పేదవాడే.. కానీ నిజాయితీలో కోటీశ్వరుడు! | Funday Special Story On Taxi Driver Honesty Written By Malladi Venkata Krishna Murthy | Sakshi
Sakshi News home page

పేదవాడే.. కానీ నిజాయితీలో కోటీశ్వరుడు!

Aug 23 2026 11:23 AM | Updated on Aug 23 2026 11:23 AM

Funday Special Story On Taxi Driver Honesty Written By Malladi Venkata Krishna Murthy

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

కథాకళి

పోలీస్‌ స్టేషన్‌ ముందో టేక్సీ ఆగింది. ఆ సమయంలో ఓ ఫిర్యాదుదారుడు ఎస్‌.ఐ. బల్లమీది ఐ.పి.సి. కోడ్‌ పుస్తకంలో ఓ కవర్ని ఉంచి కోరాడు.
‘‘సర్‌. ఎలాగైనా మీరు నాకు న్యాయం చెయ్యాలి సర్‌.’’
‘‘తప్పకుండా. ఫికర్‌ పడకు.’’ ఎస్‌.ఐ. చెప్పాడు.

ఆ ఎస్‌.ఐ.కి ఉద్యోగంలో చేరాక వచ్చిన మొదటి కవర్‌ కాదు అది. అప్పటికే ఆ పుస్తకంలో అలాంటి వందల కవర్లు ఉంచబడ్డాయి. అవి ఉంచబడ్డప్పుడల్లా కొన్ని సందర్భాల్లో న్యాయాన్ని గెలిపించాడు. చాలా సందర్భాల్లో అన్యాయాన్ని గెలిపించాడు.
ఏ.సి.బి. భయంతో ఎస్‌.ఐ. డబ్బుని తన చేత్తో ముట్టడు. దాని మీద వారు రాసే రహస్య ఇంక్‌ తన చేతికి అంటుకోవడం తను లంచం తీసుకున్న సాక్ష్యం అవుతుందని అతనికి తెలుసు. ఇంటికి ఆ పుస్తకంతో వెళ్ళాక తన ఆరేళ్ళ కొడుకు చేత దాంట్లోని డబ్బు బయటకి తీయిస్తాడు. అలా ఆ రోజు ఆ పుస్తకంలో రెండు కవర్లు చేరాయి.

అతని పక్కనే బల్లలముందు కూర్చున్న మరో ఇద్దరు ఎస్‌.ఐ.లు కూడా జరిగేది చూసారు. కాని జోక్యం చేసుకోరు. వారికీ కవర్లు అందుతూంటాయి. సగటున వారి నెల సంపాదన వారి జీతానికి చాలా రెట్లు ఉంటుంది. కేస్‌ తీవ్రతని బట్టి ఒకోసారి వందరెట్లు కూడా ఉంటుంది. 

ఆ టేక్సీ డ్రైవర్‌ ఏర్‌బేగ్‌తో స్టేషన్‌లోకి నడిచాడు. ఆ గదిలోకి చేతిలో ఏర్‌బేగ్‌తో బిత్తరచూపులు చూస్తూ వచ్చిన ఏభై పైబడ్డ డ్రైవర్‌ ఆ గదిలోని అందరి వంకా చూశాడు. కవర్‌ ఇచ్చిన అతను తన పక్క నించి వెళ్ళాక ఆ ఎస్‌.ఐ. బల్ల దగ్గరికి నడిచాడు. తెల్ల జుట్టు. సన్నగా లోతుకు పోయిన బుగ్గలతో ఉన్న అతను ఆట్టే చదువుకున్నవాడిలా కనిపించడం లేదు. ఎస్‌.ఐ. అతన్ని కూర్చోమని చెప్పలేదు. అసలు అతని వంకే చూడలేదు. కొద్దిసేపు తన మొబైల్‌ని చూసుకున్నాక తలెత్తి అతన్ని, అతని చేతిలోని ఏర్‌బేగ్‌ని చూసి అడిగాడు.
‘‘ఏమిటి?’’ అతని స్వరంలో అలవాటైన గద్దింపు ఉంది.

డ్రైవర్‌ మౌనంగా ఆ ఏర్‌బేగ్‌ని బల్ల మీద ఉంచి, దాని జిప్‌ తెరిచి అందులోని నోట్లకట్టలు, ఓ నగల పెట్టె బల్ల మీద కుమ్మరించాడు.
‘‘ఏమిటిది?’’ ఎస్‌.ఐ. ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘నేను ఊబర్‌ టేక్సీ డ్రైవర్ని సర్‌. ఇందాకే ఓ పేసెంజర్ని ఏర్‌పోర్ట్‌లో దింపాను. అతను వెళ్ళాక తుడుద్దామని చూస్తే వెనక సీట్లో ఇది కనిపించింది. వెంటనే పార్క్‌ చేసి అతనికి ఇవ్వడానికి వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు నన్ను లోపలకి వెళ్ళనివ్వలేదు. ఏం చేయాలో తెలీక మీ దగ్గరకి వచ్చాను.’’ 

అతనిలోని నిజాయితీకి ఎస్‌.ఐ. కొద్దిసేపు అవాక్కయ్యాడు. 
అతని హిందీని బట్టి బీహారీ అని ఎస్‌.ఐ.కి అనిపించింది.
తర్వాత నోట్లని లెక్క కట్టి ఓ కాగితం మీద రాశాడు. నగదు, బంగారం విలువ కలిసి ఎనిమిది లక్షలు దాకా ఉండచ్చని అంచనా వేశాడు. అందులోని శుభలేఖలని చూసి పెళ్ళికి వెళ్తున్నాడని ఎస్‌.ఐ. ఊహించాడు. దాన్ని స్వంతం చేసుకోవాలనే ఆలోచన తక్షణం కలిగింది.

‘‘నువ్వు ఎందుకు తెచ్చిస్తున్నావు? మొత్తం ఇదేనా? లేక కొంత కాజేశావా?’’ గద్దించాడు.
‘‘నేను బీదవాడినే. కాని నిజాయితీపరుడ్ని సర్‌. కాజేసే బుద్ధే ఉంటే అసలు దీంతో ఇక్కడికి రాకపోదును కదా సర్‌? మాది బీహార్లోని పహార్‌గంజ్‌. మూడేళ్ళ క్రితం బేంక్‌లో ఎనిమిది లక్షలు అప్పు చేసి టేక్సీని కొన్నాను. నాకు ముగ్గురు అమ్మాయిలు. సిటీలో కాపురం ఖర్చుతో కూడింది కాబట్టి అప్పు తీరాక వాళ్ళని తీసుకురావాలని అనుకున్నాను. నిజం చెప్పాలంటే, దీన్ని స్వంతం చేసుకుని బేంక్‌ అప్పు తీరిస్తే, కాపురం పెట్టచ్చనే ఆలోచన మొదట్లో వచ్చింది సార్‌. అరగంట మీమాంసలో పడ్డాను. కాని నాలోని రావణాసురుడ్ని రాముడు చంపేశాడు సార్‌. దాంతో తెచ్చి మీకు ఇస్తున్నాను.’’

ఎస్‌.ఐ.తో పాటు మిగిలిన సిబ్బంది కూడా అతని మాటలని వింటూ ఆసక్తిగా చూశారు. అతని పేరు, టేక్సీ నంబర్, డ్రైవింగ్‌ లైసె¯Œ ్స వివరాలు, అడ్రస్‌ రాసుకున్నాక ఆ వ్యక్తి ఎస్‌.ఐ.ని అడిగాడు.
‘‘ఇంక నేను వెళ్ళచ్చా సార్‌?’’
ఎస్‌.ఐ. సరే అన్నట్లుగా తల ఊపాడు. వెళ్ళబోయే ముందు అతను చెప్పాడు.
‘‘నా మనసు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది సార్‌. నెత్తి మీంచి వంద కిలోల బండ దింపినట్లుగా ఉంది.’’
∙∙ 
ఆ సంఘటన నాలుగు పరిణామాలకి దారి తీసింది. మొదటిది, ఎస్‌.ఐ. ఆ బండని మోయదలచుకోలేదు. వెంటనే ఏర్‌పోర్ట్‌లోని పోలీసులకి తనకి టేక్సీ డ్రైవర్‌ తెచ్చిచ్చిన ఓ ప్రయాణికుడి ఏర్‌ బేగ్‌ వర్ణనని, అందులో ఉన్న వాటి వివరాలని అందచేశాడు.
రెండోది ఆ రెండు కవర్లు ఇచ్చిన వారికి ఎస్‌.ఐ. ఫోన్‌ చేసి పిలిపించి, వాటిని వెనక్కి ఇచ్చేసి తన అశక్తతని తెలియచేశాడు.
మూడోది ఇంకాస్త పెద్దది. ఎస్‌.ఐ. ఓ పోలీస్‌ రిపోర్టర్‌కి ఫోన్‌ చేసి ఆ డ్రైవర్‌ మంచితనం గురించి తెలియచేశాడు. అతన్ని ఆ రిపోర్టర్‌ ఇంటర్వ్యూ చేసి ఆ సొమ్ముతో సహా అతని ఫొటో తీసుకున్నాడు. అది పేపర్లలోకి ఎక్కాక దాన్ని చదివిన ఓ ఎఫ్‌.ఎం. రేడియో జాకీ ఆ డ్రైవర్ని ఇంటర్వ్యూ చేసి, అతని బేంక్‌ ఎకౌంట్‌ వివరాలు శ్రోతలకి తెలియజేశాడు.
      నాలుగోది, ఆ సంఘటన జరిగిన ముప్ఫై ఆరు గంటల్లో ఆ డ్రైవర్‌ బేంక్‌ ఎకౌంట్లో పబ్లిక్‌ నుంచి 1,92,173 రూపాయలు జమయ్యాయి.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement