స్వ‘గతం’: జెన్నిఫర్ బారెటో– మిస్ యూనివర్స్ 2026
చిన్నప్పటి నుంచి జెన్నిఫర్ బారెటోకు ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినడం అంటే ఇష్టం. ఎప్పుడు పిలిచినా ‘ఇదిగో ఇక్కడే ఉన్నాను’ అంటూ వచ్చేది. అందుకే జెన్నిఫర్‌ను ప్రెజెంటా(ఎప్పుడూ అందుబాటులో ఉండేవారిని ముద్దుగా పిలిచే పేరు) అని పిలిచేవారు. ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినడం, అందుబాటులో ఉండడం, హృదయపూర్వకంగా మాట్లాడడం, తన అభిప్రాయాలను నిస్సంకోచంగా తెలియజేయడం తనకు తెలియకుండానే ఒక విధానంగా అనుసరిస్తూ వస్తోంది. బహుశా...అదే ఆమె విజయరహస్యమేమో! ‘కలలు కనడానికి ధైర్యం చేయండి’ అంటున్న 75వ మిస్ యూనివర్స్ కిరీటధారి 29 ఏళ్లజెన్నిఫర్ బారెటో స్వ‘గతం’....
మొదటిసారి అందాల పోటీలో పాల్గొన్నప్పుడు చాలా కష్టపడ్డాను. నా కష్టానికి తగిన ఫలం దక్కింది. మిస్ ప్యూర్టోరికోగా ఎంతో గుర్తింపు వచ్చింది. అందాల పోటీలు అనే అపరిచిత, సరికొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు నాకు అర్థమైనది ఏమిటంటే, ర్యాంప్‌పై నడవడం నుండి టెక్నిక్ వరకు, మనల్ని ప్రేమించుకోవడం నుంచి మాటకు ఉన్న శక్తిని అర్థం చేసుకోవడం వరకు చాలా నేర్చుకుంటాం. నేర్చుకున్న విషయాలు మనల్ని వినయశీలిగా మారుస్తాయి. ఇది నాకు ఎంతో నచ్చింది. అందాల పోటీల వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగిందని నమ్ముతున్నాను. ముఖ్యంగా భావోద్వేగ మేధస్సు మనం అనుకునేదానికి మించి ఉంటుందనే విషయం గ్రహిస్తాం.
అప్పుడూ ఓకే....ఇప్పుడూ ఓకే!
అందాల పోటీలో పాల్గొనడానికి ముందు బరువు తగ్గాలనుకున్నాను. క్రమశిక్షణతో వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గాను. అలా అని ‘బరువు తగ్గాక బాగున్నాను’ అనుకోలేదు. ‘అప్పుడూ బాగున్నాను. ఇప్పుడు కూడా బాగున్నాను’ అని మాత్రం అనుకున్నాను! ప్యూర్టోరికో అందాల కిరీటాన్ని ధరించడం (మిస్ ప్యూర్టోరికో) అదృష్టంగా భావించాను. ఎందుకంటే మాకు ఇది అందాలకు సంబంధించిన ఒలింపిక్స్! ప్యూర్టోరికో అందాల కిరీటం ధరించడం అదృష్టమే కాదు బాధ్యత కూడా. ఆ బాధ్యతలో భాగంగా మా వంటకాలు, మా సంస్కృతి, చరిత్రను అందరికీ చప్పాలని ఉంది. మా దేశానికి సంబంధించి నాకు ఇష్టమైన వంటకాలు మోఫోంగో బాల్స్, టోస్టోన్స్. ప్యూర్టోరికన్ వంటకాలు చాలా వైవిధ్యమైనవి కాబట్టి నేనే కాదు అందరూ ఇష్టపడతారు. వాటిలో ఉప్పగా ఉండేవీ, తీపిగా ఉండేవీ ఉంటాయి. ఇతర దేశాల వంటకాలను కూడా ప్యూర్టోరికన్ స్టైల్లో తయారుచేయడం మా ప్రత్యేకత.
బలమైన కుటుంబ పునాది
అందాల కిరీటం ధరించిన నన్ను చూసి ‘యువరాణి’ అనుకొని ‘వావ్!’ అని సంతోషపడిపోయింది మా అమ్మాయి. కుటుంబమే నా బలం. ఆ బలం నాకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది. కుటుంబ పునాది గట్టిగా ఉంటే అద్భుతాలు సాధించవచ్చు. ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆషామాషీగా చేయకూడదు. దృఢనిశ్చయంతో చేయాలి. బాధ్యతాయుతమైన ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. నా విషయంలో ఒక భార్యగా, తల్లిగా అలాంటి ప్రణాళిక రూపొందించుకోవాల్సి వచ్చింది. దాన్ని తు.చ. తప్పకుండా అమలు చేశాను. అవకాశం వస్తే ప్యూర్టోరికోకు మాత్రమే కాదు ఈ విశ్వానికి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాను.
