వాషింగ్టన్: ఇన్‌స్టాగ్రామ్, మెటా(ఫేస్‌బుక్)వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పిల్లలను వ్యసనపరులుగా మారుస్తున్నారనే తీవ్ర ఆరోపణలపై టెక్ దిగ్గజం మెటాకు భారీ షాక్ తగిలింది. ఈ వివాదానికి తెరదించేందుకు ఏకంగా 17 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1,43,000 కోట్లు) సెటిల్‌మెంట్ కింద చెల్లించేందుకు ఆ సంస్థ అంగీకరించింది. బిగ్ టెక్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ జరిమానాల్లో ఒకటిగా నిలిచింది.
ఎండ్‌లెస్ స్క్రోలింగ్, బ్యూటీ ఫిల్టర్లు, లైక్‌ల కౌంట్ వంటి వ్యసనపూరిత ఫీచర్లను మెటా ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేసిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనివల్ల పిల్లలు, టీనేజర్లలో ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి వంటి తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఈ ముప్పును మెటా సంస్థ గోప్యంగా ఉంచి, ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు గుప్పించారు.
అమెరికాలోని 47 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీ, ప్యూర్టో రికో, అమెరికన్ సమోవా, నార్తర్న్ మరియానా ఐలాండ్స్ అటార్నీ జనరల్స్, ప్రభుత్వాలు సంయుక్తంగా మెటాపై ఈ సంచలన వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఈ చారిత్రక కేసు విచారణ, సెటిల్‌మెంట్ ఆమోద ప్రక్రియ యూనైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ది నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా కోర్టులో ముగిశాయి.
వర్జీనియా అటార్నీ జనరల్ జే జోన్స్ ఈ కేసులో వర్జీనియా తరఫున కీలక పాత్ర పోషించారు. అటార్నీ జనరల్ జోన్స్ ప్రకటన ప్రకారం.. మెటా ప్లాట్‌ఫామ్స్ సుమారు రూ.1,43,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఇందులో వర్జీనియా రాష్ట్రానికి గ్యారంటీగా 353 మిలియన్ డాలర్లు అందనున్నాయి. 1990ల నాటి బిగ్ టొబాకో సెటిల్‌మెంట్ల తర్వాత రాష్ట్ర స్థాయి వినియోగదారుల పరిరక్షణ చరిత్రలో ఇదే అతిపెద్ద సెటిల్‌మెంట్లలో ఒకటి. ఈ చెల్లింపుతో పాటు, ఇన్‌స్టాగ్రామ్, మెటాలలో పిల్లలను రక్షించేందుకు వీలుగా మెటా కొన్ని కఠినమైన భద్రతా ఫీచర్లను అమలు చేయాల్సి ఉంటుంది.
వర్జీనియా అటార్నీ జనరల్ కార్యాలయానికి చెందాల్సిన 353 మిలియన్ డాలర్లతో పాటు, 2016 ఎన్నికల సమయంలో కేంబ్రిడ్జ్ అనలిటికా వంటి థర్డ్ పార్టీలకు మెటా యూజర్ల సమాచారాన్ని షేర్ చేసినందుకు అదనంగా 11 మిలియన్ డాలర్లు వర్జీనియాకు అందనున్నాయి.
ఇన్‌స్టాగ్రామ్, మెటాలలో కలిపి రోజుకు గరిష్టంగా రెండు గంటల సమయ పరిమితి ఉంటుంది. ఎండ్‌లెస్ స్క్రోలింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం 15 నిమిషాలు వాడిన తర్వాత, అలాగే 60, 90 నిమిషాల వద్ద తప్పనిసరి పాజులు వస్తాయి. రాత్రి 12:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు రాత్రివేళ బ్లాకింగ్ ఉంటుంది.
పాఠశాల విద్యార్థులకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:00 గంటల వరకు పుష్ నోటిఫికేషన్లు ఉండవు. యువ వినియోగదారుల వయస్సును మరింత కచ్చితంగా ధృవీకరించే పద్ధతులు, వేధింపులు, ఈటింగ్ డిజార్డర్స్, ఆత్మహత్య, స్వీయ-హానిని ప్రోత్సహించే కంటెంట్‌పై బలమైన రక్షణలు, మరింత పటిష్టమైన, తల్లిదండ్రులు సులభంగా ఉపయోగించుకునే నియంత్రణ టూల్స్ అందుబాటులోకి వస్తాయి.
పిల్లలు, టీనేజర్లలో మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే బ్యూటీ ఫిల్టర్లు, కనిపించే లైక్స్ కౌంట్‌పై పరిమితులు ఉంటాయి. ఈ ఫీచర్ల అమలు, పనితీరును ఒక స్వతంత్ర ఆడిటర్ క్రమం తప్పకుండా పరిశీలిస్తారు.
2021 నుంచి దేశంలోని దాదాపు అటార్నీ జనరల్లందరూ ఏకమై, హానికరమని తెలిసినప్పటికీ పిల్లలు, టీనేజర్ల కోసం సోషల్ మీడియాను డిజైన్ చేస్తున్న తీరుపై దర్యాప్తు చేపట్టారు. ఈ చారిత్రక ఒప్పందంలో అలబామా, అలాస్కా, కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సస్‌తో సహా అనేక రాష్ట్రాలు భాగస్వామ్యమయ్యాయి.


