సివిల్‌ సర్వీసుకు న్యాయ పరిజ్ఞానం తోడ్పాటు | Chief Justice of the High Court Justice Lisa Gill with Law students | Sakshi
Sakshi News home page

సివిల్‌ సర్వీసుకు న్యాయ పరిజ్ఞానం తోడ్పాటు

Aug 23 2026 5:13 AM | Updated on Aug 23 2026 5:13 AM

Chief Justice of the High Court Justice Lisa Gill with Law students

న్యాయ విద్యార్థులు అత్యుత్తమ సివిల్‌ సర్వెంట్లుగా రాణించాలి 

మహిళలు లక్ష్యాలను పరిమితం చేసుకోకూడదు

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌

సబ్బవరం: ‘యూపీఎస్సీ, సివిల్‌ సర్వీసు పరీక్షల్లో న్యాయ విద్యార్థులు రాణించగలరు. ఇందుకు న్యాయ పరిజ్ఞానం తోడ్పడుతుంది. అదేవిధంగా చట్టాలను సమర్థంగా అమలు చేయడంతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు సైతం న్యాయ పరి­జ్ఞానం దోహదపడుతుంది.’ అని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్‌ లీసా గిల్‌ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని శనివారం సీజే జస్టిస్‌ లీసా గిల్‌ సందర్శించారు. యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన విద్యార్థినుల వసతి గృహం, రెండు సమావేశ మందిరాలను ఆమె ప్రారంభించారు. అనంతరం విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల్లో తరగతుల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సీజే జస్టిస్‌ లీసా గిల్‌ విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించే దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు. ప్రతి రంగంలో మహిళలకు కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ, అవి వారి ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలను పరిమితం చేయకూడదని చెప్పారు. మహిళలు భవిష్యత్‌లో మార్గదర్శకులుగా నిలిచేలా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు.

న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం బాగా పెరుగుతోంది
న్యాయవాద వృత్తిలో మహిళల పాత్రపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీజే జస్టిస్‌ లీసా గిల్‌ సమాధానమిస్తూ... న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. పంజాబ్‌–హరియాణ హైకోర్టులో ప్రస్తుతం సుమారు 70 శాతం మంది, పలు రాష్ట్రాల హైకోర్టుల్లో దాదాపు 65 శాతం మంది మహిళా న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. న్యాయరంగంలో పరిస్థితులు మారుతున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. మొదటి తరం మహిళా న్యాయవాదులు వృత్తిలోకి ప్రవేశించినప్పుడు అనేక సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ.. అంకితభావం, పట్టుదలతో వాటిని అధిగమించారని చెప్పారు. న్యాయ విద్యార్థులు అత్యుత్తమ సివిల్‌ సర్వెంట్లుగా రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విశ్వవిద్యాలయ జనరల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. సీజే జస్టిస్‌ లీసా గిల్‌ను యూనివర్సిటీ వీసీ ఆచార్య సూర్యప్రకాశరావు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయసూర్య, మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు, భోపాల్‌ నేషనల్‌ అకాడమీ మాజీ డైరెక్టర్‌ మోహన్‌ గోపాల్, యూనివర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ విశ్వచంద్రనాథ్‌ మదాసు, అకడమిక్‌ డైరెక్టర్‌ సోమా భట్టాచార్య, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement