ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
జ్యోతిర్మయం
జీవులు చేసే కర్మలు అవి తెలిసి చేసినా, తెలియక చేసినా, మంచికి మంచి, చెడుకు చెడు ఫలితాలు ఇస్తాయి. నిప్పు అని తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా అది కాలక మానదు.
ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ప్రకృతి సౌందర్యానికి నిలయమైన కైలాస శైలోపవనంలో ప్రవేశించి పరవశంతో పలు విధాల ఆనందం పొందారు. తర్వాత, ఒక విశాలమైన బిల్వ వృక్షం నీడలో కూర్చున్నారు. అప్పుడు సూర్యాస్తమయం అవుతోంది. బిల్వ దళాలతో శివార్చన చేసే సమయం అది.
అప్పుడు ఒక వానరం ఒక చెట్టుపై నుండి ఇంకో చెట్టు పైకి దుముకుతూ బిల్వ వృక్షం పైకి చేరింది. జాతి సహజమైన చేష్టతో బిల్వ దళాలను తుంపి నేల పైకి విడుస్తుంటే పరమ శివునిపై పడ్డాయి. 108 దళాల వరకూ లెక్కించి, వానరాన్ని కిందకు దిగి రమ్మన్నాడు. వానరం క్షణంలో దిగి వచ్చి ఆది దంపతులకు ప్రణామం చేసింది.
శివుడు ‘నూరు సహస్రముల ఎనిమిది సంవత్సరాలు మండలాధిపతివై సకల భోగాలు అనుభవించి నన్ను పొందుతావు’ అని వరమిచ్చాడు. ‘అడిగిన వారికి ఇటువంటి వరాలు ఇవ్వక నాకెందుకిస్తున్నావు? భూలోకంలో ధనం, రాజ్యం, ఉన్నత విద్య, సౌందర్యం మదాన్ని కలిగించి నిన్ను మరపింప చేస్తాయి. ఇలా స్వేచ్ఛగా, ఆనందంగా నీ పాదాలను అంటి పెట్టుకుని ఉండటం నీ కిష్టం లేదా?’ అని బాధ పడింది.
ప్రదోష వేళ బిల్వార్చన తెలిసి చేసినా, తెలియక చేసినా గొప్ప ఫలితాన్నిస్తుందని చెప్పి, ‘ఒక్క జన్మలో రాజభోగాలు అనుభవించి, మళ్ళీ నన్నే చేరుతావు. విష్ణు దర్శనం కూడా పొందుతావు’ అని చెపుతాడు. తెలియక చేసిన మంచి కర్మకు వానరం మంచి ఫలితాన్ని పొందింది. తెలియక చెడు కర్మలు చేసినా వాటికీ ఫలితం అనుభవించవలసిందే!
– డా. చెంగల్వ రామలక్ష్మి
ఇదీ చదవండి: అపార సంపద ఉన్నా.. అనుభవించేవారు లేరని కన్నీళ్లు!


