జీవితంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నామన్నది కూడా అంతే ముఖ్యం. అవసరాలకు ఉపయోగించడం, కొంత మొత్తాన్ని పొదుపు చేయడం, భవిష్యత్ కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవడం ఆర్థికంగా చాలా అవసరం. అయితే.. చాలామంది ఇతరులు ఏమనుకుంటారో అనే ఆలోచనతో అవసరం లేని వాటిపై డబ్బు ఖర్చు చేస్తుంటారు. చాణక్య నీతి ప్రకారం.. ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే అలవాట్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆడంబరాలు కోసం ఖర్చు చేయొద్దు
ఖరీదైన ఫోన్లు, బట్టలు, వాహనాలు లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేసి తమ స్థాయిని ఇతరులకు చూపించుకోవాలని కొందరు భావిస్తారు. కానీ కేవలం ప్రశంసల కోసం చేసే ఖర్చు నిజమైన సంపదకు గుర్తు కాదు. మన ఆర్థిక పరిస్థితికి మించి ఖర్చు చేస్తే పొదుపు తగ్గిపోవడంతో పాటు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇతరులతో పోల్చుకోవడం కంటే.. మన అవసరాలు, ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేయడం మంచిది.
పనికిరాని సంబంధాల కోసం ఖర్చు చేయొద్దు
మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మన మంచిని కోరుకుంటారని అనుకోవడం సరికాదు. మనకు గౌరవం ఇవ్వని, అవసరమైన సమయంలో అండగా నిలవని వ్యక్తులను మెప్పించేందుకు పదేపదే డబ్బు ఖర్చు చేయడం వల్ల మనకే నష్టం కలుగుతుంది. సంబంధాల్లో ప్రేమ, ఆప్యాయత ఎంత ముఖ్యమో.. పరస్పర గౌరవం, నమ్మకం కూడా అంతే ముఖ్యం. అందుకే ఎవరి కోసం ఎంత ఖర్చు చేయాలనే విషయంలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.
‘లోకులు ఏమనుకుంటారు?’ అనే ఆలోచన వద్దు
చాలామంది సమాజంలో తమ పరువు తగ్గకూడదనే ఉద్దేశంతో తమ స్థాయికి మించి ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, వేడుకల సమయంలో ఇతరులతో పోటీ పడుతూ అప్పులు చేసి మరీ భారీగా ఖర్చు చేయడం కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి ప్రశంసల కోసం భవిష్యత్ ఆర్థిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెట్టుకోవడం తెలివైన నిర్ణయం కాదు. మన సామర్థ్యానికి తగ్గట్టుగా ఖర్చు చేయడమే నిజమైన ఆర్థిక క్రమశిక్షణ.
తాత్కాలిక ప్రశంసల కోసం ఖర్చు చేయొద్దు
ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తేనే గౌరవం, గుర్తింపు వస్తాయని భావించడం కూడా ఒక రకమైన అపోహే. మన వ్యక్తిత్వం, ప్రవర్తన, సామర్థ్యం వల్ల వచ్చే గౌరవం ఎక్కువకాలం ఉంటుంది. కానీ డబ్బు ఖర్చు చేసి పొందే ప్రశంసలు ఎక్కువగా తాత్కాలికమే. అందుకే ఇతరుల మెప్పు కోసం అనవసరంగా ఖర్చు చేయడం కంటే.. అదే డబ్బును పొదుపు చేయడం లేదా భవిష్యత్‌కు ఉపయోగపడే విధంగా పెట్టుబడి పెట్టడం మంచిది.
డిస్కౌంట్ ఉందని కొనేయడం తప్పే
ఆఫర్ ఉంది, లేదా డిస్కౌంట్ ఉంది, అంటూ అవసరం లేని వస్తువులు కొనడం చాలామందికి అలవాటుగా మారింది. నిజానికి డిస్కౌంట్ రావడం అంటే డబ్బు ఆదా అయినట్లు కాదు. మనకు అవసరం లేని వస్తువుపై ఒక్క రూపాయి ఖర్చు చేసినా అది ఖర్చే. కాబట్టి ఏదైనా వస్తువు కొనేముందు అది నిజంగా అవసరమా? లేక ఆఫర్ చూసి మాత్రమే కొనాలనిపిస్తోందా? అనే ప్రశ్న వేసుకోవడం మంచిది.
పొదుపు కూడా సంపదలో భాగమే
ఎక్కువ సంపాదించడం మాత్రమే ఆర్థిక విజయానికి గుర్తు కాదు. సంపాదించిన డబ్బులో కొంత పొదుపు చేయడం, అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయడం, భవిష్యత్ అవసరాల కోసం ముందుగానే ప్రణాళిక చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాణక్య నీతి చెప్పే ప్రధాన సందేశం కూడా ఇదే. ఇతరులు ఏమనుకుంటారనే దాని కంటే.. మన భవిష్యత్ ఎలా ఉండాలనే దానిపై దృష్టి పెట్టాలి. ఈరోజు నియంత్రించుకున్న అనవసర ఖర్చే రేపు మన ఆర్థిక భద్రతకు బలంగా మారుతుంది.


