మెటా వారి... ఓహో ఒరిజినల్‌! | Critics note that Mark Zuckerberg keeps lying about Facebook origin story | Sakshi
Sakshi News home page

మెటా వారి... ఓహో ఒరిజినల్‌!

Sep 18 2026 4:23 AM | Updated on Sep 18 2026 4:23 AM

Critics note that Mark Zuckerberg keeps lying about Facebook origin story

హ్యూమరమరాలు

ఫేస్‌బుక్‌ లో రోజూ మనం చూస్తూనే ఉంటాం కదా....ఇంగ్లీష్‌లో ఒక్క వాక్యం రాయలేని వారి పోస్ట్‌లు పూర్తిగా ఇంగ్లీష్‌లో కనిపిస్తాయి.
‘సీ... ఒరిజినల్‌’ ఆప్షన్‌లోకి వెళితే తెలుగులో వారు రాసిన ఒరిజినల్‌ పోస్ట్‌ కనిపిస్తుంది.

ఇలాంటి పోస్ట్‌లు ఎన్నో చూసిన అప్పలకొండ కు ఒక ఐడియా వచ్చి ఫేస్‌బుక్‌ వోనర్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌కు మెయిల్‌ చేశాడు. అందులో ఇలా ఉంది...
‘అయ్యా... తెల్లారిలేస్తే మనుషులు ఎన్నో అబద్ధాలు ఆడుతుంటారు. అబద్ధాల వల్ల సమాజానికి నష్టం కదా... దీన్ని నివారించడానికి ఏదైనా డివైజ్‌ను తీసుకురావాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఫేస్‌బుక్‌లో ‘సీ... ఒరిజినల్‌’ ఆప్షన్‌ చూసిన తరువాత నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది.

ఒక వ్యక్తి బయటికి ఏం చెప్పినా, మనసులో ఏమనుకుంటున్నాడో తెలియజేసే సాంకేతిక పరికరాన్ని మీ కంపెనీ వారు తయారు చేస్తే జనాలు విరగబడి కొంటారు. దీంతో మీరు కుబేరుల సంఘానికి అధ్యక్షుడు కావచ్చు.
ఇట్లునిప్పుబొగ్గుల అప్పలకొండ

అప్పలకొండ ఐడియా జుకర్‌ బర్గ్‌కు బాగా నచ్చింది. నెలల వ్యవధిలొనే ‘సీ... ఒరిజినల్‌’ అనే డివైజ్‌ తీసుకువచ్చాడు. దీన్ని వాచ్‌లా చేతికి తగిలించుకుంటే చాలు, అవతలి వ్యక్తి నిజం చెబుతున్నాడా? అబద్ధం చెబుతున్నాడా? అనేది స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.

ఒక ఇంట్లో...
‘మై డియర్‌ పారిజాతం. ఈరోజు ఆఫీసులో చచ్చేంత పని ఉంది. రాత్రంతా పనిచేయాల్సి వచ్చేట్టుంది. రేపు ఉదయమే వస్తాను. సరేనా, జాగ్రత్త...’ భార్య పారిజాతంతో చెప్పాడు బార్‌ భద్రి.
‘మీకు పని అంటే ప్రాణమనే విషయం నాకు తెలియదా. రాత్రి ఏదైనా తినండి. పని ఉందికదా అని కడుపు మాడ్చుకోవద్దు’ అని ప్రేమగా భర్తకు జాగ్రత్తలు చెప్పింది పారిజాతం.
తాను ఆన్‌లైన్‌లో కొన్న ‘సీ...ఒరిజినల్‌’  వాచ్‌ ఆమెకు గుర్తుకు వచ్చింది. వెంటనే దాన్ని చేతికి తగిలించుకొని, భర్తకు ఫోన్‌ చేసి ‘ఇంతకు ముందు మీరు ఏదో అన్నారు. సారీ... నాకు మరోసారి చెప్పరా’ అని అడిగింది పారిజాతం.
‘మై డియర్‌ పారిజాతం... ఈరోజు ఆఫీసులో చచ్చేంత పని ఉంది. రాత్రంతా పనిచేయాల్సి వచ్చేట్టుంది. రేపు ఉదయమే వస్తాను. సరేనా, జాగ్రత్త...’ అని అదే డైలాగ్‌ను అక్షరం మిస్‌ కాకుండా చెప్పాడు బార్‌ భద్రి.
వెంటనే ‘సీ... ఒరిజినల్‌’లో మ్యాటర్‌ కనిపించింది.
‘పారిజాతం... ఈరోజు నా కొలిగ్‌ బర్త్‌డే. పార్టీలో తాగి ఇంటికి వస్తే ఫేస్‌ దరిద్రంగా పెడతావు. తిడతావు. ఇంత అవసరమా! అందుకే రాత్రంతా తప్పతాగి తీరిగ్గా  పొద్దుటే ఇంటికి వస్తాను. నా మందు నా ఇష్టం’
ఆ తరువాత ఏం జరిగిందో... మీకు ప్రత్యేకంగా చెప్పాలా!

ఒక రాజ్యంలో...
‘రైతులంటే నాకు ప్రాణం. వారే దేశ సౌభాగ్యం’ అన్నారు రాజ్యపాలకుడు బాబోయ్‌ చంద్ర.
వెంటనే ప్రజల చేతికున్న ‘సీ... ఒరిజినల్‌’లో  ‘వ్యవసాయం పరమదండగ. మీ ఖర్మ. ఈ విషయాన్ని గతంలో ఎన్నోసార్లు చెప్పాను. మళ్లీ మళ్లీ చెబుతాను. బయటికి మాత్రం చెప్పను’ అని కనిపించింది.
కుళ్లిన కోడిగుడ్లు, టామోటాలు బాబోయ్‌ చంద్ర మీద తుఫానులా విరుచుకు పడ్డాయి.
అయినా సరే, రాజావారు ఆదరలేదు. బెదరలేదు.
‘చూడండి... మా పాలనలో ఎంత మార్పు వచ్చిందో. ఒకప్పుడు నాయకుల మెడలో పూలదండలు వేసేవారు. నాయకుడు నచ్చితే పూలదండలు వేయడం పాత స్టైల్‌. కుళ్లిన కోడిగుడ్లు, టమోటాలు వేయడం కొత్త స్టైల్‌. వీటిని మనం రీసైకిలింగ్‌ చేసుకోవాలి. పునరుత్పాదక ఇంధన వనరులుగా మార్చుకోవాలి...’ అని చెప్పుకుంటూ ముక్కు మూసుకొని అలా ముందుకు వెళ్లారు బాబోయ్‌ చంద్ర మహారాజా.

– యాకుబ్‌ పాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement