ప్రతి అడుగులోనూ ఓ కొత్త శక్తి | Himalayan Trekker Indu Harikumar success journey | Sakshi
Sakshi News home page

ప్రతి అడుగులోనూ ఓ కొత్త శక్తి

Nov 26 2026 1:08 AM | Updated on Nov 26 2026 1:08 AM

Himalayan Trekker Indu Harikumar success journey

పర్వతారోహణ

ప్రకృతిపై ప్రేమ 58 ఏళ్ల ఇందు హరికుమార్‌ను హిమాలయన్‌ ట్రెక్కర్‌ను చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద 10 పర్వతాలను అధిరోహించేలా చేసింది. చేస్తున్న టీచర్‌ ఉద్యోగం నుంచి వాలెంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకొని, పర్వతారోహకురాలిగా మార్చింది. ‘పర్వతాల అధిరోహణ చాలా పెద్ద ఛాలెంజింగ్‌. మనలో పూర్తి సంతృప్తిని నింపే మార్గం కూడా అదే’ అంటారు ఆమె. హైదరాబాద్‌ వాసి అయిన ఇందు పాతిక హిమాలయన్‌ ట్రెక్స్‌ పూర్తి చేసి, ఇప్పుడు హైయెస్ట్‌ టాప్‌ 50 మౌంటెయిన్స్‌ను లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి సాధ్యాసాధ్యాల గురించి అడిగితే పర్వతారోహణ వల్ల కలిగే శక్తి, మెరుగుపడే జీవనశైలిని ఆనందంగా ఇలా మన ముందు ఆవిష్కరించారు..

‘‘పర్వతాలకు ఏదో అయస్కాంత శక్తీ ... అలాగే, మనసులను సాంత్వన పరిచే హీలింగ్‌ పవర్‌ ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులకు ఔషధంలా పనిచేస్తాయి. నాకు ప్రకృతిలో గడపడం అంటే చాలా ఇష్టం. ఆ ప్రేమ చాలా చోట్లకు వెళ్లేలా చేసింది. మొదట ప్రకృతిలోని అందాన్ని ఆస్వాదించడానికి టూర్లకు వెళుతుండేదాన్ని. ఆ తర్వాత నా అడుగులు మంచు పర్వతాల వైపుగా కదిలాయి. పచ్చని ప్రకృతి, పూల సొగసు, లోయల అందాలు, మంచు దుప్పటి.. ఇలా హిమాలయ పర్వతాల అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.  

వేసవిలో ప్లానింగ్‌!: మా వారు హరికుమార్‌ బ్యాంక్‌ ఉద్యోగి. మాకు ఇద్దరు అబ్బాయిలు. నేను స్కూల్‌ టీచర్‌గా వర్క్‌ చేసేదాన్ని. వేసవి సెలవుల్లో హిమాలయన్‌ టూర్‌ వెళ్లేవాళ్లం. అక్కడే కొన్ని ట్రెక్కింగ్‌ గ్రూపులు పరిచయం అయ్యాయి. నాకూ ట్రెక్కింగ్‌కు వెళ్లాలనిపించి, ఆ గ్రూపుల్లో చేరిపోయాను. స్కూల్‌ జాబ్‌ అంటే వేసవిలోనే ఎక్కువ రోజులు సెలవులుంటాయి. మిగతా రోజుల్లో కుదరదు. మొదట్లో సెలవుల్లోనే ట్రెక్కింగ్‌ ప్లాన్‌ చేసుకునే నేను, పర్వతారోహణలో ఉండే ఆత్మ సంతృప్తి వేరే చోట దొరకదనిపించింది. దాంతో నాకున్న ఆసక్తులను పూర్తి చేసుకోవడానికి జాబ్‌ నుంచి బయటకు రావడమే మంచిదనిపించింది. అలాగే వచ్చేశాను కూడా.  

మారథాన్‌ నుంచి పర్వతారోహణ: ఫిట్‌నెస్‌ కోసం మార్నింగ్‌ వాక్, జాగింగ్‌ ఏళ్లుగా చేస్తున్నాను. ప్రతిరోజూ ఉదయం ఒక గంట సేపు నా దినచర్యలో ఇవి తప్పక ఉంటాయి. నాలుగైదేళ్లుగా యోగా చేస్తున్నాను. దీనివల్ల శరీరానికి, మైండ్‌కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మొదట నా స్నేహితులలో ఒకరితో టెన్‌ కె మారథాన్‌లో పాల్గొన్నాను. మొదటిసారే ఫస్ట్‌ ఫ్రైజ్‌ తెచ్చుకున్నాను. ఆ తర్వాత ఏషియన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లోనూ విజేతగా నిలిచాను. ఈ ప్రాక్టీస్‌ హిమాలయన్‌ ట్రెక్కింగ్‌కు వెళ్లడానికి బాగా ఉపయోగపడింది. 

ఇండియన్‌ హైక్స్‌ ట్రెక్కింగ్‌ ఆర్గనైజేషన్‌లో చేరిపోయాను. పర్వతారోహణలో బ్రీతింగ్‌ పెద్ద సమస్య. అందుకు తగిన జాగ్రత్తలు, ట్రెక్‌ గేర్, మెడిసిన్, గైడ్‌ సూచనలు .. అన్నీ ఉండాలి. అన్నింటినీ తెలుసుకుంటూ, అర్ధం చేసుకుంటూ 50 ఏళ్ల వయసు నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద పది పర్వతాలను అధిరోహిస్తూ వచ్చాను. ఎవరెస్ట్‌ నుంచి అన్నపూర్ణ వరకు ప్రతీ పర్వతారోహణ అద్భుతమైన అనుభూతులను మిగిల్చింది. 167 కిలోమీటర్ల పొడవు, 19,600 మీటర్ల ఎత్తులో ఉండే కనోమో పీక్‌ అధిరోహణ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. మంచుకొండల్లో వేసే ప్రతి అడుగు ఓ కొత్త కథను మనకు పరిచయం చేస్తున్నట్టుగానే ఉంటుంది.

భయాలను అధిగమించడంలో సరైన ఎంపిక
పర్వతాల అధిరోహణలోనే కాదు, కిందకు దిగేటప్పుడూ సమస్యలు ఉంటాయి. ప్రాణాలు కోల్పోవచ్చు. పర్వతారోహణ చేయాలని చాలా మందిలో ఉన్నా, ఇలా ప్రాణభయం వల్ల వెనకడుగు వేస్తారు. కానీ, ఇంటి వద్ద ఉన్నా సురక్షితంగా ఉంటామని గ్యారెంటీ లేదు కదా! అనేది నా ఆలోచన. అదే నన్ను రిటైర్‌మెంట్‌ ఏజ్‌లోనూ పర్వతాలను అధిరోహించేలా చేస్తోంది. పిల్లల స్కూల్‌ ఏజ్‌ నుంచే పర్వతారోహణ ఒక భాగంగా ఉంటే వాళ్లు వారి జీవితంలో ఎన్నో భయాలను అధిగమించి, అద్భుతాలను సృష్టించగలరు’’ అంటారు ఈ పర్వతారోహకురాలు. 

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement