ప్రయాణికులే కాదు.. ఇప్పుడు హోస్టులుగా Gen Z | A New Generation of Hosts Gen Z Hosting on Airbnb Grows Nearly 40 Percent in India | Sakshi
Sakshi News home page

ప్రయాణికులే కాదు.. ఇప్పుడు హోస్టులుగా Gen Z

Aug 26 2026 1:59 AM | Updated on Aug 26 2026 1:59 AM

A New Generation of Hosts Gen Z Hosting on Airbnb Grows Nearly 40 Percent in India

భారత్‌లో జెన్ జీ యువత ప్రయాణించే విధానంలోనే కాదు.. ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలోనూ కొత్త ట్రెండ్‌ తీసుకొస్తోంది. ఎయిర్‌బీఎన్‌బీ తాజా గణాంకాల ప్రకారం, 2026 తొలి ఆరు నెలల్లో భారత్‌లో జెన్ జీ హోస్టుల సంఖ్య గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 40 శాతం పెరిగింది. కొత్తగా ఎయిర్‌బీఎన్‌బీ లో హోస్టులుగా చేరుతున్న వారిలో దాదాపు ఐదుగురిలో ఇద్దరు 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్నవారే. అంటే యువత కేవలం కొత్త ప్రాంతాలకు వెళ్లి అనుభవాలు పొందడమే కాకుండా.. ఇప్పుడు తమ ఇళ్లను ఇతరులకు అందుబాటులో ఉంచి ఆదాయం పొందేందుకు కూడా ఆసక్తి చూపుతోంది.

పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు..
బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, నోయిడాతో పాటు ఇండోర్‌లో కూడా జెన్ జీ హోస్టింగ్‌ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఇండోర్‌లో యువ హోస్టుల సంఖ్య ఏకంగా 120 శాతానికి పైగా పెరిగింది. హైదరాబాద్‌, డెహ్రాడూన్‌, గువాహటి, కొచ్చి, లక్నో, మథుర వంటి నగరాల్లోనూ ఈ ట్రెండ్‌ కనిపిస్తోంది. అంతేకాదు.. గ్రామీణ ప్రాంతాల్లో జెన్ జీ హోస్టుల సంఖ్య 60 శాతం, తక్కువ జనసాంద్రత ఉన్న పట్టణ ప్రాంతాల్లో దాదాపు 70 శాతం పెరిగింది. దీంతో పర్యాటకం కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా.. చిన్న పట్టణాలు, గ్రామాలకు కూడా విస్తరించే అవకాశం కనిపిస్తోంది.

హోస్టింగ్‌తో ఆదాయం.. సొంతంగా కెరీర్‌!
జెన్ జీ యువతకు ఎయిర్‌బీఎన్‌బీ హోస్టింగ్‌ కేవలం సరదా లేదా పార్ట్‌టైమ్‌ పనిగా కాకుండా.. ఆదాయ మార్గంగా కూడా మారుతోంది. 2026 తొలి ఆరు నెలల్లో భారత్‌లో జెన్ జీ హోస్టులు ఎయిర్‌బీఎన్‌బీ ద్వారా పొందిన ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 60 శాతానికి పైగా పెరిగింది. డెహ్రాడూన్‌కు చెందిన శ్రేయ ఇందుకు మంచి ఉదాహరణ. ఇంట్లో ఖాళీగా ఉన్న అంతస్తును అతిథుల కోసం సిద్ధం చేసి హోస్టింగ్‌ ప్రారంభించిన ఆమె.. దీని ద్వారా కుటుంబంతో సమయం గడుపుతూనే సంపాదించడంతో పాటు ప్రయాణాలు, సస్టైనబుల్‌ టూరిజంపై తన ఆసక్తిని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. యువ హోస్టుల్లో దాదాపు ఏడుగురిలో ఒకరు ఎయిర్‌బీఎన్‌బీ సూపర్ హోస్ట్ గుర్తింపు పొందడం కూడా వారు సేవల నాణ్యతకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూపిస్తోంది.

యువతతో మారుతున్న భారత పర్యాటకం
ఎయిర్‌బీఎన్‌బీ ప్రకారం.. భారత జెన్ జీ ఇప్పుడు ప్రయాణికులుగా మాత్రమే కాకుండా హోస్టులు, ఎంటర్‌ప్రెన్యూర్లుగా కూడా మారుతోంది. తమ ఇళ్లు, స్థానిక సంస్కృతి, ప్రాంతీయ ప్రత్యేకతలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు పరిచయం చేస్తూ కొత్త అవకాశాలను సృష్టించుకుంటోంది. దీనివల్ల యువతకు ఆదాయం రావడంతో పాటు స్థానిక రెస్టారెంట్లు, దుకాణాలు, రవాణా వంటి వ్యాపారాలకు కూడా పరోక్షంగా ప్రయోజనం కలగవచ్చు. మొత్తంగా చూస్తే.. భారత జెన్ జీ తమ ప్రయాణ అనుభవాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లి, తమ ఇంటి తలుపులు తెరిచి ప్రపంచాన్ని ఆహ్వానిస్తూ.. కొత్త ఆదాయ మార్గాలను సృష్టిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement