాటం
ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్న తొలి సినిమా ‘స్పిరిట్’. ‘అర్జున్‌రెడ్డి, యానిమల్’ సినిమాల ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా, ప్రోఫెసర్‌గా, గ్యాంగ్‌స్టర్‌గా, ఖైదీగా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. గ్యాంగ్‌స్టర్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ఓ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా మారితే ఏం జరుగుతుంది? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ‘స్పిరిట్’ సినిమాలోని కొంత కథనం సాగుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇందులో త్రిప్తి డాక్టర్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ప్రభాస్, త్రిప్తి భార్యాభర్తలుగా కనిపిస్తారని సమాచారం. ప్రభాస్ తండ్రి, జైలర్ పాత్రలో ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారట. మరో కీలక పాత్రలో సీనియర్ నటి కాంచన, విలన్స్‌గా వివేక్ ఓబెరాయ్, ఐశ్వర్యా దేశాయ్ నటిస్తున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌తోనే ప్రభాస్ బిజీగా ఉన్నారు. ప్రభాస్–వివేక్ ఒబెరాయ్‌ల మధ్య కీలమైన యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారట సందీప్‌రెడ్డి వంగా. టీ సిరీస్ ఫిల్మస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ కానుంది.
కోల్‌కతాలో డ్రాగన్
కోల్‌కతాలో ‘డ్రాగన్’ చెప్పిందే జరగాలి. వెండితెరపై ఆ డ్రాగన్ ఎవరంటే ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు మేకర్స్. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సందర్భంగా ‘డ్రాగన్’ టైటిల్‌ను ఓ గ్లింప్స్ వీడియోతో మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో ఆలియా భట్ లేదా రష్మికా మందన్నా నటించే అవకాశం ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. నందమూరి కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘డ్రాగన్’ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న విడుదల కానుంది.
ఫుడ్ మాఫియా..!
డ్రగ్స్ మాఫియా, ఆయుధాల అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్... ఇలా డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్స్‌లో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమాలను ఆడియన్స్ ఎక్కువగా చూసి ఉంటారు. కానీ కాస్త డిఫరెంట్‌గా ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్నారు హీరో నాని. ‘సాహో, ఓజీ’ వంటి గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు సుజిత్ తీస్తున్న తాజా సినిమా ‘బ్లడీ రొమియో’. ఈ చిత్రంలో నాని హీరోగా నటిస్తున్నారు.
ఈ మూవీ ప్రధానంగా ఫుడ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని తెలిసింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో కూడా ఇదే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తుంది. నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం నాని ‘ది ΄్యారడైజ్’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత, ‘బ్లడీ రొమియో’ సినిమా సెట్స్‌కు వెళ్తుందని ఊహించవచ్చు.
గోవాలో డ్రగ్ మాఫియా
‘కేజీఎఫ్ 1, కేజీఎఫ్ :చాఫ్టర్ 2’ వంటి చిత్రాల తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం (ఇంగ్లిష్, కన్నడ) ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్–అప్స్’. 1940–1970 మధ్య కాలంలో, గోవా నేపథ్యంలో సాగే పీరియాడికల్ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమా ఇది. ఈ మూవీలో తండ్రీకొడుకులుగా యశ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా తెలిసింది. ఇందుకు తగ్గట్లుగానే... రాయ, టికెట్..అంటూ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో ఉన్న యశ్ లుక్స్ బయటకు వచ్చాయి. గోవా తీర ప్రాంతంలో జరిగే గ్యాంగ్‌స్టర్ డ్రామా ఈ సినిమా. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.
ఈ సినిమాలో నాడియాగా కియారా అద్వానీ, గంగ పాత్రలో నయనతార, ఎలిజబెత్ పాత్రలో హ్యూమా ఖురేషీ, రెబెకా పాత్రలో తారా సుతారియా, మెల్లిస్సాగా కియారా అద్వానీ నటిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యశ్ ఈ ‘టాక్సిక్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ జూన్ 4న విడుదల కావాల్సింది. కానీ, రిలీజ్‌ను వాయిదా వేశారు. కొత్త విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ‘టాక్సిక్’ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
సామ్రాజ్యం
నార్త్ చెన్నైలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు హీరో శింబు. వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు హీరోగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ సినిమా ‘అరసన్’. కలైపులి యస్.థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఆండ్రియా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే పక్కా గ్యాంగ్‌స్టర్ డ్రామా ఇది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. అయితే నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ఆల్రెడీ వెట్రిమారన్ డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా ‘వడ చెన్నై’ సినిమా వచ్చింది. కానీ ‘వడ చెన్నై’ సినిమాకు, ‘సామ్రాజ్యం’ చిత్రానికి సంబంధం లేదని దర్శకుడు వెట్రిమారన్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. అలాగే ధనుష్‌తోనే ‘వడ చెన్నై 2’ సినిమా తీయను న్నట్లుగా వెట్రిమారన్ తెలిపారు.
డీసీ
‘మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో’ వంటి సూపర్‌హిట్ సినిమాలను తీసిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ హీరోగా ‘డీసీ’ అనే సినిమా చేశారు. ఈ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాకు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించారు. లోకేశ్ కనగరాజ్ సరసన ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామికా గబ్బి నటించగా, ఓ కీలక పాత్రలో సంజనా కృష్ణమూర్తి నటించారు. ఈ సినిమాలో దేవదాస్ పాత్రలో లోకేశ్, చంద్రగా వామికా గబ్బి నటించారని తెలిసింది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ ‘డీసీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుందని తెలిసింది.
ఇలా గ్యాంగ్‌స్టర్స్‌గా వెండితెరపై నటిస్తున్న మరికొంతమంది హీరోలు ఉన్నారు. ఇంకొంతమంది హీరోలు ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా జానర్‌లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు.
– ముసిమి శివాంజనేయులు


