ఏఎం గ్రూప్‌లో భాగమైన ఏఎం ఇంటెలిజెన్స్ (ఏఎంఐ) తాజాగా ఎన్‌విడియా నుంచి 9,000 జీపీయూలను కొనుగోలు చేసేందుకు బైండింగ్ ఆర్డరు ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ ‘వెరా రూబిన్ ఎన్‌వీఎల్72 ర్యాక్ స్కేల్ సిస్టం’లు 2027 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి రాగలవని వివరించింది. విస్తృత ప్రణాళికల్లో భాగంగా తొలి దశలో హైదరాబాద్‌లో 30 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఏఐ ఫ్యాక్టరీలో వీటిని వినియోగించనున్నట్లు కంపెనీ వివరించింది.
అంతర్జాతీయంగా ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయాల నిర్మాణంపై 8 బిలియన్ డాలర్లపైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. భారత్, అమెరికా, ఫిన్లాండ్, మలేషియాలో తలపెట్టిన 1 గిగావాట్ కంప్యూట్–యాజ్–ఎ–సర్వీస్ ప్లాట్‌ఫాం ప్రణాళికల కింద మొదటి విడతలో హైదరాబాద్ ప్రాజెక్టు ఉంటుందని సంస్థ తెలిపింది. సమీప భవిష్యత్తులో ప్రాథమికంగా 200 మెగావాట్ల ఏఐ కంప్యూట్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఏఎంఐ చైర్మన్ అనిల్ చలమలశెట్టి వివరించారు. భారత్, అమెరికా, యూరప్‌లో 5 గిగావాట్ల ఏఐ డేటాసెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..


