గచ్చిబౌలి ఘటనలో అధికారి సస్పెండ్‌.. హైడ్రా ఫుల్‌ ఫోకస్‌ | TPBO Santhosh Suspended In Gachibowli Building Collapse Incident | Sakshi
Sakshi News home page

గచ్చిబౌలి ఘటనలో అధికారి సస్పెండ్‌.. హైడ్రా ఫుల్‌ ఫోకస్‌

Aug 23 2026 9:01 AM | Updated on Aug 23 2026 9:01 AM

TPBO Santhosh Suspended In Gachibowli Building Collapse Incident

సాక్షి, హైదరాబాద్‌: గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిన ఈ భవనం శిథిలాలు పక్కనే ఉన్న నివాస భవనాలపై పడటంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అన్న అనుమానంతో రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రత్యేక పరికరాలతో శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు ఈ ఘటనపై మున్సిపల్‌ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. మాదాపూర్‌ సర్కిల్‌-50లో TPBOగా పనిచేస్తున్న సంతోష్‌ కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రాణనష్టం జరిగినట్లు సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు సంతోష్‌ కుమార్‌ సస్పెన్షన్‌లో కొనసాగనున్నారు. సస్పెన్షన్‌ కాలంలో స్థానిక హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ విడిచి వెళ్లకూడదని ఆదేశించినట్లు సమాచారం.

బిల్డర్‌ సాజిద్‌ ఖాన్‌ పరారీ
ఈ భవనాన్ని నిర్మిస్తున్న బిల్డర్‌ సాజిద్‌ ఖాన్‌ పరారీలో ఉన్నట్లు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వెల్లడించారు. అంజయ్యనగర్‌లో సాజిద్‌ నిర్మిస్తున్న భవనాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. చిన్న స్థలాల్లో అధిక అంతస్తులు నిర్మించి వాటిని హాస్టళ్లుగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి సారించారు. సాజిద్‌ నిర్మించిన ఇతర భవనాల వివరాలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని రంగనాథ్‌ స్పష్టం చేశారు. అంజయ్యనగర్‌లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు మరిన్ని ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

50 గజాల్లో 7+1 నిర్మాణం
ఈ ఘటనలో ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం భవనం నిర్మాణం. కేవలం 50 గజాల స్థలంలో ఏడంతస్తులతో పాటు పెంట్‌హౌస్‌ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. భవనం నాలాను ఆనుకుని నిర్మించినట్లు, సరైన సెట్‌బ్యాక్‌లు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. భవనానికి సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి అనుమతి లేదని అధికారుల నుంచి సమాచారం. ఇంత చిన్న స్థలంలో ఇంత భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోయారన్న అంశంపైనా విచారణ జరుగుతోంది.

అధికారుల పాత్రపైనా అనుమానాలు
ఒకవైపు బిల్డర్‌ పరారీలో ఉండగా.. మరోవైపు ఇంత చిన్న స్థలంలో భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. భవన నిర్మాణంపై గతంలో ఫిర్యాదులు వచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదన్న కోణంలోనూ అధికారులు దృష్టి సారిస్తున్నారు. బిల్డర్‌కు ఎవరి అండ ఉంది? అక్రమ నిర్మాణం ఇంతవరకు ఎలా సాగింది? నిబంధనలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేశారు? అనే ప్రశ్నలకు విచారణలో సమాధానాలు రానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement