చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి దొంగ పనులు అన్నట్లుగా దిగ్గజ బహుళజాతి కంపెనీలు భారత వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. లండన్‌లో విక్రయించే ఒక ఫాంటా క్యాన్‌లో కేవలం 63 క్యాలరీలు, తక్కువ పంచదార ఉంటే అదే మనదేశంలో లభించే పానీయంలో మాత్రం ఏకంగా మూడు రెట్లు అధికంగా షుగర్‌ను దట్టించి విక్రయిస్తున్నారు. యూరోప్‌లో కృత్రిమ రంగుల (E110 Sunset Yellow) వాడకంపై సీసాల ముందు భాగంలోనే హెచ్చరిక బొమ్మలు తప్పనిసరి చేశారు. కాగా, మన దేశంలో మాత్రం ప్యాకెట్ వెనుక వైపు కంటికి కనిపించనంత చిన్న అక్షరాలతో సరిపెట్టడం గమనార్హం.
ఈ లోపాన్ని ఆధారంగా చేసుకుని బహుళజాతి కంపెనీల వ్యవహారంపై ప్రజారోగ్య నిపుణులు స్పందిస్తూ బాటిళ్ల ముందు భాగంలోనే ఎరుపు, పచ్చ రంగుల నాణ్యతా ముద్రలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ముందే చర్యలు తీసుకోవాల్సిన 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా' (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ), కార్పొరేట్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ హెచ్చరికల ప్రతిపాదనను పక్కనబెట్టడం తీవ్ర ఆందోళనకరమని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఎలాంటి రంగులు లేని సాధారణ పట్టికలతో వీటి గుర్తింపును సరిపెడతామని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పేర్కొనడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘భారత పౌరుల ఆరోగ్యం పట్ల దేశానికి శ్రద్ధ ఉందనే విషయం ప్రపంచానికి తెలియాలి’ అని వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్పొరేట్ ధోరణులను అరికట్టకపోతే రాబోయే రోజుల్లో భారత్ తీవ్ర ఊబకాయం, మధుమేహ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: మొదటిసారి ఇల్లు కొంటున్నారా?


