పీపీఎఫ్‌ కాంపౌండింగ్ మ్యాజిక్ తెలుసా? | PPF Minor Account Rules Benefits Zero Risk Strategy Child Higher Education | Sakshi
Sakshi News home page

పీపీఎఫ్‌ కాంపౌండింగ్ మ్యాజిక్ తెలుసా?

Aug 26 2026 1:56 PM | Updated on Aug 26 2026 1:56 PM

PPF Minor Account Rules Benefits Zero Risk Strategy Child Higher Education

‘గింజ నాటిన వెంటనే నీడ రాదు.. విత్తనం మొలకెత్తి వృక్షం కావడానికి కాలం పడుతుంది’ ఆర్థిక ప్రణాళికలోనూ ఇది అక్షర సత్యం. ఆనంద్ అనే ఒక సగటు తండ్రి తన కుమార్తె పుట్టిన 11వ రోజే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్‌) ఖాతా తెరిచాడు. పెట్టుబడుల్లో నిపుణుడు కాకపోయినా చిన్నతనంలోనే పొదుపు చేయాలని భావించాడు. మూడేళ్ల తర్వాత తన ఖాతా స్టేట్‌మెంట్ చూసుకున్నప్పుడు కాంపౌండింగ్ (చక్రవడ్డీ) శక్తేంటో ఆయనకు స్పష్టంగా అర్థమైంది.

మైనర్ పీపీఎఫ్ ఖాతా.. నియమాలు

పిల్లల ఉన్నత చదువులు, భవిష్యత్ అవసరాల కోసం పీపీఎఫ్‌ ఒక నమ్మకమైన నిధి. 1968లో ప్రారంభమైన ఈ ప్రభుత్వ మద్దతు గల పథకం భారతీయ కుటుంబాలకు (కేంద్ర ప్రభుత్వ హామీ) భద్రతను ఇస్తుంది.

ఖాతా నిర్వహణ: 18 ఏళ్ల లోపు ఉన్న మైనర్ బిడ్డ పేరిట తల్లి లేదా తండ్రి (ఒకరు మాత్రమే గార్డియన్‌గా) ఖాతా తెరవవచ్చు. తపాలా కార్యాలయం లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా దీనిని ప్రారంభించవచ్చు.

డిపాజిట్ పరిమితులు: ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఇక్కడ గమనించాల్సిన కీలకమైన అంశం ఏమిటంటే.. తల్లిదండ్రుల సొంత పీపీఎఫ్, మైనర్ పిల్లల ఖాతా రెండూ కలిపి గరిష్ఠ వార్షిక పరిమితి రూ.1.5 లక్షలు మించకూడదు.

కాలపరిమితి.. ఉపసంహరణలు: ఈ పథకం లాక్-ఇన్ పీరియడ్ 15 సంవత్సరాలు. ఖాతా తెరిచిన 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకు రుణం పొందే సౌకర్యం ఉంది. 7వ సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రావల్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత ప్రతి 5 ఏళ్ల బ్లాక్‌ చొప్పున గడువును పొడిగించుకోవచ్చు.

ప్రస్తుత వడ్డీ రేటు

వడ్డీని ప్రతి నెలా 5వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఉన్న అతి తక్కువ నిల్వ (లోయెస్ట్‌ బ్యాలెన్స్‌) ఆధారంగా లెక్కిస్తారు. అయితే, ఈ వడ్డీ మార్చి 31న వార్షికంగా ఖాతాలో జమ అవుతుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి మూడు నెలలకొకసారి (త్రైమాసిక ప్రాతిపదికన) పీపీఎఫ్ వడ్డీ రేట్లను సమీక్షించి ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఏటా 7.1 శాతం వడ్డీ ఉంది.

పన్ను మినహాయింపు

పీపీఎఫ్ పథకానికి ఆదాయపు పన్ను చట్టం కింద ఈఈఈ (Exempt-Exempt-Exempt) హోదా ఉంది. సెక్షన్‌ 80సీ కింద డిపాజిట్లకు పన్ను మినహాయింపు దక్కడంతో పాటు వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తి పన్ను రహితం. షేర్ మార్కెట్ ఒడుదొడుకులకు దూరంగా సురక్షితమైన ఆర్థిక ప్రయాణాన్ని కోరుకునే వారికి పీపీఎఫ్ మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు పెద్దయ్యే సరికి వారి ఉన్నత విద్యకు ఆర్థికంగా డోకా లేకుండా చేయడానికి పీపీఎఫ్ ఒక మెరుగైన సాధనం.

ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement