వ్యవసాయేతర ఉద్యోగాల్లో 8–12 శాతం మేర జెన్ ఏఐ భర్తీ
శ్రామిక శక్తి చేసే పనుల్లో 9–17 శాతం వరకు ఇది సులభంగా ఆటోమేట్ చేయగలదు
42–48% ఉద్యోగాలకు ఏఐ ఒక అద్భుతమైన ఉత్పాదక సాధనంగా సహాయపడుతుంది
మిగిలిన 40–50% శారీరక శ్రమతో కూడిన పనులపై దీని ప్రభావం చాలా తక్కువ
అత్యధిక రిస్క్ ఉన్న ఉద్యోగాలు... క్లరికల్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్, ఐటీ, టెలికం, కస్టమర్ సపోర్ట్, సేల్స్
సాక్షి, హైదరాబాద్: మనదేశంలోని వ్యవసాయేతర ఉద్యోగాల్లో 8–12 శాతం మేర జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సేవారంగం, విద్య, మీడియా, ఆర్థిక సేవలు, క్లరికల్ పనులపై అధిక ప్రభావం పడే అవకాశాలున్నాయి. శారీరక శ్రమతో కూడిన పనులు, నిర్మాణం వంటి రంగాలు ఏఐ ప్రభావం నుంచి సురక్షితంగా ఉంటాయని, రాబోయే దశాబ్దకాలంలో వార్షిక కార్మిక ఉత్పాదకత 0.4 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో 42–48 శాతం శ్రామిక శక్తికి ఇది సహాయకారిగా ఉంటుందని చెబుతున్నారు.
తాజాగా గోల్డ్‌మన్ సాక్స్ విడుదల చేసిన ’జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ)–భారత లేబర్ మార్కెట్‌పై ప్రభావం’ పై విడుదల చేసిన నివేదికలో ఆయా అంశాలను పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం ఏఐ ప్రభావం అన్ని రంగాలపై ఒకేలా ఉండదు, ఇది చాలా అసమానంగా ఉంటుందని తేలింది. ఇది పూర్తిగా ఉపాధి, ఉద్యోగాలు పోవడానికి దారితీయదని, దీని ద్వారా పనుల పునరి్వభజన జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నివేదిక ప్రకారం, ఏఐ వల్ల దేశంలో భారీగా ఉద్యోగాల నష్టం జరగదు. మరింత నాణ్యమైన, సృజనాత్మకమైన పనులపై దృష్టి పెట్టేందుకు ఇది దోహదపడుతుంది.
ఏఐ వల్ల లబ్ధి పొందే రంగాలు...
⇒ ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌ల బేసిక్ మోడలింగ్ పనులను ఏఐ వేగవంతం చేస్తుంది, తద్వారా వారు మరింత విలువైన విశ్లేషణలపై దృష్టి పెట్టవచ్చు
⇒ ఆరోగ్యం, విద్య... ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ , డేటా అనలిటిక్స్, నాలెడ్జ్–బేస్డ్ పనుల ద్వారా ఈ రంగాలు భారీగా లాభపడతాయి
⇒ మీడియా,ఎంటర్‌టైన్‌మెంట్... క్రియేటివ్ పనులలో ఉత్పాదకత పెరుగుతుంది
ఏఐ ప్రభావం లేని రంగాలు...
⇒ శారీరక శ్రమతో కూడిన రంగాలు... నిర్మాణం, వస్త్ర పరిశ్రమ, మాన్యుఫ్యాక్చరింగ్, ప్లాంట్ ఆపరేటర్ల ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదు. ఇక్కడ ఏఐ కంటే మానవ శ్రమకే డిమాండ్ పెరుగుతుందని నివేదిక పేర్కొంది.
⇒ కొత్త ఉద్యోగాల సృష్టి... గత సాంకేతిక విప్లవాలలాగే, ఏఐ కూడా కాలక్రమేణా సరికొత్త ఉద్యోగ విభాగాలు (ఉదాహరణకు: ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ కంప్లయన్స్ అధికారులు) సృష్టిస్తుంది.
నివేదికలోని ముఖ్యాంశాలు
⇒ భారత్‌లోని వ్యవసాయేతర శ్రామిక శక్తి చేసే పనులలో 9% నుండి 17% పనులను జెనరేటివ్ ఏఐ సులభంగా ఆటోమేట్ చేయగలదు
⇒ 8–12% ఉద్యోగాలు పూర్తిగా లేదా పాక్షికంగా ఏఐ ద్వారా భర్తీ అయ్యే ప్రమాదం ఉంది
⇒ 42–48% ఉద్యోగాలకు ఏఐ ఒక అద్భుతమైన ఉత్పాదక సాధనంగా సహాయపడుతోంది
⇒ మిగిలిన 40–50% శ్రామిక శక్తిపై ఏఐ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది
అత్యధిక రిస్క్ ఉన్న ఉద్యోగాలు
⇒ ఆఫీసుల్లో జరిగే రొటీన్, డేటా ఎంట్రీ, అడ్మిని్రస్టేటివ్ సపోర్ట్, క్లరికల్ పనులకు అత్యధికంగా 3% రిస్క్ ఉంది
⇒ కోడింగ్, బేసిక్ కంప్లయన్స్ చెక్స్ వంటి పునరావృతమయ్యే పనుల స్థానంలో ఏఐ వచ్చే అవకాశం ఉంది
⇒ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్... బేసిక్ కస్టమర్ సర్వీస్ బాధ్యతలను ఏఐ చాట్‌బాట్‌లు భర్తీ చేయవచ్చు


