గర్భవతులు తాము కూర్చుని ఉండే సమయాన్ని తగ్గించుకుని, శారీరకంగా చురుగ్గా ఉండటం వాళ్ల ఆరోగ్యకరమైన గర్భధారణకు (హెల్దీ ప్రెగ్నెన్సీకి) తోడ్పడుతుందని ఒక అమెరికన్ అధ్యయనంలో తేలింది. ప్రముఖ మెడికల్ జర్నల్ ‘జామా’లో ఈ పరిశోధనల వివరాలు ప్రచురితమయ్యాయి.
రోజులో 10 గంటలకు పైగా కూర్చునే గర్భిణులను... అంతకంటే తక్కువగా కూర్చునే గర్భవతులతో పోల్చినప్పుడు.. ఎక్కువ సేపు కూర్చుండేవాళ్లలో ప్రతికూలతలూ, అనర్థాలూ దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అవేమిటంటే... గర్భధారణ సమయంలో వచ్చే హైబీపీ, గర్భవతుల్లో వచ్చే మధుమేహం (జెస్టేషనల్ డయాబెటిస్), అధిక రక్తపోటుతో కిడ్నీలు, కాలేయం వంటి కీలక అవయవాలపై ప్రభావం చూపే ప్రీ–ఎక్లాంప్సియా అనే కండిషన్, నెలలు నిండకుండానే ప్రసవం జరిగే ముప్పుతో పాటు తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం వంటి ప్రతికూలతలు కనిపించే అవకాశాలున్నట్టు తేలింది.
ఇలా చాలాసేపు మందకొడిగా ఉండటం అన్నది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం. అంతేకాదు... భవిష్యత్తులో తల్లీబిడ్డలకు గుండెజబ్బులూ, మధుమేహం, ఊబకాయం వచ్చే ముప్పూ ఎక్కువే.
‘‘గర్భధారణలో ఎక్కువసేపు కూర్చోవడం అంత ఆరోగ్యకరం కాకపోవచ్చని మేం ముందుగానే ఊహించాం. అయితే ఆ ప్రమాదం మేము అనుకున్నదానికంటే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యకరం’’ అంటూ ఈ అధ్యయనంలో పాల్గొన్న ప్రధాన పరిశోధకుడొకరు తెలిపారు.
శారీరకంగా చురుగ్గా ఉండటానికీ, గర్భధారణ ఫలితాలకూ ఉన్న సంబంధాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన ఈ అధ్యయనం కోసం గర్భం... మొదటి మూడు నెలల్లో ఉన్న 470 మంది మహిళలను పరిశోధకులు ఎంపిక చేశారు. వారి సగటు వయసు 30.7 ఏళ్లు. ఈ అధ్యయనంలో భాగంగా ప్రతి త్రైమాసికంలోనూ మహిళలకు ప్రత్యేక యాక్టివిటీ మానిటర్లను అమర్చారు. అవి... వారు ఎంతసేపు కూర్చుంటున్నారు, ఏ మేరకు చురుగ్గా ఉంటున్నారనే వివరాలను నమోదు చేశాయి.
మొత్తమ్మీద వీళ్లలో 174 మంది మహిళలు (37 శాతం) గర్భధారణలో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొన్నారు. వీరిలో 86 మందికి (18.3 శాతం) గర్భధారణకు సంబంధించిన అధిక రక్తపోటు సమస్యలు తలెత్తాయి.
రోజుకు 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కూర్చున్న ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరికి గర్భధారణలో ప్రతికూల ఫలితాలు కనిపించాయి. అదే రోజుకు సుమారు ఏడు గంటలు కూర్చున్న మహిళల్లో మాత్రం... ప్రతి ఐదుగురిలో ఒకరికే ఇలాంటి సమస్యలు కనిపించాయి.
గర్భధారణలో ప్రతికూల ఫలితాల ముప్పును బాగా తగ్గించేందుకు మితంగా వ్యాయామం చేయాలంటూ సాధారణంగా చెబుతున్నప్పటికీ చాలామంది గర్భిణులకు ఇలా వ్యాయామం చేయడం సాధ్యపడకపోవచ్చు.
‘‘మా పరిశోధన సూచిస్తున్న విషయం ఏమిటంటే... తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ... తరచూ లేచి, కాసేపు అటూ ఇటూ తిరగడం, కాస్తంత చురుగ్గా కదులుతూ ఉండటమూ గర్భధారణ సమస్యలను నివారించడంలో సహాయపడవచ్చు’’ అంటూ ఓ పరిశోధకుడు తెలిపారు.
నిర్వహణ: యాసీన్


