సందర్భం
ఆ ద్వీపం అందాల దీపాలతో వెలిగిపోతుంది. 75వ ‘మిస్ యూనివర్స్’ గ్రాండ్ ఫినాలే నవంబర్ 24 (భారత కాలమానం ప్రకారం నవంబర్ 25) ప్యూర్టోరికాలోని శాన్‌జువాన్‌లో జరుగుతుంది. ఈ నేపథ్యం లో ‘విశ్వ సుందరి కిరీటం దక్కేదెవరికి?’ అంశంపై ప్రపంచ నలుమూలల నుంచి ఊహాగానాలు, అంచనాలు వెల్లువెత్తాయి.
ఆ అంచనాలలో అగ్రస్థానంలో ఉన్న హాట్ ఫేవరెట్‌ల పరిచయం...
అందాల రాణుల వంశం
తాజా మిస్ యూనివర్స్ పోటీలకు సంబంధించి ‘విజేత ఎవరు?’ అనే అంచనాలలో వెనిజువెలా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్లారా వెగాస్ అగ్రస్థానంలో ఉంది. ‘ఆమెది అందాల రాణుల వంశం’ అని క్లారా వెగాస్ గురించి కొనియాడుతుంటారు!
‘మిస్ వెనిజువెలా 2025’ టైటిల్ గెల్చుకున్న క్లారా వెగాస్ కారకాస్‌లోని చకావోలో జన్మించింది. ఆమె తల్లి ఆండ్రీనా గోయెట్జ్ 1990లో ‘మిస్ వెనిజువెలా’ టైటిల్ గెలుచుకున్నారు. ‘నా కజిన్ 2006లో మిస్ వెనిజువెలాగా నిలిచింది. మా అత్తగారు 1992లో మిస్ వెనిజువెలాగా గెలిచారు. మా అమ్మ కూడా అందాల కిరీటం ధరించారు’’ అని సగర్వంగా చెప్పింది క్లారా.
అందాల పోటీ... అరుదైన అవకాశం
గారన్స్ ఆథీ ఫ్రెంచ్ ఫ్యాషన్ మోడల్. పారిస్‌లో పుట్టింది. తొమ్మిదో ఏటనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఫ్రెంచ్, ఇంగ్లీష్‌లతో పాటు స్పానిష్, ఇటాలియన్ కూడా మాట్లాడుతుంది. బాలికల విద్య, హక్కుల కోసం పనిచేస్తోంది. మిస్ యూనివర్స్ 2026 కోసం రిహార్సల్స్ చేస్తున్న సందర్భంగా మోకాలుకి గాయమైనా నిరాశపడలేదు. ‘చదువు, మోడలింగ్... రెండిటినీ సమన్వయం చేసుకుంటూ వస్తున్నాను. సమన్వయం అంటే రెండూ ఇష్టమైనవేవని చెప్పడం. మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనడం ఒక మహిళ తనను తాను ఒకే మార్గానికి పరిమితం చేసుకోవాల్సిన అవసరం లేదని చూపించేందుకు లభించే అరుదైన అవకాశం’ అంటుంది ఆథీ.
అవును... ఒత్తిడి మంచిదే!
బియా మిలాన్ విండోర్సీ్క ‘మిస్ యూనివర్స్ ఫిలిప్పిన్స్’ టైటిల్, 2024లో ‘మిస్ ఎర్త్ యూఎస్‌ఎ’ టైటిల్ గెలుచుకుంది. హిస్టరీ స్టూడెంట్ అయిన మిలాన్ మోడలింగ్‌లోకి వచ్చింది. పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలలో చురుగ్గా పాల్గొంటుంది. మిస్ యూనివర్స్ ఫిలిప్పిన్స్ ప్రశ్నోత్తరాల విభాగంలో మిలాన్‌ను ‘మీ దేశంపై ప్రజలు నిరాశతో ఉన్నప్పటికీ ప్రపంచ వేదికపై ఫిలిప్పీన్స్‌కు ప్రాతినిధ్యం వహించడం గురించి ఏం చెబుతారు?’ అనే ప్రశ్న కు సమాధానంగా ఫిలిప్పీన్స్ ప్రజల శక్తిసామర్థ్యాల గురించి మిలాన్ మాట్లాడింది. ‘టైటిల్ హోల్డర్‌గా ప్రజాసేవకురాలిగా ఉంటాను’ అని ప్రతిజ్ఞ చేసింది. ‘ఒత్తిడిని నేను ప్రతికూల కోణంలో చూడను. ఒత్తిడి అనేది ఒక వరం. నన్ను నేను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకునేలా అది ప్రేరేపిస్తుంది’ అంటుంది మిలాన్.
ప్రివెన్షన్ స్పెషలిస్ట్
జెన్నిఫర్ బారెటో మిస్ యూనివర్స్ 2026 ప్యూర్టోరికోకు ప్రాతినిధ్యం వహిస్తోంది. వాలీబాల్ గేమ్‌లో అద్భుత ప్రతిభ చూపిన జెన్నిఫర్ సామాజిక అంశాలపై స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పనిచేస్తుంటుంది. సైనికులలోని హానికరమైన ప్రవర్తనను నివారించే ‘ప్రివెన్షన్ స్పెషలిస్ట్’గా పనిచేసింది. అనుభవం లేపోయినా గత సంవత్సరం జరిగిన మిస్ యూనివర్స్ ప్యూర్టోరికా బరిలో అడుగిడి విజేతగా నిలిచింది.
ప్రేమతో...
మరియా అలెజాండ్ర లోపెజ్ కొలంబియన్ మోడల్. మిస్ గ్రాండ్ కొలంబియా, మిస్ యూనివర్స్ కొలంబియా టైటిల్స్ గెలుచుకుంది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్‌తో సహా పలు అందాల పోటీలలో కొలంబియాకు ప్రాతినిధ్య వహించింది. కొలంబియాలోని రిసారల్డాలోని పెరీరాలో జన్మించిన మరియా ‘అర్బోలెడా యూనివర్శిటీ’లో ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్ చదివింది. ‘ప్రతి ఒక్కరూ తమ కలలపై నమ్మకంతో ఉండాలి. అసాధ్యం అనిపించేవి కూడా సాధ్యం అవుతాయని నమ్మాలి. ప్రేమతో మనల్ని మనం తిరిగి నిర్మించుకోగలం. యుద్ధాల తరువాత దేశాలను నిలబెట్టేది ఈ ప్రేమే!’ అంటుంది మరియా అలెజాండ్ర లోపెజ్.
మన దేశం నుంచి... కేజియా లిజ్ మెజో
మిస్ యూనివర్స్–2026లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అందాలతార... కేజియా లిజ్ మెజో. గతంలో మిస్ టీన్ దివా, మిస్ టీన్ ఇంటర్నేషనల్ ఇండియా కిరీటాన్ని గెల్చుకుంది. మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించి ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. అబుదాబీలోని మలయాళీ కుటుంబంలో జన్మించిన కేజియా మోడల్. శాస్త్రీయ నృత్యకారిణి. వయోలిన్, డ్రమ్స్, గానం, కరాటేలలో ప్రావీణ్యం ఉంది. ప్రస్తుతం బెంగళూరులోని
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో లా చదువుతోంది.
‘2021లో మొదటిసారి మిస్ యూనివర్స్ పోటీ చూశాను. అప్పుడు నాకు అందాల పోటీ గురించి పెద్దగా తెలియదు. అయితే ఇండియా గెలవడం నాకు చాలా సంతోషాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. ఆ అందాల పోటీ విజేత హర్నాజ్ సంధు లో నాకు చాలా స్ఫూర్తినిచ్చేది ఆమెలోని దృఢసంకల్పం. గెలిచిన తరువాత కూడా హర్నాజ్ విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా తన వ్యక్తిత్వానికి కట్టుబడి ఉన్నారు. గతంలో నాలో ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. ఆమెను చూసిన తరువాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నాను. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్... అనే సుప్రసిద్ధ సామెత నాకు ఎంతో ఉపయోగపడింది’’ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది కేజియా.