ప్రివెన్షన్ స్పెషలిస్ట్
మిస్ యూనివర్స్ ప్యూర్టోరికోకు ముందు సైన్యంలో ‘ప్రివెన్షన్ స్పెషలిస్ట్’గా పనిచేశాను. అందాల పోటీ, సైన్యంలో నా విధులు... రెండు వేరు వేరు ప్రపంచాలు. అయినప్పటికీ ఆ రెండు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ప్రజాసేవ అనేది అందాల రాణి చేసే పని కాబట్టి అది నా వృత్తికి సరిపోయింది! ‘నువ్వు మిస్ యూనివర్స్ ప్యూర్టోరికోలో పాల్గొనాలి’ అని మా అంకుల్ నాతో చెప్పినప్పుడు వెనకడుగు వేయకుండా నేను దానిని ఒక సవాలుగా స్వీకరించాను. అందాల పోటీల గురించి లోతైన అధ్యయనం చేశాను. ‘కలలు చిన్నతనంలో మాత్రమే మొదలుకావు’ అనడానికి నేనే బలమైన ఉదాహరణ. కొన్నిసార్లు అవి మన జీవితంలోకి విస్తరించే ఒక లక్ష్యం నుండి పుడతాయి.
తల్లి కావడం...పునర్జన్మ!
తల్లి కావడం అంటే...పునర్జన్మ పొందడం. ఒక దుఃఖ ప్రక్రియ గుండా వెళ్లడం. ఈ దుఃఖప్రక్రియ నన్ను నేను పునఃసృష్టించుకునేలా చేసింది. ఆ టైమ్‌లో మానసిక వైద్యుడిని సంప్రదించాను. అప్పుడే నాకు మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యత అర్థమైంది. అందుకే మనస్తత్వ శాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నాను.
‘క్రైసిస్ రెస్పాండర్’గా విధులు నిర్వహించడానికి ముందు సైన్యం గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలనుకున్నాను. అది నాకు ఎంతో ఉపయోగపడింది. ఆ తరువాత సైనిక కుటుంబాలతో కలిసి పనిచేశాను. ప్రివెన్షన్, ఇంటర్‌వెన్షన్ స్ట్రాటజీస్‌కు సంబంధించి శిక్షణ ఇచ్చాను. ఆ తరవాత ప్రివెన్షన్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వహించాను.
భర్త అంటే..
భర్త అంటే...మన జీవితాన్ని మనకు దూరం చేసిన వ్యక్తి కాకూడదు. మన జీవితాన్ని మెరుగుపరిచేవాడై ఉండాలి. ఈ విషయంలో నా భర్తను చూస్తే గర్వంగా ఉంది. ఒక జంటగా మా ప్రత్యేకత ఏమిటంటే మేము ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరం గౌరవించుకుంటాం. ఇది చాలా ముఖ్యం. భార్యగా, తల్లిగా, వృత్తినిపుణురాలిగా... ఈ పాత్రలన్నింటినీ ఎక్కడా లోటు రానివ్వకుండా పోషిస్తాను.
పునరావిష్కరణ
మనల్ని మనం కోల్పోకుండా అవసరమైనన్ని సార్లు పునరావిష్కరించుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. చాలాసార్లు నన్ను నేను పునరావిష్కరించుకున్నాను. చాలాసార్లు వృత్తులు మార్చాను. నా జీవితలక్ష్యం కనుగొనేవరకు వివిధ పాత్రలు పోషించాను. నాకు నేను సవాళ్లు విసురుకొని, దాన్ని సాధించే వరకు పట్టుదలతో కష్టపడతాను. మీరు ఉన్నచోట మీకు సౌకర్యంగా లేకపోయినా, పనులు చేయండి. కలలు కనడానికి ధైర్యం చేయండి. అసరమైతే మీ వృత్తి, పరిసరాలను మార్చుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనకు పరిమితులు విధించేది సమాజం కాదు. ఆ పరిమితులు మనకు మనం విధించుకునేవే!
కొత్త విజేత.... కొత్త కిరీటం!
మిస్ యూనివర్స్ 2026 పోటీలలో ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచింది. ప్యూర్టోరికాలోని శాన్‌జువాన్‌లో ఈ వేడుకలు జరిగాయి. మిస్ యూనివర్స్ కిరీటం గెలిచిన తొలి వివాహితగా, తల్లిగా జెన్నిఫర్ చరిత్ర సృష్టించింది. మిస్ యూనివర్స్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ పేరుతో 3,150 వజ్రాలతో రూపొందించిన కొత్త కిరీటాన్ని విజేతకు అలంకరించారు. గత ఏడాది విజేత మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ ఈ కిరీటాన్ని విజేతకు అలంకరించారు. ‘ప్రస్తుతం ప్రపంచానికి నాయకుల నుంచి ఏంకావాలి?’ అని ఫైనల్ రౌండ్‌లో అడిగిన ప్రశ్నకు ‘వృత్తిపరమైన నైపుణ్యంతో పాటు సహానుభూతి ఉండే నాయకులు అవసరం’ అని జవాబు ఇచ్చింది జెన్నిఫర్.
రెండు దశాబ్దాల తరువాత ప్యూర్టోరికోకు అందాల కిరీటం దక్కింది. ఈ పోటీల్లో 116 దేశాలకు చెందిన అందాల రాణులు పాల్గొన్నారు. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నూనెజ్ ఫస్ట్ రన్నరప్‌గా, వెనిజువెలాకు చెందిన క్లారా వేగాస్ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన కజియా లిజ్ మెజో టాప్–30 వరకు చేరుకుంది.
– యాకుబ్ పాషా


