తాడేపల్లిలో 35 కుటుంబాల ఆందోళన
ఎలివేటెడ్ కారిడార్ నిర్వాసితులకు వివాదాస్పద భూమిలో ఇళ్ల స్థలాల కేటాయింపు
ఇప్పటికిప్పుడు ఇళ్లు ఖాళీ చేయాలని అధికారుల బెదిరింపులు
తాడేపల్లి రూరల్: రాజధాని అమరావతి ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానిస్తూ సీఆర్‌డీఏ, రాష్ట్ర ప్రభుత్వం పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేసింది. ఆ ప్రాంతంలో నివాసముంటున్న ఇళ్లను తొలగించి నిర్మాణం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇళ్లు కోల్పోతున్న 35 మంది నిర్వాసితులకు తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో 65 సెంట్ల ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. అయితే, ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్న రైతు తన భూమిని ఇతరులకు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇళ్లు కోల్పోయే బాధితులంతా శనివారం ఆందోళన వ్యక్తం చేశారు.
పలువురు మహిళలు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి ఎటువంటి అడ్డంకి కల్పించకుండా తామంతా పూర్తిగా సహకరిస్తున్నామని, గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డు విస్తరణ సమయంలో రెండు సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించి ఇళ్ల నిర్మాణానికి, ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందజేశారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నిర్వాసితులకు సెంటున్నర చొప్పున స్థలమిస్తామని పలుమార్లు చర్చలు జరిపి ఇక్కడి వారందరినీ ఒప్పించారని చెప్పారు.
తామంతా ప్రభుత్వం ఇస్తామన్న ప్లాట్లు తీసుకోగా.. వారం రోజుల నుంచి ఇళ్లు ఖాళీ చేయాలని, పరిహారం చెక్కులిచ్చేశామని, స్థలాలు కూడా కేటాయించామని అధికారులు వచ్చి పదేపదే చెబుతున్నారని తెలిపారు. కనీసం ఆ ప్లాట్లలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని, ఇదేమిటని అడిగితే తమకు తెలియదని, కమిషనర్‌ను అడగాలని చెబుతున్నారన్నారు. 35 నిర్వాసిత కుటుంబాలు వారికి కేటాయించిన భూములను చూసుకునేందుకు వెళ్లగా.. ఆ భూమిలో రైతు వరినాట్లు వేశాడని చెప్పారు.
ఆ రైతును అడగ్గా.. అదంతా తమ భూమి అని, తాను సాగుచేసుకుంటున్నానని, మీరెవరూ రావడానికి వీల్లేదని తెగేసి చెబుతున్నాడని వివరించారు. సోమవారం నాటికి ఇళ్లు ఖాళీ చేయాలంటూ జేసీబీలు తెస్తున్నారని, సోమవారం ఇళ్లను కూల్చి భూమిని చదును చేస్తామని కార్పొరేషన్ సిబ్బంది చెప్పడంతో నిర్వాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తట్ట మట్టి పోయని అధికారులు
గత నెల 22న మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వాసితులందరికీ సెంటున్నర చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అప్పటి నుంచి అధికారులు అక్కడ ఒక తట్ట మట్టి కూడా వేయలేదు. గట్టిగా ప్రశ్నిస్తే హద్దులు నిర్ణయిస్తూ సర్వే రాళ్లు వేశారు. కనీసం రోడ్డు కూడా లేకుండా మోకాళ్ల లోతున నీరున్న స్థలాల్లో ఇళ్లు ఎలా నిర్మించుకోవాలో అర్ధం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లలోకి వెళ్లాలంటే పంట కాలువలో ఫీట్లు చేసుకుంటూ వెళ్లాల్సిందేనని, రైతు పంట వేసిన పొలంలో నిర్మాణాలు ఎలా నిర్మించాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. కనీసం రోడ్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయకుండా తమ పాత ఇళ్లను ఎలా కూలుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
నమ్మి మోసపోయాం
ప్రభుత్వానికి మేం పూర్తిగా సహకరించాం. అధికారులు మాకు చెప్పిందొకటి. ఇక్కడ చేస్తోంది మరొకటి. ఇప్పటంలో మారుమూల రైల్వేట్రాక్ పక్కన జనసంచారం లేని ప్రాంతంలో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించారు. మేం రెండు సెంట్లు అడిగితే స్థలం లేదు సెంటున్నరే ఇస్తామంటే అంగీకరించాం. ఇళ్లు నిర్మించుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఏమీ కల్పించకుండా ఉదయం వచ్చి సాయంత్రం ఖాళీ చేయండని బెదిరిస్తున్నారు. అక్కడకు వెళితే రైతు మమ్మల్ని రానివ్వడం లేదు. మా పరిస్థితి ఏమిటి? – బడే పద్మశ్రీ
సదుపాయాలు కల్పిస్తే ఖాళీ చేస్తాం
ప్రభుత్వం చెప్పిన దానికల్లా మేం అంగీకరించాం. గత ప్రభుత్వంలో రెండు సెంట్ల స్థలం ఇచ్చారు. ఇప్పుడు సెంటున్నర ఇచ్చినా తీసుకుంటున్నాం. ఇవే స్థలాలు మా ఆడపిల్లలకు కట్నంగా ఇచ్చాం. మాకు ముగ్గురు ఆడపిల్లలు. ఇచ్చిన అరకొర స్థలం కూడా మాకు పూర్తిస్థాయిలో అప్పచెప్పకుండా ఇల్లు ఖాళీ చేయాలంటే ఎక్కడకు వెళ్లాలి. ఇక్కడున్న వారందరూ రోజువారీ కూలీలే. ప్రభుత్వం మాపై దౌర్జన్యం చేయకుండా మాకు కేటాయించిన స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. – విజయలక్ష్మి
అనుమతి లేకుండా ప్లాట్లు వేశారు
మా తాతలు, తండ్రుల నుంచి ఇదే భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాను. పట్టాదారు పాస్ పుస్తకానికి దరఖాస్తు చేసుకోగా.. 65 సెంట్లకుగాను 20 సెంట్లకు పుస్తకం ఇచ్చారు. మిగిలిన దానికి ఇవ్వలేదు. దీనిని సాకుగా చూపించి ఇది ప్రభుత్వ భూమి అంటూ నా అనుమతి లేకుండా ప్లాట్లు వేశారు. అందుకే వరినాట్లు వేశాను. – శ్రీనివాసరావు, రైతు


