సర్కారు ‘వెలి’వేత.. గుండె కోత | Veligonda project displaced persons not fully compensated | Sakshi
Sakshi News home page

సర్కారు ‘వెలి’వేత.. గుండె కోత

Aug 23 2026 5:07 AM | Updated on Aug 23 2026 5:07 AM

Veligonda project displaced persons not fully compensated

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో అందని పరిహారం 

నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న అధికారులు  

ఈనెల 27న ట్రయల్‌ రన్‌కు ఏర్పాట్లు.. పునరావాస కాలనీల్లో వసతులు నిల్‌ 

కన్నీటి పర్యంతమవుతున్న నిర్వాసితులు.. అద్దె ఇళ్ల కోసం వెతుకులాట 

పశువులను ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి

పొలాల్లో ఉన్న సామగ్రిని తెగనమ్ముకుంటున్న వైనం 

బరువెక్కిన హృదయాలతో ఊళ్లు ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్న నిర్వాసితులు 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కోసం తమ ఇళ్లు, పొలాలు త్యాగం చేసిన త్యాగధనులు వాళ్లు... వారికి పునరావాసం కల్పించకుండానే  ప్రభుత్వం బలవంతంగా గ్రామాల నుంచి వెళ్లగొడుతోంది. వీరి పునరావాసం కోసం కేటాయించిన కాలనీల్లో మౌలిక వసతులు కల్పించకుండానే గ్రామాలను ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేస్తోంది. దీంతో ఎక్కడికి వెళ్లాలో గతి తోచక తల్లడిల్లుతున్నారు. సర్కారు తీరుతో కన్నీటి పర్యంతమవుతున్నారు. 

అయినా ప్రభుత్వం నిర్దయగా  ఈ నెల 27న నీటి విడుదల ట్రయల్‌ రన్‌కు ఏర్పాట్లు చేస్తుండడంతో  మార్కాపురం జిల్లాలోని పెద్దారవీడు, మార్కాపురం, అర్థవీడు మండలాల్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,555 నిర్వాసిత కుటుంబాలు బరువెక్కిన హృదయాలతో ఊళ్లు ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పొలాల్లోని సామగ్రిని తెగనమ్ముకుంటున్నారు. అద్దె ఇళ్ల కోసం బయట ఊళ్లలో వెతుకులాడుతున్నారు. పశువులను ఎక్కడ పెట్టుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. సుమారు 2 వేల ఎకరాల్లో సాగు చేసిన, మిర్చి, పంటను వదిలేసుకొని రావాల్సి వస్తుందని నిర్వాసిత రైతులు ఆవేదన చెందుతున్నారు. 

ఇళ్లను ఖాళీ చేసేందుకు 6 నెలల గడువు కావాలని కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. పుట్టి, పెరిగిన ఊరు కనుమరుగవుతుందని, ఇక ఉండబోదని తలుచుకుని కుమిలికుమిలి రోదిస్తున్నారు. పూర్తి పరిహారం చెల్లించకుండానే వెళ్లగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్యాకేజీ మొత్తం చెల్లించిన తర్వాత గ్రామాల తరలింపునకు కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి ప్రాజెక్టు పూర్తి చేసుకొని గ్రామాలను తరలించే రోజు నాటికి 18 ఏళ్లు నిండిన ఆడ, మగ ప్రతి ఒక్కరూ అర్హులేనని, వారందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని ముక్తకంఠంతో నినదిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదు. 

1427 మందికి ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలి.. 
2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేస్తే సుమారు 1427 మందికి లబ్ధి చేకూరుతుంది. సుంకేశులలో సుమారు 330 నుంచి 390 మందికి, కలనూతలలో 220 నుంచి 250, గొట్టిపడియ 400 నుంచి 420 మందికి, గుండంచర్ల 300 నుంచి 340 మందికి ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి అర్హత కలిగి ఉన్నారు. పాత ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ప్రకారం సుమారు 350 మంది గెజిట్‌లో నమోదై ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో నూతనంగా వందలాది మంది యువత ఆర్‌ఆర్‌ ప్యాకేజీకి అర్హత కలిగి ఉన్నారు. వీరందరికీ న్యాయం చేయాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. గ్రామాలను ఖాళీ చేస్తే, పరిహారం రాదేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.

ఇల్లు ఎక్కడ?... పునరావాసం ఎక్కడ...? 
మార్కాపురం మండలంలోని కుంట, ఇడుపూరు–1, 2, తోకపల్లి, గోగులదిన్నె తదితర ప్రాంతాల్లో వెలిగొండ నిర్వాసితుల కోసం పునరావాస కాలనీలు ఏర్పాటు చేశామనిచెబుతున్న సర్కారు అక్కడ ఇళ్ల నిర్మాణాన్ని ఇంకా పూర్తిచేయలేదు. వసతులు కల్పించలేదు. అయినా అక్కడికి వెళ్లాలని ఆదేశిస్తుండడంతో ఎక్కడ ఉండాలి? ఎలా బతకాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.   

18 ఏళ్లు నిండినా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వలేదు
మాది వెలిగొండ ప్రాజెక్టు ముంపు కింద పోయే గొట్టిపడియ గ్రామం. నాకు 18 ఏళ్లు నిండినా ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించలేదు. 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ ఇవ్వకపోవడం చాలా బాధాకరం.    – మురికిపూడి జాన్, గొట్టిపడియ గ్రామం   

పరిహారం ఇవ్వకముందే ఖాళీ చేయాలా? 
మాది గొట్టిపడియ గ్రామం. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా చెల్లించకముందే ఇళ్లు ఖాళీ చేయాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. డబ్బులు ఖాతాల్లో జమ కాకముందే ఖాళీ చేయాలని వేధించడం, దౌర్జన్యమే.  ముందుగా అర్హులైన ప్రతి నిర్వాసితుడికి పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించి ఆ తర్వాతే ఖాళీ చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.   – కర్రపోలు వెంకటరత్నం, గొట్టిపడియ గ్రామం   

ఇచ్చిన ఇంటి పట్టాలు వెనక్కి తీసుకున్నారు 
అవార్డులో పేరున్నా ఇప్పటికీ ప్యాకేజి అందలేదు. గ్రామం వదిలి బయటికి పోవాలని అధికారులు చెబుతున్నారు. మండలంలోని తోకపల్లి గ్రామం సమీపంలో నిర్వాసితులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి వసతులు లేవు.  పునరావాస కేంద్రాల్లో ఇంటి పట్టాలు గతంలో ఇచ్చి మళ్లీ వాటిని తిరిగి అధికారులు తీసుకున్నారు. ఇప్పటికీ ఇంటి పట్టాలు ఇవ్వలేదు. ఇంటి పట్టాలు ఇవ్వకపోవడంతో పాటు ఎవరి స్థలం అనేది గుర్తించి చూపించాలి. స్థలం చూపిస్తే అందులో పూరి గుడిసె అయినా వేసుకొని ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్తే ఎక్కడుండాలి? ప్రభుత్వం స్పందించి ఇంటి నివేశçస్థలంతో పాటు ఆ స్థలానికి దిక్కులు చూపించాలి.  – తంగిరాల పెద్దసంజీవయ్య, సుంకేసుల గ్రామం, పెద్దారవీడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement