అసలు ఆ రాత్రికి ఏ జరిగింది? ఇప్పటికీ మిస్టరీగానే ఆ ఘటన! | Russia Dyatlovm Pass Mystery What Happened To Nine Mountaineers | Sakshi
Sakshi News home page

అసలు ఆ రాత్రికి ఏ జరిగింది? ఇప్పటికీ మిస్టరీగానే ఆ ఘటన!

Aug 23 2026 9:57 AM | Updated on Aug 23 2026 10:40 AM

Russia Dyatlovm Pass Mystery What Happened To Nine Mountaineers

ఫండే

మిస్టరీ

1959 ఫిబ్రవరి ఒకటో తేదీ... రష్యాలోని యూరల్‌ పర్వత ప్రాంతం– సంధ్యకాంతుల్లో ఆ మంచు పర్వతం శోభాయమానంగా కనిపిస్తోంది. అప్పుడే అక్కడకు ఓ పర్వతారోహకుల బృందం వచ్చింది. ‘‘ఈ రాత్రికి ఇక్కడ బస చేద్దాం’’ అని 23 ఏళ్ల ఇగోర్‌ డియాట్లోవ్‌ తన సహచరులను ఉద్దేశించి అనడంతో అందరూ టెంట్‌ వేయడానికి ఉపక్రమించారు.

గంటలు గడిచాయి. అందరూ గాఢనిద్రలోకి జారుకున్నారు. చుట్టూ తెల్లటి మంచుకొండలు తప్ప ఎలాంటి అలికిడీ లేదు. బయట ఉష్ణోగ్రత మైనస్‌ 30 డిగ్రీలకు పడిపోయి భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అంతలోనే ఏమైందో తెలియదు– టెంటులో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. లోపలున్నవారు విపరీతమైన భయంతో టెంట్‌ను కత్తితో చీల్చుకుని బయటకు వచ్చారు. పెద్దగా అరుస్తూ ప్రాణభయంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. ఆ రాత్రి వారి జీవితంలో కాళరాత్రిగా మిగిలిపోయింది.

ఆ భయానక రాత్రికి ఎనిమిది రోజుల ముందు– అంటే, 1959 జనవరి 23న రష్యాలోని యూరల్‌ పాలిటెక్నిక్‌ ఇన్‌ స్టిట్యూట్‌కు చెందిన ఎనిమిది మంది యువకులు, ఇద్దరు యువతులు ‘ఓటోర్టెన్‌’ అనే ప్రమాదకరమైన మంచు పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరారు. అనారోగ్యం కారణంగా ‘యూరీ యుడిన్‌’ అనే యువకుడు వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.

మిగిలిన తొమ్మిదిమంది ఫిబ్రవరి 1న ‘ఖోలాట్‌ స్యాఖ్ల్‌’ అనే కొండపైకి చేరుకుని అక్కడ టెంట్‌ వేసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికి తిరిగి రావాలి. కానీ ఫిబ్రవరి 20 వచ్చినా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో కుటుంబసభ్యుల విన్నపం మేరకు రష్యా ప్రభుత్వం సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించింది. ఫిబ్రవరి 26న సహాయక బృందాలు ఆ కొండ వద్దకు చేరుకుని అక్కడి దృశ్యాలు చూసి షాక్‌ తిన్నాయి.

టెంట్‌ను లోపల నుంచి కోసిన ఆనవాళ్లు కనిపించాయి. కానీ చుట్టుపక్కల ఎవరూ లేరు. టెంట్‌కు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టు కింద ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వారి ఒంటిపై లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. మరికొంత దూరంలో డియాట్లోవ్‌ సహా మరో ముగ్గురి శవాలు మంచులో గడ్డకట్టి కనిపించాయి. మిగిలిన నలుగురి మృతదేహాలు మే నెలలో కరిగిన మంచు ప్రవాహంలో దొరికాయి. వీరిలో కొందరి పక్కటెముకలు విరిగిపోగా, ఒకరి పుర్రె పగిలిపోయింది. ల్యూడ్మిలా దుబినినా అనే యువతి నాలుక, కళ్లు కనిపించలేదు. మరొకరి కనుగుడ్లు లేవు. వారి ఒంటిపై అంతటి గాయాలు ఉన్నప్పటికీ, బయటి నుంచి దెబ్బలు తగిలిన గుర్తులు లేవు. కొందరి దుస్తులపై రేడియోయాక్టివ్‌ ఆనవాళ్లు కూడా కనిపించాయి.

ఈ మరణాలపై దశాబ్దాల పాటు రకరకాల ప్రచారాలు సాగాయి. ఆ రాత్రి ఆకాశంలో వింత కాంతులు కనిపించాయని స్థానికులు చెప్పడంతో ఏలియన్స్‌ లేదా యూఎఫ్‌ఓల దాడే కారణమని కొందరు నమ్మారు. రష్యా మిలిటరీ అక్కడ రేడియేషన్‌ ఆయుధాలను పరీక్షించిందని, అది వికటించి వీరు చనిపోయారని ప్రచారం జరిగింది. ఆ ప్రాంతంలో ఉండే ‘మాన్సీ’ అనే గిరిజన తెగకు చెందిన వ్యక్తులు తమ పవిత్ర స్థలంలోకి వచ్చినందుకు వీరిని హత్య చేశారని అనుకున్నారు.

భారీ ఆకారం కలిగిన యతి అనే మంచు మనిషి దాడి చేయడం వల్లే వారికి ఎముకలు విరిగిపోయాయని మరో ఊహాగానం సాగింది. కానీ వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లభించలేదు. చివరకు ప్రభుత్వం– ‘నిరోధించలేని ఒక అపరిమితమైన ప్రకృతి శక్తి’ వల్ల వీరు చనిపోయారని 1959లోనే ఆ కేసును మూసివేసింది. అనంతరం ఆ ప్రాంతం ఆ గ్రూప్‌ లీడర్‌ పేరుతో ‘డియాట్లోవ్‌ పాస్‌’గా ప్రసిద్ధికెక్కింది.

మిస్టరీగా మిగిలిపోయిన ఆ మరణాలపై 2021లో స్విట్జర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు జోహన్‌ గౌమే, అలెగ్జాండర్‌ పుజ్రిన్‌ కలిసి కంప్యూటర్‌ మోడళ్లు, స్నో ఫిజిక్స్‌ ఆధారంగా అధ్యయనం చేసి, శాస్త్రీయ వివరణ ఇచ్చారు. ఆ రాత్రి వీచిన బలమైన గాలుల వల్ల ఒక భారీ మంచుపలక టెంట్‌పై పడిందని, దీంతో అందులో ఉన్నవారి పక్కటెముకలు విరిగిపోయాయని అంచనా వేశారు.

మంచు పలకలు పడతాయనే భయంతో వారు టెంట్‌ను లోపలి నుంచి కోసుకుని బయటకు పరిగెత్తారని, మైనస్‌ 30 డిగ్రీల చలిలో ‘హైపోథెర్మియా’ (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం)తో చనిపోయారని వివరించారు. మృతదేహాలు చాలారోజులు మంచులో ఉండటంతో పక్షులు, అడవి జంతువులు కళ్లు, నాలుకలను తినేసి ఉంటాయని పేర్కొన్నారు. అందులో కొందరు గతంలో రేడియేషన్‌ కు గురయ్యే వాతావరణంలో ఉన్నందున వారి దుస్తులపై రేడియేషన్‌ ఆనవాళ్లు కనిపించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వివరణపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇంతకీ అసలా రాత్రి ఏం జరిగింది? వారంతా ఎలా చనిపోయారు... అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం నేటికీ ఆ యూరల్‌ పర్వతాల మంచు పొరల కిందే నిక్షిప్తమై ఉండిపోయాయి.
- సత్యకిశోర్‌ కొండ్రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement