ఆడితే చిరిగిపోతాయి.. ఉతికితే వెలిసిపోతాయి
ప్రభుత్వ బడుల విద్యార్థులకు యూనిఫారాల తిప్పలు
రెండు నెలలైనా చాలా జిల్లాల్లో అందని దుస్తులు
ఇచ్చిన చోట్లా అరకొరగా.. ఒక్కో జత మాత్రమే
పెద్దవాళ్లకు చిన్నవి.. చిన్నవాళ్లకు పెద్దవి
నాణ్యతలోనూ తీసికట్టే
వస్త్రం సరఫరా, కుట్టుపనిలో తీవ్ర జాప్యం.. అధికారుల పర్యవేక్షణ లోపమే కారణం
చేతులు పైకెత్తి చిరిగిన చొక్కాను చూపుతున్న ఈ విద్యార్థి పేరు బోడ సందీప్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వేపకుంట్ల పాఠశాల విద్యార్థులకు ఇటీవల
పంపిణీ చేసిన యూనిఫారాల్లో అతనికి ఇలా చిరిగిన చొక్కా అందింది. ఇంకా నిక్కర్ ఇవ్వలేదు.
కుట్లు ఊడిపోయి.. కొందరికి వదులుగా, మరికొందరికి బిగుతుగా కనిపిస్తున్న ఈ దుస్తులూ స్కూల్ యూనిఫారాలే. మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వీటిని పంపిణీ చేశారు. ఎగుడుదిగుడు సైజులకు తోడు అతికినట్టు.. పెద్ద సైజు జేబులతో ఉన్న ఈ దుస్తులను వేసుకోబుద్ధి కావడం లేదంటూ విద్యార్థులు వాపోతున్నారు.
సరిపోని సైజులతో ఉన్న చొక్కాలు, పొడుగ్గా ఉన్న చెడ్డీలతో కూడిన ఈ యూనిఫారాలను జనగామ జిల్లా లింగాల గణపురం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అందించారు. వాటిని ఎలా తొడుక్కోవాలని విద్యార్థులు వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించాల్సిన యూనిఫారాలు ఈ ఏడాది తీవ్ర గందరగోళానికి దారితీశాయి. పాఠశాలలు తెరిచి రెండు నెలలు గడుస్తున్నా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ దుస్తులు అందలేదు. మరికొన్ని జిల్లాల్లో అరకొరగా మాత్రమే పంపిణీ చేశారు. అక్కడా రెండు జతలు ఇవ్వాల్సి ఉండగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కో జత మాత్రమే అందాయి. యూనిఫారం అందుకున్నవారికి కూడా కొలతలు సరిగ్గా లేకపోవడం, కుట్లు ఊడిపోవడం, వస్త్రం నాణ్యతగా లేకపోవడంతో ‘ఇవేం యూనిఫారాలు?’అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని 28,038 ప్రభుత్వ పాఠశాలలు, విద్యాశాఖ గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, సంక్షేమ గురుకులాల్లో సుమారు 27 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
వీరికి ఏడాదికి రెండు జతల యూనిఫారాలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అదికూడా కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఇస్తామని, బ్రాండెడ్ దుస్తులు అందించేందుకు రూ. 678.78 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించింది. ప్రతీ విద్యార్థికి ఏడాదికి రెండు జతల యూనిఫారాలు, దుప్పట్లు, బెడ్‌షిట్లు ఇవ్వాలంటే 2.97 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం. గతంలో ఈ వ్రస్తాన్ని స్థానిక చేనేత కారి్మకుల సహకార సంఘం నుంచి కొనుగోలు చేసేవారు. కానీ ఈసారి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు ఎక్కువ భాగం అప్పగించింది. సహకార సంఘానికి మాత్రం 30 శాతం వస్త్రం కొనుగోలుకు మాత్రమే ఆర్డర్ ఇచ్చింది. దీనికి తోడు అడ్వాన్స్ చెల్లింపులోనూ జాప్యం జరిగినట్టు కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయి. సహకార సంఘాలకు ముందస్తుగా చెల్లించకపోయినా వస్త్రం మాత్రం ఇచ్చేవి.
వాస్తవానికి యూనిఫాంకు 56 లక్షల మీటర్ల వస్త్రం అవసరం. కార్పొరేట్ స్కూళ్ల తరహాలో ఉండాలని కార్పొరేట్ కంపెనీలను ఎంచుకుంటే వస్త్రం ఇవ్వడానికే ఆలస్యమైంది. యూనిఫారాల పంపిణీని ఆగస్టు 15 నాటికి పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. యూనిఫారాలు అందిన చోట్ల విద్యార్థులకు మరో సమస్య ఎదురవుతోంది. కొలతలు సరిగ్గా లేక కొందరికి పెద్ద సైజులు, మరికొందరికి చిన్న సైజులు అందాయి. నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని పాఠశాలల్లో పొడవైన అంగీలు, చిన్న చెడ్డీలు, సరిగ్గా లేని ప్యాంట్లతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు కొత్త యూనిఫారం ఉపయోగపడక పాత దుస్తులతోనే పాఠశాలకు వస్తున్నారు.
ఆడితే చిరిగే.. ఉతికితే వెలిసే..
యూనిఫారాలు అందకపోవడం ఒక సమస్య అయితే.. ఇచ్చిన వ్రస్తాల నాణ్యతపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలుచటి వస్త్రం వాడటంతో విద్యార్థులు ఆడుకునే సమయంలోనే దుస్తులు చిరిగిపోతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. రెండుసార్లు ఉతికిన తర్వాత రంగు వెలిసిపోతోందని అంటున్నారు. కొన్నిచోట్ల షర్ట్ భుజాల వద్ద కుట్లు ఊడిపోవడం, గుండీలు ఊడిపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వ్రస్తాన్ని స్థానిక స్వయం సహాయక సంఘాలకు కుట్టేందుకు ఇచ్చారు. ఆలస్యం కావడంతో త్వరగా కుట్టాలని వారిపై విపరీతమైన ఒత్తిడి చేసినట్టు తెలిసింది.
దీంతో మిషన్ కటింగ్ ఇష్టానుసారం జరిగినట్టు తెలుస్తోంది. యూనిఫారాలు కుట్టేప్పుడు కూడా నాణ్యమైన దారం, గుండీలు వాడలేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో భుజాల దగ్గర దారం ఊడిపోయి, పగిలిపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. యూనిఫారాల సరఫరా, కుట్టుపని, పంపిణీ ప్రక్రియలో ప్రతి దశలో నాణ్యతను పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ వీటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్యలు వచ్చాయని ఫిర్యాదులు వస్తున్నాయి.
ఇప్పటికే వస్త్రం నాణ్యత, కొలతలపై పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించిన తర్వాతే కుట్టుపని ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో మిగిలిన విద్యార్థులకు యూనిఫారాల పంపిణీ మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నాణ్యత లోపాల ఫిర్యాదులపై వివరణ కోరేందుకు ‘సాక్షి’ప్రయత్నించగా ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
⇒ నల్లగొండ జిల్లాలోని 1,045 పాఠశాలల్లో 51,719 మంది విద్యార్థులు ఉండగా 30,432 మంది విద్యార్థులకే ఒక్కో జత చొప్పున యూనిఫారాలు ఇచ్చారు.
⇒ సూర్యాపేట జిల్లాలోని 950 పాఠశాలల్లో 50 వేల మంది విద్యార్థులకుగాను 21 వేల మందికే ఒక్కో జత చొప్పున అందింది.
⇒ నారాయణపేట జిల్లాలో 469 ప్రభుత్వ పాఠశాలల్లో 54 వేల మంది విద్యార్థులుండగా.. 11 వేల మందికి మా త్రమే ఒక్కో జత చొప్పున యూనిఫారం అందింది.
⇒ మెదక్ జిల్లావ్యాప్తంగా 75,323 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 14 వేల మందికే యూనిఫారాలు అందాయి.
⇒ సంగారెడ్డి జిల్లాలో 1.12 లక్షల మంది విద్యార్థులకుగాను 15,000 మందికే ఒక జత చొప్పున యూనిఫారాలు ఇచ్చారు.
⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలోని 679 స్కూళ్లలో 45,262 మంది విద్యార్థులు ఉండగా 44,212 మంది విద్యార్థులకే యూనిఫారం అందింది.
⇒ కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని పలు పాఠశాలలకు ఇప్పటివరకు యూనిఫారాలు అందలేదు. ఇటీవ లే వస్త్రం సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
⇒ మహబూబ్‌నగర్‌లో 65,515 మంది విద్యార్థుల కోసం 3.53 లక్షల మీటర్ల వస్త్రం వచ్చినా కుట్టుపని ప్రారంభం కాలేదు.
⇒ నిజామాబాద్‌లో 3.65 లక్షల మీటర్ల వస్త్రం కేటాయించినా కుట్టుపని పెండింగ్‌లో ఉంది.
⇒ ఖమ్మం జిల్లాలో విద్యార్థులకు 3,02,716 మీటర్ల క్లాత్ అవసరం కాగా.. ఇప్పటివరకు 2,74,928 మీటర్ల క్లాత్ మాత్రమే వచ్చింది. బాలురకు సంబంధించి నిక్కర్, బాలికల కోట్ క్లాత్ రాలేదు.
⇒ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో కొద్దిపాటి పాఠశాలలకు మాత్రమే యూనిఫారాలు అందగా.. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కుట్టుపని పూర్తికాక పంపిణీ జరగలేదు. షూ, టై, బెల్టులు కూడా అందని పరిస్థితి ఉంది.


