ప్రతి అడుగులోనూ ఓ కొత్త పాత్ర... ప్రతి మలుపులోనూ ఓ కొత్త అనుభవం! నటిగా తన పరిధిని ఎప్పటికప్పుడు విస్తరించుకుంటూ, విభిన్న పాత్రలతో అలరిస్తోంది నటి వామికా గబ్బి. అనుకోకుండా మొదలైన ఆ ప్రయాణంలోని ఎదురైన మలుపుల గురించి ఆమె మాటల్లోనే మీకోసం!
తెలియకుండా వచ్చా!
చిన్నప్పుడే కథక్ నేర్చుకున్నాను. నా ఎక్స్‌ప్రెషన్స్ నచ్చి, అడగకుండానే ‘జబ్ వి మెట్’లో చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. అలా సినిమా అంటే ఏంటో కూడా తెలియకుండానే సినిమాల్లోకి వచ్చాను.
సినిమానే వదిలేద్దామనుకున్నా!
ఒకానొక దశలో సినిమాలే వద్దనుకున్నాను. నేను ఎటు వెళ్తున్నానో అర్థంకాక నిరాశపడ్డాను. కానీ వచ్చిన కొన్ని మంచి అవకాశాలు మళ్లీ నాలోని నటిని నమ్మేలా చేశాయి. ఇప్పుడు హిందీ, పంజాబీ, మలయాళం, తమిళం, తెలుగు... ఇలా విభిన్న భాషల్లో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.
మరో కొత్త అడుగు!
‘డీసీ’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. కొత్త కథ, కొత్త ప్రపంచం... నటిగా నన్ను నేను మరోసారి పరీక్షించుకునే అవకాశం వచ్చింది. అదే సమయంలో ‘గూఢచారి 2’తో కూడా త్వరలోనే వస్తున్నాను. యాక్షన్ స్పై థ్రిల్లర్‌లో నటించడం నాకు కొత్త అనుభూతి. ప్రేక్షకులు నన్ను మరో కొత్త కోణంలో చూడబోతున్నారనే ఆలోచనే చాలా ఎగై్జటింగ్‌గా ఉంది.
ఐదుగురు పిల్లలు నాకు
జంతువులంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కుక్కలంటే చెప్పలేనంత ప్రేమ. నాకు ఐదుగురు అబ్బాయిలు ఉన్నారు. వాళ్లంతా నా పిల్లలే. షూటింగ్ కోసం దూరం వెళ్లినప్పుడు వాళ్లను మిస్ అవుతుంటాను. అంతేకాదు, నేను పూర్తిగా వీగన్ జీవనశైలిని పాటిస్తాను. దానికి ప్రధాన కారణం జంతువులపై నాకున్న ప్రేమే.
అదొక క్రేజీ కలెక్షన్ !
నేను ఎక్కడికి వెళ్లినా అక్కడి నుంచి ఏదో ఒక ప్రత్యేకమైన ఉంగరం తీసుకురావడం అలవాటు. చిన్నదైనా సరే, ఆ ప్రదేశాన్ని గుర్తు చేసేలా ఉండాలి. అందుకే నా దగ్గర చాలా రకాల ఉంగరాలు ఉన్నాయి. ఒక్కో ఉంగరం వెనుక ఒక్కో ప్రయాణం ఉంటుంది.
‘దేవదాస్’లో పారుగా కనిపించాలి!
నా డ్రీమ్ రోల్ ఏంటని అడిగితే.. ‘దేవదాస్’లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ పోషించిన పారు పాత్ర నాకు చాలా ఇష్టం. అదే పాత్రను ఒక కొత్త కోణంలో చేసే అవకాశం వస్తే వదులుకోను. ఆ పాత్రలో చాలా బలమైన భావోద్వేగాలు ఉన్నాయి.
ప్రశాంతత ఒక కళ!
సినిమాల్లోకి వచ్చాక అందరూ మనల్ని ఎలా చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనే దానిపై ఎక్కువగా ఆలోచిస్తే మన ప్రశాంతత పోతుంది. అందుకే ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుంటాను. ఇతరుల అభిప్రాయాల కంటే... మన గురించి మనకు ఉన్న స్పష్టతే ముఖ్యమని ఇక్కడి నుంచి చాలా నేర్చుకున్నాను.
కెమెరా చూసి భయపడేదాన్ని!
మోడలింగ్ మొదట్లో కెమెరా కనిపిస్తే కాస్త ఇబ్బందిగా అనిపించేది. ఫ్రీజ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదే కెమెరా ముందు ఇప్పుడు ఇన్ని పాత్రలు చేయడం చూస్తే నాకే నవ్వొస్తుంది!
పేరు మార్చలేదు
‘గబ్బి’ అనేది మా నాన్న పెట్టుకున్న కలం పేరు. ఆయన రచయిత. అదే పేరు ఇప్పుడు, నా స్క్రీన్ నేమ్‌గా వచ్చింది. నా పేరులో నాన్న సృజనాత్మక ప్రపంచం ఒక భాగంగా ఉండటం గర్వంగా ఉంటుంది.


