పీరియడ్ పెయిన్
రుతుక్రమ సమయంలో టీనేజ్ బాలికల నుంచి యువతుల వరకు తీవ్రమైన పొత్తి కడుపునొప్పి, వెన్నునొప్పిని అనుభవించేవారి శాతం 80 నుంచి 85 వరకు ఉంటుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన అధ్యయనాలలో స్పష్టమైంది. ఈ సమస్యకు పరిష్కారంగా చాలామంది పెయిన్‌కిల్లర్స్ వాడుతుంటారు, రోజువారీ
పనుల నుండి దూరంగా ఉంటూ ఇబ్బందులు పడుతుంటారు. రుతుక్రమ నొప్పి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో నిపుణుల ద్వారా తెలుసుకుందాం...
రుతుక్రమం మొదలయ్యే 90 శాతం మంది మహిళల మాదిరిగానే మీకూ నెలసరి సమయంలో కడుపునొప్పి, చిరాకు, అలసట, తల తిరగడం, వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు... ఇలాంటప్పుడు..
సహజ పద్ధతుల్లో ... నెలసరి ప్రారంభం కావడానికి కొన్నిరోజులముందు కడుపు లేదా శరీరంలోని ఇతర భాగాలు ఉబ్బినట్లుగా లేదా బరువు పెరిగినట్లుగా అనిపించవచ్చు. ఇది నెలసరి సమయంలో సాధారణంగా కనిపించే లక్షణమే, కానీ ఇది అసౌకర్యాన్ని కలిగించి, నెలసరి నొప్పులను మరింత తీవ్రతరం చేస్తుంది. దీనికి విరుగుడుగా రోజుకు 8–10 గ్లాసుల నీళ్లు తాగాలి. కడుపు ఉబ్బరాన్ని పెంచే కెఫీన్, చక్కెరతో కూడిన పానీయాలు, ఉప్పుతో కూడిన స్నాక్స్‌ను తగ్గించాలి. వేడినీళ్లు తాగడం వల్ల శరీరమంతటా రక్తప్రసరణ పెరిగి, కండరాలు రిలాక్స్ అవుతాయి. గర్భాశయ సంకోచాల వల్ల కలిగే తిమ్మిర్లూ తగ్గుతాయి.
హెర్బల్ టీలు మేలు... కండరాలు రిలాక్స్ అయ్యి, నొప్పులు తగ్గడానికి గోరువెచ్చని టీ లేదా అల్లం కషాయం తాగచ్చు. కొన్ని రకాల హెర్బల్ టీ లలో ఉబ్బరం, వాపును తగ్గించగల యాంటీ–ఇన్స్ ఫ్లమేటరీ గుణాలు, గర్భాశయంలో కండరాల నొప్పులను తగ్గించగల ఔషధ గుణాలుంటాయి.
వేడినీటి కాపడం... గర్భాశయ కండరాలను సడలించి, రక్తప్రసరణను మెరుగుపరచడానికి పొత్తికడుపుపై వేడినీటి కాపడం పెట్టాలి. ఇది కండరాలకు విశ్రాంతినిచ్చి, రక్తప్రసరణను మెరుగుపరిచి, ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడుతుంది.
తేలికపాటి వ్యాయామం... శరీరాన్ని స్ట్రెచింగ్ చేయడం, కొద్దిపాటి నడక... వల్ల కండరాల ఒత్తిడి తగ్గుతుంది. నొప్పితో బాధపడుతున్నప్పుడు వ్యాయామం గురించిన ఆలోచన రాకపోవచ్చు. కానీ తేలికపాటి వ్యాయామం కూడా ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. దీంతో నొప్పి తగ్గి, కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. మసాజ్ థెరపీ రుతుస్రావ నొప్పిని తగ్గిస్తుందని వివిధ అధ్యయనాలలో తేలింది. శారీరక ఒత్తిడిని తగ్గించే మసాజ్ గర్భాశయాన్ని రిలాక్స్ చేయడం ద్వారా గర్భాశయ సంకోచాలు తగ్గి, నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది.
ఉపశమనం కోసం... ఒత్తిడి వల్ల కండరాల నొప్పులు మరింత తీవ్రం కావచ్చు. ధ్యానం, దీర్ఘ శ్వాస, యోగా వంటి పద్ధతులు ఎంతో మేలు చేస్తాయి. విశ్రాంతిగా కూర్చొని, కళ్ళుమూసుకుని, దీర్ఘ శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి. కొన్ని నిమిషాల వ్యవధిలో నొప్పినివారణ తెలుస్తుంది. రుతుస్రావ నొప్పికి సహాయపడే ఇంటిచిట్కాలతో పాటు, వైద్యుల సూచనలు సహాయపడతాయి.
అందుబాటులో మరికొన్ని ... రుతుక్రమ నొప్పులను తగ్గించేందుకు కార్డ్‌లెస్ హీటింగ్ బెల్ట్‌లు, మసాజ్ ΄్యాడ్‌లు, పీరియడ్ క్రాంప్ డివైజ్‌లు, జెల్‌లు.. అందుబాటులోకి వచ్చాయి. ఇవి గర్భాశయ కండరాలను రిలాక్స్ చేయడానికి, సర్దుబాటు చేయడానికి నొప్పి నుంచి ఉపశమనం కలిగించే వైబ్రేషన్‌లను కలిగిస్తాయి.
నివారణకు ఓ పరికరం
మహిళల్లో పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే నొప్పికి డ్రగ్–ఫ్రీ పరిష్కారాన్ని అందించే లక్ష్యంతో ‘క్యురపాడ్ ఎమ్’ అనే వైద్యపరికరాన్ని రూపొందించారు తెలంగాణ వాసి డాక్టర్ సూర్యప్రకాశ్, బెంగళూర్‌కు చెందిన శ్రీరామ్. ‘‘నాలుగేళ్ల క్రితం బాడీ పెయిన్ రిలీఫ్ డివైజ్‌ను రూపొందించాం. దానిని వాడిన వారి దగ్గర నుంచి అనేక అభ్యర్థనలు వస్తున్నాయి. మా ఇంట్లో చెల్లెలు రుతుక్రమ నొప్పిని అనుభవించడం చూసి, మహిళల కోసం మరో పరికరాన్ని తయారు చేయాలని రెండేళ్లు గా కృషి చేశాం.
ఎలాంటి మందులూ అవసరం లేకుండా మహిళలు సులువుగా ఉపయోగించేలా ఈ పరికరాన్ని తీసుకువచ్చాం. మహిళలు రుతుక్రమం సమయంలో వచ్చే నొప్పి నివారణకు తమ పొత్తికడుపు భాగంలో ఈ పరికరాన్ని ధరించడం వల్ల 30 నిమిషాలలో రెడ్‌లైట్, నియర్–ఇన్‌ఫ్రారెడ్ లైట్ ఆధారంగా ఫొటో బయోమాడ్యులేషన్ సాంకేతికతతో పీరియడ్ నొప్పికి సంబంధించిన వాపు, రక్తప్రసరణ వంటి అంశాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వారి రోజువారి పనులకు ఎలాంటి ఆటంకం కలగదు. ఈ పరికరానికి సీడిఎస్సీవో అనుమతితోపాటు ఎఫ్‌డిఎ రిజిష్ట్రేన్ కూడా ఉంది.’’
– డాక్టర్ సూర్యప్రకాశ్, శ్రీరామ్
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


