స్కూల్‌ బస్సు బోల్తా | School bus overturns in ntr district | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు బోల్తా

Aug 23 2026 5:31 AM | Updated on Aug 23 2026 5:31 AM

School bus overturns in ntr district

విద్యార్థులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం 

ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు 

విద్యార్థులను బస్సులో నుంచి బయటకు తీసిన రైతులు  

నలుగురు బాలలకు స్వల్ప గాయాలు 

కేంద్ర రహ్‌వీర్‌ అవార్డుకు పిల్లల ప్రాణాలు కాపాడిన రైతుల పేర్లు

జి.కొండూరు: కొద్ది క్షణాల్లో ఇంటికి చేరుకుంటామనే ఆనందంలో ఉన్న విద్యార్థులకు బస్సు ప్రమాదం తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రైవేటు స్కూలు బస్సు కాలువలో బోల్తా పడిన ఘటనలో 25 మంది విద్యార్థులు తృటిలో ప్రాణాలను దక్కించుకున్నారు. నలుగురు బాలలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు స్కూలు బస్సు 32 మంది విద్యార్థులతో శనివారం సాయంత్రం పాఠశాల నుంచి బయల్దేరింది. కట్టుబడిపాలెం, శాంతి నగర్‌ వద్ద ఏడుగురు దిగారు. కట్టుబడిపాలెం – కవులూరు గ్రామాల మధ్య తారకరామా కాలువ వద్దకు రాగానే బూడిద లోడుతో వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయిన బస్సు ఆదుపుతప్పి కాలువలో పడింది. 

పక్కనే పొలాల్లో పనిచేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు, వెంటనే అక్కడకు చేరుకుని బస్సులో ఉన్న 25 మంది విద్యార్థులను, డ్రైవర్‌ నారాయణ, ఆయా పద్మను బయటకు తీశారు. ఫోన్ల ద్వారా సమాచారం అందడంతో తల్లిదండ్రులు వచ్చి వారి పిల్లలను ఇళ్ళకు తీసుకువెళ్లారు. వీరిలో నలుగురు విద్యార్థులు ఆయేషా సిద్ధిఖి, ఎం.సాయినంద, డి.హర్షవర్థన్, జస్వంతికి స్వల్ప గాయాలు కావడంతో విజయవాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో కాలువలో కొద్దిపాటి నీరుంది. 

రైతులు వెంటనే స్పందించి అందరినీ బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. డ్రైవర్‌ మితిమీరిన వేగంతో బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని  స్థానికులు చెబుతున్నారు. ఇటీవలే ఇబ్రహీంపట్నంలో ఓ గురుకుల పాఠశాల బస్సు బోల్తా పడింది. ఇప్పుడు మరో ప్రమాదం జరగడంతో బస్సుల నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.  

రహ్‌వీర్‌ అవార్డుకు 10 మంది రైతుల పేర్లు సిఫార్సు 
పాఠశాల బస్సు బోల్తా పడిన వెంటనే పక్కనే వరి పొలాల్లో పని చేస్తున్న రైతులు పరుగెత్తుకుంటూ వచ్చి 25 మంది విద్యార్థులు, బస్సు డ్రైవర్, ఆయాతో కలిపి 27 మందిని కాపాడారు. వీరు వెంటనే రంగంలోకి దిగకపోయి ఉంటే బస్సు నీటిలో పూర్తిగా మునిగిపోయి, విద్యార్థుల ప్రాణాలకే ముప్పు ఏర్పడేది. వెనువెంటనే వచ్చి వారిని కాపాడిన 10 మంది రైతుల పేర్లను పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్రం ప్రభుత్వం అందించే రహ్‌వీర్‌ అవార్డు కోసం జి.కొండూరు పోలీసులు పంపారు. విద్యార్థుల ప్రాణాలను కాపాడిన వారిలో సర్నాల నాగరాజు, బొర్రా రామకృష్ణ, చెరుకూరి రమణ, ఎస్‌కె ఇస్మాయిల్, రాజు, సబ్బరపు సతీష్, ఐ.నరేష్, కలిదిండి వెంకట సుబ్బరాజు, బొల్లిశెట్టి వెంకటరావు, మేరుగ తిరుపతిరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement